పెషావర్:
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, కోహట్ జిల్లాలోని 'ఓల్డ్ పోలీస్ లైన్స్' కాంప్లెక్స్ లోపల ఉన్న మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు రెస్క్యూ అధికారులు వెల్లడించారు.
పేలుడు ధాటికి మసీదు పైకప్పు కుప్పకూలడంతో పాటు సమీపంలోని ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే 'రెస్క్యూ 1122' అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికులతో కలిసి శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను వెలికితీశాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతానికి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు.
విస్ఫోటనం సంభవించిన వెంటనే సాయుధ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగినట్లు ఖైబర్ పఖ్తుంఖ్వా ఇన్‌స్పెక్టర్ జనరల్ జుల్ఫికర్ హమీద్ తెలిపారు. పేలుడు పదార్థాలతో ఉన్న వాహనంతో కాంప్లెక్స్‌ను ఢీకొట్టి ఉండవచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నప్పటికీ, దాడి స్వభావాన్ని పూర్తిస్థాయిలో నిర్ధారించాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కోహట్ రీజినల్ పోలీస్ ఆఫీసర్‌ను ఐజీ ఆదేశించారు. ఇలాంటి దాడులు పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని ఆయన స్పష్టం చేశారు.
ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఘటనను ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిది, గవర్నర్ ఫైసల్ కరీం కుందీ తీవ్రంగా ఖండించారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో పోలీసులను, పౌరులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్ మూకలు దాడులు పెంచడం గమనార్హం.








కామెంట్‌లు (0)