బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజర్మనీలో జనాగ్రహం

2 రోజుల క్రితం

జర్మనీలో జనాగ్రహం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 10:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సమస్యలపై నిరసన గళం విప్పిన యువత

బెర్లిన్‌ : పెరిగిపోతున్న జీవనవ్యయంపై జర్మనీలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రాజధాని బెర్లిన్‌, ఆర్థిక కేంద్రమైన ఫ్రాంక్‌ఫర్డ్‌ నగరం, కొలోన్‌, హాంబర్గ్‌, మ్యూనిచ్‌ సహా 34 నగరాల్లో లక్ష మందికి పైగా యువత శనివారం రాత్రి వీధుల్లోకి వచ్చారు. భద్రతాబలగాలు అడ్డుకునేందుకు యత్నించడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు నీటి ఫిరంగులను ప్రయోగించారు. లాఠీ ఛార్జి చేశారు. దీంతో ఆందోళనకారలు కూడా ప్రతిఘటన కోసం బాణసంచా, రాళ్లు, సీసాలను పోలీసులపైకి విసిరినట్లు కథనాలు వచ్చాయి. ఇదే క్రమంలో కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు. ఫ్రాంక్‌ఫర్డ్‌ నగరంలో దుకాణాలు లూటీకి గురయ్యాయి.

పాఠశాలలకు నిధుల కొరత, అధిక జీవనవ్యయం, ప్రభుత్వ వ్యయంలో కోతలకు నిరసనగా 'జెన్‌ జడ్‌ రెగెల్ట్‌' అనే సంస్థ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఫ్రాన్స్‌లో యువత నేతృత్వంలో వెల్లువెత్తిన నిరసనలు ఇప్పుడు జర్మనీకి కూడా పాకాయి. ఫ్రాన్స్‌లో కూడా శనివారం మూడు లక్షల మందికి పైగా ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. పగటి వేళ శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు రాత్రి సమయానికి హింసాత్మకంగా మారుతున్నాయి.

శాంతి, స్వేచ్ఛ కోసమే ప్రదర్శనలు

ఫ్రాంక్‌ఫర్డ్‌లోని ప్రధాన వాణిజ్య కూడలిని పోలీసులు మూసివేశారు. నగరంలో అనేక మందిని అరెస్ట్‌ చేశారు. యుద్ధం, బలవంతం కోసం కాకుండా శాంతి, స్వేచ్ఛ కోసం ప్రదర్శనలు జరుగుతున్నాయని జెన్‌ జడ్‌ రెగల్ట్‌ ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్‌ తెలిపారు. విద్య, వైద్య వ్యవస్థలకు మెరుగైన మద్దతు ఇవ్వడమే తమకు అత్యంత ముఖ్యమైన విషయమని, నిర్బంధ సైనిక సేవలకు తాము వ్యతిరేకమని ఆమె చెప్పారు. అయితే ఫ్రాంక్‌ఫర్డ్‌లో హింసాత్మక అల్లర్లు జరుగుతున్నాయని, నిరసనకారులు అనేక దుకాణాల కిటికీలను ధ్వంసం చేశారని, అత్యవసర సేవల సిబ్బందిపై పెట్రోలు బాంబులు విసిరారని పోలీసులు తెలిపారు. తుపాకుల దుకాణంలో కొందరు వ్యక్తులు ప్రవేశించి ఆయుధాలను అపహరించుకొని పరారయ్యారని చెప్పారు. అల్లరి మూకలు కొన్ని దుకాణాల్లో చొరబడి స్పీకర్లను, ఇతర వస్తువులను దొంగిలించారని అన్నారు.

నిర్బంధ సైనిక శిక్షణపై నిరసనలు

ఫ్రాన్స్‌లో జరిగిన దోపిడీలు, గృహ దహనాలు, దాడుల వంటి ఘటనలను మనం ఆదర్శంగా తీసుకోకూడదని హెస్సే రాష్ట్ర అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రోమన్‌ పోసెక్‌ యువతను కోరారు. శనివారం రాత్రంతా కొనసాగిన హింసాత్మక ఘటనలు ఆదివారం ఉదయానికి ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తున్న నిర్బంధ సైనిక శిక్షణ, నియామకాలను యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బడ్జెట్‌ కోతలను నిరసిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్