సెప్టెంబర్ 1వ తేదీన 70వ సంస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఇన్సూరెన్స్ దిగ్గజం ప్రభుత్వరంగ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' దేశానికే గర్వకారణం.
245 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజల నుండి ప్రీమియం రూపంలో వసూలు చేసిన మొత్తాలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకుంటూ పాలసీదారులను మోసం చేస్తున్న నేపథ్యంలో అన్ని ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీలను కలిపి భారతీయ జీవిత బీమా వ్యాపారం జాతీయం చేయబడింది. ఏ లక్ష్యాలతో అయితే భారతీయ జీవిత బీమా వ్యాపారాన్ని జాతీయం చేసి ''లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా''గా ఏర్పాటుచేయటం జరిగిందో ఆ జాతీయీకరణ లక్ష్యాలను సాధించటంలో ఎల్‌ఐసి విజయవంతమైంది.
సెప్టెంబర్ 1, 1956న పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడిన ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ గత 70 సంవత్సరాలుగా జాతీయీకరణ లక్ష్య సాధన ద్వారా దేశీయ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచింది. దేశ ఆర్థిక రంగాభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా ఉంచింది. ఎల్‌ఐసి మొత్తం పెట్టుబడులలో 82 శాతం గవర్నమెంట్ సెక్యూరిటీలుగానూ, దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్దేశించినవే.
1956లో కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై అనంతరం, 2011లో ''ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ'' నియమాల ప్రకారం రూ.100 కోట్లు పెట్టుబడిగా మార్పు చేసుకుంది. 'ప్రజల సొమ్ము ప్రజల శ్రేయస్సు'కే అనే లక్ష్యంతో ప్రారంభమైన ఎల్‌ఐసి 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 14.57 లక్షల మంది ఏజెంట్లతో పటిష్టమైన మార్కెటింగ్ నెట్‌వర్క్‌తో వివిధ స్థాయిలలో 3836 ప్రాంతాలకు తన కార్యాలయాలను విస్తరింపచేసింది. 25.35 కోట్ల వ్యక్తిగత పాలసీదారులను, 10 కోట్లకు పైగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీదారులను కలిగి ఉంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి మొత్తం ఆదాయం రూ.9,79,078 కోట్లు. మొత్తం ప్రీమియం ఆదాయం రూ.5,35,984 కోట్లుగా నమోదుచేసి పాలసీదారులకు రూ.4,96,104 కోట్లు చెల్లింపులను చేసింది. ఎల్‌ఐసి మొత్తం ఆస్తుల విలువ రూ.59,03,876 కోట్లుగానూ, లైఫ్ ఫండ్ రూ.51,63,872 కోట్లను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల జిడిపి కన్నా ఎక్కువన్నది గమనార్హం. ప్రైవేటు, ఫారిన్ కంపెనీలతో పోటీపడి 2025-2026 సంవత్సరంలో ప్రీమియం ఆదాయంలో 56.66 శాతం మార్కెట్ షేర్‌ను కైవసం చేసుకోవడంతో పాటు, మొత్తం సర్‌ప్లస్ ఆదాయం రూ.1,23,266 కోట్లుగా నమోదుచేసింది.
2025-2026 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.12,207 కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందజేసింది. ప్రతి సంవత్సరం సుమారు రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులను దేశ ఆర్థికాభివృద్ధికి అందిస్తున్నది. ఎల్‌ఐసి ఎంబెడెడ్ వాల్యూ రూ.7.89 లక్షల కోట్లు. మొత్తం భారత దేశంలో ఉన్న మ్యూచువల్ ఫండ్ సంస్థల ఆస్తుల కన్నా ఎక్కువ విలువైన ఆస్తులను ఎల్‌ఐసి కలిగి ఉన్నది. ఇప్పటివరకు ఎల్‌ఐసి ప్రభుత్వానికి సుమారు రూ.40 వేల కోట్లు డివిడెండ్‌గా అందించింది.
