- ఇదంతా దుష్పచారమంటూ ఖండన
బీజింగ్ : అమెరికా చిప్ కంపెనీ నివిడియా సిఇఓ జాన్సన్ హుయాంగ్‌ను ఇరికిస్తూ గూఢచారి కుట్రకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలను చైనా సోమవారం కొట్టిపారేసింది. ఈ గూఢచర్య ఆరోపణలు నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం బీజింగ్‌పై సాగిస్తున్న దుష్పచారం మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గుయో జియాకున్ సోమవారం పేర్కొన్నారు.
ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌తో తనకు సన్నిహిత సంబంధముందని అంగీకరిస్తూ హుయాంగ్ సోమవారం నివిడియా బోర్డుకు తెలియచేశారు. అయితే ఆమె పేరును వెల్లడించలేదు. ఆ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గూఢచారి అని, చైనా కోసం సమాచారం సేకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. చైనా పౌరురాలైన అలిస్ హుయాంగ్ అనే వ్యక్తితో సంబంధముందని పేర్కొంది. అమె చైనా తరపున గూఢచారిగా పనిచేస్తోందని తెలిపింది. ఆ వార్తా కథనాన్ని చైనా ఇప్పటికే తోసిపుచ్చింది.
చైనాకు అత్యంత అధునాతనమైన కంప్యూటర్ చిప్‌ల అమ్మకాలను సాగిస్తున్నారా లేదా అనే అంశంపై తలెత్తిన వివాదానికి హుయాంగ్ ప్రస్తుతం కేంద్ర బిందువుగా వున్నారు. ఈ సాంకేతికతలు చైనాకు అందకుండా అమెరికాలో ఆంక్షలు వున్నాయి. ఆ ఆంక్షలను ఉల్లంఘించి ఈ చిప్‌లు చైనాకు వెళుతున్నాయా అనే విషయమై అనుమానాలు నెలకొన్నాయి. యాపిల్, మైక్రోసాఫ్ట్‌లతో పాటూ ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీల్లో నివిడియా కూడా ఒకటి. కాగా ఈ కేసుపై దర్యాప్తును ప్రారంభిస్తున్నట్లు నివిడియా ఆదివారం ప్రకటించింది.







కామెంట్‌లు (0)