భారత్ వంటి బలమైన దేశాలతో వ్యూహాత్మక పొత్తులు అవసరం : నెతన్యాహు
ఇజ్రాయెల్ : భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. అమెరికా విధానాల్లో మార్పులు చోటుచేసుకునే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, భారత్ వంటి బలమైన దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. లాటిన్ అమెరికా దేశాలతోనూ సంబంధాలను విస్తరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం ... మరో రెండేళ్లలో ఇజ్రాయెల్ పట్ల శత్రుభావంతో వ్యవహరించే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ఆ వ్యక్తి పురుషుడైనా, మహిళ అయినా కావచ్చని పేర్కొంటూ.. అటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అధికారులు ఆలోచించాలని ప్రశ్నించారు. అమెరికాతో సంబంధాలను భవిష్యత్తులో ఎలా నిర్వహించాలనే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. అమెరికా విధానాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఇజ్రాయెల్ తన వ్యూహాత్మక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నెతన్యాహు పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో అమెరికా సహకారంతో సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలని అన్నారు. అదే సమయంలో, భవిష్యత్తులో అమెరికా వైఖరిలో మార్పులు వచ్చినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఇతర దేశాలతోనూ సంబంధాలను విస్తరించుకోవాలని స్పష్టం చేశారు.
భారత్ చిన్న దేశమేమీ కాదు ...
కొత్త కూటములను ఏర్పాటు చేసుకోవడం, ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ తన అంతర్జాతీయ ప్రభావాన్ని పెంచుకోవాలని నెతన్యాహు సూచించారు. భారత్ చిన్న దేశమేమీ కాదని వ్యాఖ్యానిస్తూ, భారత్ వంటి బలమైన దేశాలతో భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. లాటిన్ అమెరికా, బ్రెజిల్ వంటి ప్రాంతాలు, దేశాల్లోనూ త్వరలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కూటముల పరిధిని విస్తరించడంతో పాటు, ఇతర దేశాలకు విలువ చేకూర్చగల సామర్థ్యాలను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నెతన్యాహు వ్యాఖ్యలపై ప్రత్యర్థి విమర్శలు
మరోవైపు .... ఎన్నికలకు ముందు నెతన్యాహు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రధాన ప్రత్యర్థి గాడి ఐసెన్‌కోట్ తప్పుబట్టారు. ఇతర దేశాల పేర్లను ప్రస్తావిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల వేళ అంతర్జాతీయ సంబంధాలు, అమెరికాతో భవిష్యత్తు భాగస్వామ్యం వంటి అంశాలు ఇజ్రాయెల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.







కామెంట్‌లు (0)