భారత దేశ బీమా రంగంలో స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలను అనుమతించి 24 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 23 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలతో పోటీపడి 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసి రూ.2,60,464 కోట్ల మొదటి ప్రీమిమం ఆదాయాన్ని రూ.1.84 కోట్ల మేరకు పాలసీలను కైవసం చేసుకుని 65.16 శాతం మార్కెట్ షేర్‌తో ప్రభుత్వ రంగ ఎల్‌ఐసి ఇన్సూరెన్స్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 2.54 కోట్ల క్లెయిములకు గానూ రూ. 3,12,771 కోట్ల మొత్తాన్ని పాలసీదారులకు చెల్లించింది. 99.44 శాతం డెత్ క్లెయిములను పరిష్కరించి, క్లెయిముల చెల్లింపు అంశంలోనూ, ఎక్కువ మొత్తం పాలసీదారులు కలిగి ఉన్న విషయంలోనూ ప్రపంచంలోనే ఎల్‌ఐసి అతి పెద్ద సంస్థగా ఆవిర్భవించింది.
దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ఎల్‌ఐసికు అనేక అనుబంధ సంస్థలు ఉన్నాయి. 14 దేశాలకు ఎల్‌ఐసి విస్తరించి ఉన్నది. ఎల్‌ఐసిలో 3.5 శాతం మేరకు ఈక్విటీ షేర్లను 20,557 కోట్ల మేరకు డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలన్న తన విధాన నిర్ణయాన్ని ప్రభుత్వం అమలుపరిచింది. ఈ ప్రక్రియలో ఎల్‌ఐసి ఎంబెడెడ్ విలువను అతి తక్కువగా చేసి చూపించారనే విమర్శను ప్రభుత్వం ఎదుర్కొన్నది. 76 లక్షల అప్లికేషన్లతో పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ వల్ల ఎల్‌ఐసి-ఐపిఒ 3 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది.
సెబీ నిబంధనల ప్రకారం 10 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ కలిగి ఉండాలనే సాకు చూపి, 'ఆఫర్ ఫర్ సేల్' (ఒఎఫ్‌ఎస్) పేరుతో, ఎల్‌ఐసి 1:1 బోనస్ షేర్లను జారీ చేసిన అనంతరం మరొక 6.5 శాతం ప్రభుత్వ వాటాను ఉపసంహరించారు. 'ఆఫర్ ఫర్ సేల్' 3.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యి రూ.31,552 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి. ఎల్‌ఐసిపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ప్రభుత్వం అమ్ముకోవటం సర్వత్రా విమర్శనాత్మకమైనది.
స్టాక్ మార్కెట్‌లో ఎల్‌ఐసి షేర్ విలువ తీరుకు, వాస్తవ ఎల్‌ఐసి వ్యాపార పనితీరుకు అంతరం ఉంది. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలతో పోల్చినపుడు ఎల్‌ఐసి పనితీరు స్థాయి ఎక్కువగానూ, నిర్వహణ ఖర్చు చాలా తక్కువగానూ ఉంది. ఎల్‌ఐసి నిర్మాణశైలి షేర్ విలువ లాభాలకన్నా, సమాజ శ్రేయస్సుకు సంబంధించిన అంశాలతో ముడిపడి ఉంటుంది.
కేవలం నష్టాలలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ, వాటాల ఉపసంహరణ చేస్తామని పేర్కొనే ప్రభుత్వం, దీనికి భిన్నంగా ప్రతిష్టాత్మకమైన ఫార్చూన్-500 కంపెనీల జాబితాలో నిలిచి దేశానికే వన్నెతెచ్చిన ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థ ఎల్‌ఐసి వాటాలను అమ్ముకుని బడ్జెట్ లోటును పూడ్చుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడాన్ని పౌర సమాజం హర్షించదు.
2047 నాటికి ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్‌ను అందించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన ప్రస్తుత తరుణంలో... రాజ్యాంగ పీఠిక ప్రబోధించిన సమానత్వం, సార్వభౌమత్వం అనే కీలక అంశాలే ప్రాతిపదికగా... అద్భుత పనితీరుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన, దేశ ఆర్థిక వ్యవస్థకు అమృత తుల్యమైన ఎల్‌ఐసి వంటి ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థను డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రభుత్వ వాటాలను అమ్ముకోవటం ప్రజామోదయోగ్యం కాదు.
- వ్యాసకర్త : జి.కిశోర్ కుమార్,
ఎ.పి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఎల్.ఐ.సి ఉద్యోగ సంఘం ఎస్.సి.జడ్.ఐ.ఇ.ఎఫ్ జాయింట్ సెక్రటరీ,
సెల్: 9440905501






కామెంట్‌లు (0)