జస్టిస్ ఉజ్వల్ భుయాన్
షిల్లాంగ్: ప్రశ్నించడానికి భయపడే సమాజం నిరంకుశత్వానికి సులభంగా లొంగిపోతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ హెచ్చరించారు. సంప్రదాయాన్ని పరిశీలనకు అతీతంగా చూసే సమాజం అన్యాయమైన ఆచారాలను సంస్కరించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. మేఘాలయలోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 12వ స్నాతకోత్సవంలో శనివారం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
శాస్త్రీయ దృక్పథమే చట్టబద్ధ పాలనకు పునాది
శాస్త్రీయ దృక్పథం (సైంటిఫిక్ టెంపర్) చట్టబద్ధ పాలనకు పునాది వేస్తుందని జస్టిస్ భుయాన్ అభిప్రాయపడ్డారు. ‘‘అజ్ఞానం, భయం, పరిశీలించని నమ్మకాలపైనే ఏకపక్ష అధికారం మనుగడ సాగిస్తుంది. రుజువు లేకుండా వాదనలను అంగీకరించే సమాజం మూఢనమ్మకాలకు, తప్పుడు సమాచారానికి బలవుతుంది. ప్రశ్నలకు భయపడే సమాజం నిరంకుశత్వానికి లోనవుతుంది. సంప్రదాయాన్ని పరిశీలనకు అతీతంగా భావించే సమాజం అన్యాయమైన పద్ధతులను సరిదిద్దుకోలేకపోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజా తర్కాన్ని (పబ్లిక్ రీజనింగ్) ఆరోగ్యకరమైన భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి ‘‘అసలైన సారాంశం’’గా ఆయన అభివర్ణించారు. ‘‘దీనికి సమాచారం తెలిసిన పౌరులు కావాలి. సమాచారం అందుబాటులో ఉన్నప్పుడే అది సాధ్యం. కాబట్టి సమాచారమే కీలకం’’ అని అన్నారు. సమాచార ప్రసారం, దానిపై ప్రజా తర్కంతో జరిగే పరిశీలన కలిసి, ప్రజాస్వామ్య సమాజం న్యాయంతో ప్రతిధ్వనించే ప్రక్రియలో భాగమవుతాయని ఆయన వివరించారు.
నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ 2009లో రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ, అందులో సంస్థాగత ప్రజాస్వామ్యానికి, కార్యాచరణాత్మక ప్రజాస్వామ్యానికి మధ్య ఉన్న తేడాను సేన్ వివరించారని, ప్రజా తర్కానికి ఆ గ్రంథంలో ప్రత్యేక వివరణ ఉందని గుర్తు చేశారు. అలాగే, విద్యాసంస్థల్లో వైవిధ్యం గురించి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం అనేది తమ చుట్టూ ఉన్న భిన్నత్వాన్ని కనుగొనే ప్రదేశమని ఆయన అన్నారు. ‘‘వారు వేర్వేరు భాషలు మాట్లాడతారు, వేర్వేరు మతాలకు చెందినవారు, వేర్వేరు ప్రాంతాలు, జాతి నేపథ్యాల నుంచి వచ్చినవారు. వారి పెంపకం, ఆహారపు అలవాట్లు, ఆలోచనా విధానాలు, సాంస్కృతిక గుర్తింపులు మీకంటే భిన్నంగా ఉండవచ్చు. ఈ వైవిధ్యం ముందు మనల్ని మనం ‘అన్‌లెర్న్’ చేసుకోవాలని, ఆ తర్వాత ఉమ్మడి విలువలను కనుగొనాలని చెబుతుంది’’ అని ఆయన విద్యార్థులకు సూచించారు. భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని, వైవిధ్యాన్ని కాదనుకోకుండా గౌరవించాలని స్పష్టం చేశారు.
విభజన వద్దు..
భారత రాజ్యాంగ ప్రవేశిక ‘భారత ప్రజలమైన మేము’ అనే మాటలతోనే మొదలవడం యాదృచ్ఛికం కాదు. రాజ్యాంగం ఒక వర్గంతోనే మాట్లాడదు. పౌరులందరినీ రాజ్యాంగ వ్యవస్థలో సమాన సభ్యులుగా సంబోధిస్తుంది. భిన్న గుర్తింపులు ఉన్నప్పటికీ రాజ్యాంగ చట్రంతో ఐక్యమైన ప్రజలందరికీ ‘మనం’ అనే భావన రాజ్యాంగ రూపం ఇస్తుంది. వ్యక్తిగత, సమూహ గుర్తింపులు మన ఉమ్మడి రాజ్యాంగ ఐక్యతను తగ్గించవు’’ అని జస్టిస్ భూయాన్ పేర్కొన్నారు. ‘‘మనం- వారు’’ అనే ద్వంద్వ భావనకు దూరంగా ఉండాలని, తమకు భిన్నమైన అభిప్రాయాలను గౌరవించిన తర్వాతే సొంత అభిప్రాయం ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు. ‘‘ఈ ఉమ్మడి వేదికలో నేర్చుకోవడం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదు. భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ ఒకరి దృక్కోణాన్ని మరొకరు గౌరవించి, అర్థం చేసుకున్నప్పుడే అసలైన అభ్యాసం జరుగుతుంది. పోటీ వాదనలు, సామాజిక సంఘర్షణల వల్ల మనం సులభంగా ‘విభజన’ అనే ఉచ్చులో పడతాం. ఇష్టంగానో, అయిష్టంగానో ‘మనం- వారు’ అనే తప్పుడు కథనంలోకి లాగబడతాం’’ అని ఆయన అన్నారు. సమాజాన్ని మరింత న్యాయబద్ధంగా, మానవీయంగా మార్చాలంటే ఈ విధ్వంసకర విభజన నుంచి బయటపడి ఏకత్వ భావనను స్వీకరించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.








కామెంట్‌లు (0)