సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మంచుకొండంత విషాదం

1 గంట క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆకస్మిక వరద ప్రవాహం బారినపడి నేపాల్ లోని రెండు జిల్లాలు దాదాపు తుడుచిపెట్టుకు పోవడం, వేల మంది గల్లంతు కావడం పెను విషాదం. ఇప్పటికి 903 మంది మృతులుగా తేలినా 4247 మంది ఆచూకీ కానరాకపోవడం... అందులో భారత్ సహా 35 దేశాల నుండి వచ్చిన పర్యాటకులు ఉండడం గుండెల్ని కలిచివేస్తుంది. పట్టణాలకు పట్టణాలే బురదలో కూరుకుపోయినప్పుడు, గ్రామాల ఆచూకీ కూడా తుడిచిపెట్టుకు పోయినప్పుడు, నలభై కిలోమీటర్ల దాకా హై వేలు, పదుల సంఖ్యలో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు, వంతెనలు కొట్టుకుపోయినప్పుడు, వేలకొద్దీ ఇళ్లు నేలమట్టం అయినప్పుడు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం లెక్కలు ఇప్పుడే తేలవు. వారి కష్టం, నష్టం, బాధ తీర్చలేనివి. అయితే ఈ తరహా ముప్పు ఇంకా ముగియనట్టు, మళ్ళీ వెంటనే వచ్చే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇలా మంచు చరియలు విరిగిపడి, కరిగి, పెద్ద పెట్టున జల ప్రవాహాలుగా మారి పరీవాహక ప్రాంతాల్ని ముంచెత్తడం, అపార నష్టం కలిగించడం ఈ దశాబ్దంలో ఎక్కువైంది. హిమాలయాల వద్ద వేడిమి పెరగడం, మంచు కరిగి కొత్తగా సరస్సులేర్పడడం, అవి ప్రమాదాల్ని కడుపులో దాచుకుని పొంచి ఉండడం... ఇవన్నీ మానవుడు పర్యావరణాన్ని కాపాడుకోలేకపోవడాన్ని ఎత్తి చూపిస్తున్నాయి. ఆయా సున్నిత ప్రాంతాల్లో అభివృద్ధి, పర్యాటకం పేరుతో నిర్మాణాలు, హైడ్రో ప్రాజెక్టులు, వంతెనలు కడుతూ పోవడం ఒక ముఖ్య కారణం. ముందుగా పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాజీ పడకూడదు. నేపాల్ విదేశాంగ మంత్రి అభిప్రాయ పడ్డట్టు భారత్, చైనా, నేపాల్, భూటాన్ దేశాలపై హిమాలయాల్ని కాపాడుకోవాల్సిన ఉమ్మడి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి సరిహద్దులు పాటించదు. ముప్పు విచక్షణ చూడదు. వైపరీత్యాలతో మానవాళి పాఠాలు నేర్వాలి.

​- డా.డి.వి.జి.శంకరరావు,

మాజీ ఎంపీ, విజయనగరం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్