సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ మహిళలకు ఉద్యోగం ఓ పరీక్ష!

1 గంట క్రితం

education
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 04:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఈ రోజుల్లో ‘ఉద్యోగం సంపాదించడం ఒక సవాలు’గా ఉంది అనుకుంటాం. అయితే తాజా నివేదికలు ఉద్యోగం దొరికిన తర్వాత దాన్ని కొనసాగించడం మహిళలకు పెద్ద సవాలుగా ఉందని చెబుతున్నాయి. కులం, మతం, ప్రాంతం వంటి సామాజిక అంశాలు ఇందులో కీలకంగా మారుతున్నాయి. సురక్షితమైన వసతి, రవాణా, ఇంటి అద్దెకు సంబంధించిన వివక్ష, ఇతర అదనపు ఖర్చులు.. ఇవన్నీ మహిళల ఆదాయంలో గణనీయమైన భాగాన్ని తినేస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగం ద్వారా ఆర్థికంగా ఎదగాల్సిన మహిళలు పొదుపు చేయలేని పరిస్థితి నెలకొంటుంది.

​ఢిల్లీలోని ఓ కార్పొరేట్‌ సంస్థలో 23 ఏళ్ల ఆయేషా 2024 నుంచి పనిచేస్తోంది. సామాజిక శాస్త్రాల్లో మాస్టర్స్‌ పూర్తి చేసిన ఆమెకు ప్రారంభంలో నెలకు రూ.40 వేల వేతనం వచ్చింది. అయితే సురక్షితమైన ప్రాంతంలో, మెట్రోకు సమీపంలో ఉన్న పీజీ వసతికి నెలకు రూ.18 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఆహారం, ప్రయాణం, నిత్యావసరాలు, ఇంటికి పంపే డబ్బు పోగా నెలాఖరుకు ఆమె చేతిలో మిగిలేది సుమారు రూ.1,000 మాత్రమే. ఆయేషా పరిస్థితి ఒక్కరిదే కాదు.. ఉద్యోగం కోసం నగరాలకు వచ్చే ఎందరో మహిళల పరిస్థితి ఇదే!

​ఉద్యోగాలు పెరిగాయి.. అయితే..

2025 జనవరి-డిసెంబర్‌ కాలానికి సంబంధించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే ప్రకారం మహిళల కార్మిక భాగస్వామ్య రేటు 40 శాతానికి చేరింది. 2017-18లో ఇది 23.3 శాతంగా ఉండేది. అంటే మహిళల ఉద్యోగ భాగస్వామ్యంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో నమోదైంది. ఇంటి పనులు, వ్యవసాయం, ఇతర వృత్తి పనుల్లో నిమగ్నమైన కొంతమంది మహిళలను ‘స్వయం ఉపాధి’ కింద పరిగణించే విధాన మార్పులు కూడా ఈ గణాంకాలపై ప్రభావం చూపాయి. మరోవైపు నగరాలకు వచ్చి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్న తొలి తరం దళిత, ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న జీవన వ్యయాలు, వసతి, భద్రత వంటి సమస్యలు ఈ సగటు గణాంకాల్లో కనిపించలేదు.

​ఒంటరిగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు వచ్చే మహిళలు పురుష సహోద్యోగులతో పోలిస్తే సురక్షితమైన వసతి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. సెక్యూరిటీ ఉన్న పీజీ, మెట్రో స్టేషన్‌కు నడిచి వెళ్లేంత దగ్గరలో ఇల్లు, రాత్రివేళ కూడా భద్రంగా ఇంటికి చేరుకునే ప్రాంతం.. ఇవన్నీ అదనపు ఖర్చుతో కూడుకున్నవే. సురక్షితమైన వసతితో పాటు రాత్రి ఆలస్యంగా ఆఫీసు నుంచి తిరిగి రావాల్సి వస్తే షేర్డ్‌ ఆటోకు బదులు యాప్‌ ఆధారిత క్యాబ్‌ను ఆశ్రయించాల్సి రావడం కూడా మరో అదనపు భారం. ఢిల్లీలో 2023-25 మధ్య ఉద్యోగాలు చేస్తున్న 10 మంది మహిళలతో జరిపిన సంభాషణల ఆధారంగా చూస్తే, ఇలాంటి అదనపు ఖర్చులు ఫ్రెషర్‌ ఉద్యోగి చేతికి వచ్చే వేతనంలో సుమారు 10-15 శాతం వరకు ఉంటాయని తేలింది. అంటే ఒకే జీతం తీసుకుంటున్న పురుషుడు, మహిళ ఖర్చులు ఒకేలా ఉండడం లేదు.

​ఇల్లు అద్దెకు వివక్ష

కుల, మత వివక్ష కూడా మహిళలపై ఆర్థిక భారాన్ని పెంచుతోంది. ఢిల్లీ, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, గురుగ్రామ్‌, నోయిడా ప్రాంతాల్లో దళితులు, ముస్లింలకు ఇల్లు అద్దెకు ఇవ్వడంలో వివక్ష ఉన్నట్టు గత పరిశోధనలు చెబుతున్నాయి. 2012లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం, ఉన్నత కులానికి చెందిన వ్యక్తి ఇంటి కోసం సంప్రదించినప్పుడు యజమాని స్పందించే అవకాశంతో పోలిస్తే ముస్లిం వ్యక్తికి స్పందించే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంది. ముఖ్యంగా సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలో ముస్లిం దరఖాస్తుదారులు ఎక్కువగా ప్రతికూలతను ఎదుర్కొంటున్నారు. కొంతమంది బ్రోకర్లు ముస్లిం మహిళలకు తమ మత గుర్తింపును దాచుకోవాలని, బయటకు కనిపించే మతపరమైన గుర్తులను తొలగించుకోవాలని సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.

