సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖరీఫ్‌ ఖాళీ!

1 గంట క్రితం

ap banner
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 03:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- 25 లక్షల ఎకరాల్లో విత్తు లేనట్లే

- లక్షల ఎకరాల్లో ఎండుతున్న పంటలు

- దిగుబడులపై తీవ్ర ప్రభావం

- ప్రత్యామ్నాయాలపై సర్కార్‌ సాచివేత

- కరువు మండలాల ప్రకటనపై చివరి వరకు వేచిచూపే

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : సూపర్‌ ఎల్‌‌నినో, నైరుతి రుతుపవనాలు వైఫల్యం కారణంగా ఈ మారు ఖరీఫ్‌ ఖాళీగానే కనిపిస్తోంది. ఆగస్టు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రాన్ని తీవ్ర వర్షాభావం వీడలేదు. అక్కడ ఇక్కడ అనే వ్యత్యాసం లేకుండా యావత్‌ ‌రాష్ట్రం కరువు పీడనకు గురైంది. సీజన్‌‌ మూడు నెలల్లో ఏ ఒక్క రోజూ ఏ జిల్లా సాధారణ వర్షపాతం నోచుకోలేదు. ఆగస్టు 31 నాటికి సగటున 53.41 శాతం తక్కువ వర్షం పడింది. జూన్‌ 1 ‌నుంచి సోమవారం వరకు సాధారణ వర్షపాతం 424.17 మిల్లీమీటర్లు కాగా 197.59 మిమీ మాత్రమే పడింది. కోస్తాంధ్రలో వర్షపులోటు 49.47 శాతం కాగా రాయలసీమలో 53.21 శాతం తక్కువ వర్షం పడింది. అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు అత్యల్ప వర్షం (లోటు 60-99 శాతం) కేటగిరిలో కొనసాగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో వర్షపు లోటు గరిష్టంగా 76.15 శాతం కాగా ప్రకాశంలో లోటు 70 శాతం, చిత్తూరు లోటు 64.30 శాతం. వర్షపు లోటు 50 శాతానికిపైన ఉన్న జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, బాపట్ల, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప. రాష్ట్రంలో 688 మండలాలకుగాను 628 మండలాల్లో వర్షాభావం, డ్రైస్పెల్స్‌లతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌‌లో 91 శాతానికిపైన భూభాగం దుర్భిక్షంతో అలమటిస్తోందని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇటువంటి దుర్భర పరిస్థితులు ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడలేదని రైతులు, సీనియర్‌ ‌సిటిజన్లు, నిపుణులు చెబుతున్నారు. జూన్‌‌లో సాధారణ వర్షంలో 25.19 శాతం వర్షపు లోటు నెలకొనగా జూలైలో ఏకంగా వర్షపు లోటు 67.90 శాతానికి చేరుకుంది. ఆగస్టు మొదటి వారంలో వాయుగుండం, అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల వలన అడపాదడపా వానలు కురిసినా అనంతరం నెల మొత్తం వర్షాలు బిగేయడంతో వర్షాభావం తీవ్రమైంది. ఆగస్టులో 55.86 శాతం వర్షపు లోటు నెలకొంది. ఖరీఫ్‌‌నకు మిగిలింది సెప్టెంబర్‌. ఈ నెలలోనూ వానలు అంతంతేనని వాతావరణ శాఖ తెలిపింది. కరువు తప్పదని అర్థమవుతోంది. కాగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలపై ప్రకటనలకే పరిమితమైంది. తీవ్ర కరువు ఉన్నా మండలాల ప్రకటనపై సెప్టెంబర్‌ ‌వరకు వేచిచూడాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

పాతిక లక్షల ఎకరాల్లో సాగు లేనట్లే

ఖరీఫ్‌ ‌సాధారణ సాగు విస్తీర్ణం 77 లక్షల ఎకరాలు కాగా ఆగస్టు చివరాఖరుకు సుమారు 50 లక్షల ఎకారాల్లో సాగు నమోదైందని చెబుతున్నారు. ఈ గణాంకాలు తాత్కాలికమైనవనీ అంటున్నారు. ఈ సీజన్‌‌లో పాతిక లక్షల ఎకరాల వరకు సాగు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. విత్తనాలు పడక లక్షల ఎకరాలు బీడు పడనున్నాయి. వరి, పప్పులు, తృణధాన్యాలు సహా భారీగా ఆహారధాన్యాల సాగు తగ్గనుంది. నూనెగింజలు ఆరు లక్షల ఎకరాల వరకు తగ్గవచ్చని చెబుతున్నారు. నీటి కొరతతో వరి సైతం లక్షల ఎకరాల్లో తగ్గే అవకాశం ఉంది. తొలకరిలో, అనంతరం అడపాదడపా కురిసిన వర్షాలకు వేసిన పంటలు తదుపరి సరైన వానల్లేక చాలా చోట్ల ఎండుతున్నాయి. కెసి కెనాల్‌, కృష్ణా డెల్టా సహా వరి సాగయ్యే ప్రాంతాల్లో ఈ తడవ నీటి లభ్యత లేక సేద్యం నిలిచిపోయింది. శ్రీశైలంలోకి ఆగస్టు మధ్యలో వరద రాగా అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌జలవిద్యుదుత్పత్తి చేస్తుండటంతో రాయలసీమకు నీరు విడుదల చేస్తామన్న ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కృష్ణా డెల్టాకు సైతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి నీరు విడుదల చేయలేదు. పులిచింతల నుంచి కొద్దిమేర మొదట్లో నాట్లకు విడుదల చేశారు. ప్రస్తుతం పట్టిసీమపైనే ఆధారం. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల వలన కృష్ణా డెల్టాలో గణనీయంగా రైతులు వరి నాట్లు వేశారు. ప్రస్తుతం కృష్ణా డెల్టాను వర్షాభావం పట్టి పీడిస్తోంది. మరోవైపు కాల్వలకు విడుదలవుతున్న అరకొర నీరు సక్రమంగా చివరి భూములకు చేరక నాట్లు ఎండుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

దిగుబడులపై ప్రభావం

అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, డ్రైస్పెల్స్‌, భూగర్భజలాలు లోతులు చూడటం, విద్యుత్‌ కోతల ధాటికి పంటలు ఎదగట్లేదు. నీటి కొరత వెంటాడుతోంది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల వలన 20 శాతం మేర దిగుబడులు తగ్గుతాయనగా, నష్టం ఇంకా ఎక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఒక్కో ప్రాతంలో మొత్తానికే పంటలు చేతికిరాని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్