శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళ అనే కారణంతో ఉద్యోగం నిరాకరించడం వివక్షే: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

1 గంట క్రితం

మహిళ అనే కారణంతో ఉద్యోగం నిరాకరించడం వివక్షే: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ:

స్త్రీ అనే ఒక్క కారణంతో ఉద్యోగాన్ని నిరాకరించడం తీవ్రమైన వివక్షేనని, అది మహిళా శక్తినే అవమానించడమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళలు రాత్రి వేళల్లో పనిచేయలేరని, సిలిండర్లు ఎత్తలేరనే సాకుతో ఉద్యోగం నిరాకరించినందుకు గానూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC)కు అత్యున్నత నాయస్థానం రూ. 12 లక్షల పరిహారం విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.


ఓవైపు మహిళలను దేవతలుగా భావించి గౌరవించాలని ప్రభుత్వం చెబుతుంటే, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఓసీ మాత్రం స్త్రీత్వానికే భంగం కలిగించేలా ప్రవర్తించడం పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "మహిళలు సిలిండర్లు ఎత్తలేరని ఎలా చెబుతారు? ప్రతి ఇంట్లో రోజూ సిలిండర్లను వినియోగించేది వారే. ఆ పని చేయడం వారికి ఏమాత్రం కష్టం కాదు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


కేసు వివరాల్లోకి వెళితే...

హర్యానాలోని గుడా ప్రాంతానికి చెందిన సుమిత్ర అనే మహిళ ఐఓసీకి చెందిన ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్‌లో 'రీఫిల్లింగ్ హెల్పర్' పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని స్థానిక కమిటీ సుమిత్రతో సహా 49 మందిని క్యాజువల్ ఖలాసీ, ప్యూన్, రీఫిల్లింగ్ హెల్పర్ పోస్టులకు సిఫార్సు చేసింది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, మహిళ అనే కారణంతో ఐఓసీ ఆమెకు నియామక ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.


కనీసం ప్యూన్ పోస్టునైనా కేటాయించాలని కోరుతూ సుమిత్ర గతంలో హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆమెకు ప్రతికూలత ఎదురైంది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, బాధితురాలికి న్యాయం చేస్తూ సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్