మహిళలు తమకు నచ్చిన ప్రాంతంలో ఇల్లు తీసుకోవడం కాకుండా.. ఇల్లు దొరికే ప్రాంతానికే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా ఎక్కువ దూరం ప్రయాణించడం, అదనపు రవాణా ఖర్చులు, బ్రోకరేజ్‌ చెల్లింపులు పెరుగుతున్నాయి. ఇల్లు వెతుక్కోవడంలో ఎదురయ్యే తిరస్కరణ, వివక్ష మానసిక ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. నగరంలోని అద్దె ఇళ్ల మార్కెట్‌లో ఎదురైన ఇబ్బందుల కారణంగా కొంతమంది ముస్లిం మహిళలు ముంబైలో ఉద్యోగాలు చేయాలనే ఆలోచనను కూడా విరమించుకున్నారని అధ్యయనం చెబుతోంది.

​రుతుక్రమం కూడా మరో భారం..

ఉద్యోగం చేసే మహిళలకు రుతుక్రమం కూడా ఆర్థిక, ఉద్యోగ సంబంధిత సమస్యగా మారుతోంది. 2015లో సుమారు 1,000 మంది మహిళలపై నిర్వహించిన ఓ అధ్యయనంలో కనీసం 70 శాతం మంది రుతుక్రమ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్టు తేలింది. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న 23 ఏళ్ల ముస్లిం మహిళకు ప్రతి నెలా రుతుక్రమం కారణంగా ఒక రోజు అనారోగ్య సెలవు తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఆమె పనిచేస్తున్న సంస్థ ఏడాదికి 18 రోజుల కలిపిన సెలవులు మాత్రమే ఇచ్చేది. దీంతో ఏడాది చివరికి వచ్చేసరికి కుటుంబాన్ని కలవడానికి లేదా ఇంటికి వెళ్లడానికి అవసరమైన సెలవులు కూడా ఆమెకు మిగిలేవి కావని అధ్యయనంలో పేర్కొన్నారు.

​జీతం ఒకటే.. జీవితం కాదు..

ఒకే నగరంలో, ఒకే రూ.40 వేల ప్రారంభ వేతనంతో ఉద్యోగంలో చేరిన ఇద్దరు మహిళల పరిస్థితులు ఒకేలా ఉండడం లేదు. సామాజికంగా, ఆర్థికంగా బలమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళకు సురక్షితమైన ఇల్లు, నగరంలో పరిచయాలు, అవసరమైనప్పుడు కుటుంబం నుంచి ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంటుంది.కానీ తొలి తరం దళిత లేదా ముస్లిం మహిళల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఉద్యోగం కోసం నగరానికి రావడం, సురక్షితమైన వసతి వెతుక్కోవడం, ఎక్కువ రవాణా ఖర్చులు భరించడం, ఇంటికి డబ్బు పంపడం.. ఇవన్నీ వారి జీతంపై అదనపు భారాన్ని మోపుతాయి. దీంతో ఆర్థిక భద్రత లేకపోవడంతో ఉన్నత విద్య కోసం పెట్టుబడి పెట్టడం, కొంతకాలం నిరుద్యోగాన్ని తట్టుకోవడం, నచ్చని ఉద్యోగాన్ని వదిలి మరో ఉద్యోగం వెతుక్కోవడం వంటి అవకాశాలు కూడా ఈ మహిళలకు తగ్గిపోతాయి. ఇదే సమయంలో కుల, మత ఆధారిత అసమానతలు ఉద్యోగ మార్కెట్‌లోనూ కొనసాగుతాయి.

కనిపించని అసలు సమస్య

మహిళల ఉద్యోగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు ప్రధానంగా నైపుణ్యాల కొరత, కుటుంబ బాధ్యతలు, పితృస్వామ్య భావజాలం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. అయితే మహిళలు ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఎదుర్కొనే నగర జీవన వ్యయాలు, భద్రత ఖర్చులు, గృహ వివక్ష, కుల-మత వివక్ష వంటి అంశాలపై ఇకనైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మహిళల ఉద్యోగ భాగస్వామ్యంపై ప్రభుత్వాలు విడుదల చేసే గణాంకాల్లో వారి సామాజిక వర్గం, గ్రామీణ-పట్టణ ప్రాంతాలు వంటి వివరాలను మరింత స్పష్టంగా నమోదు చేయాలి. ఉద్యోగం చేసే ప్రతి మహిళ కథ ఒకేలా ఉండదు. దళిత మహిళ, ముస్లిం మహిళ, పట్టణ మహిళ, గ్రామీణ మహిళ.. ఒక్కొక్కరి ఉద్యోగ ప్రయాణంలో ఒక్కో రకమైన అడ్డంకి ఉంటుంది. కాబట్టి మహిళలకు ఉద్యోగాలు కల్పించడం మాత్రమే సరిపోదు. ఆ ఉద్యోగాన్ని కొనసాగించడానికి అవసరమైన సురక్షితమైన వసతి, అందుబాటులో ఉండే రవాణా, వివక్ష లేని వాతావరణం కల్పించాలి. అప్పుడే ఉద్యోగం.. మహిళలకు కేవలం జీతాన్ని తెచ్చి పెట్టే ఆదాయ వనరుగా కాక, ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చి పెట్టే ఆలంబనగా మారుతుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్