- ఇజ్రాయిల్ ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
టెల్ అవీవ్ : దశాబ్దాల నెతన్యాహు శకానికి తెర పడింది. ఇజ్రాయిల్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హర్జోగ్ ‘యషార్’ పార్టీ అధినేత, ఇజ్రాయిల్ రక్షణ దళాల (ఐడిఎఫ్) మాజీ చీఫ్ ఐసెన్‌కోట్‌ను ఆహ్వానించారు. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును పక్కనపెట్టి ప్రతిపక్ష నేతను అధ్యక్షుడు ఆహ్వానించడం ఇజ్రాయిల్ రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా మారింది. జెరూసలేంలోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఐసెన్‌కోట్‌కు ప్రభుత్వ ఏర్పాటు బాధ్యతను లాంఛనంగా అప్పగించారు. దీంతో 19 ఏళ్ల పాటు దేశ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకున్న నెతన్యాహుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి, గాజా యుద్ధం, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో దేశానికి కొత్త దిశను చూపుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నెతన్యాహుపై వ్యతిరేకత పెరగడం, ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి రావడంతో ఇజ్రాయిల్ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఎన్నికల అనంతరం ప్రతిపక్షాల్లో సర్దుబాట్లు వేగంవంతమయ్యాయి. మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ సైతం ఐసెన్‌కోట్‌కు మద్దతు ప్రకటించారు. 28 రోజుల్లోగా ఐసెన్‌కోట్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆయన విఫలమైతే, అధ్యక్షుడు మరొక ఎంపీకి మరో 28 రోజుల గడువు ఇస్తారు. అదీ సఫలం కాకపోతే, కనీసం 61 మంది ఎంపీలు కలిసి ఒక అభ్యర్థిని సూచించవచ్చు. దీనికి 14 రోజుల గడువు ఉంటుంది. అదీ విఫలమైతే నెసెట్ రద్దయి మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.







కామెంట్‌లు (0)