పర్వతం కంటి నుండి
నదిలా ప్రవహించిన శోకం
ఆకాశం నేలకొరిగిన క్షణం,
సృష్టి తన సంతకాలను
తానే తుడిచేసుకున్న సమయం.
కోపంతో ఉప్పొంగిన ప్రవాహానికి
దేశాల సరిహద్దులు తెలియవు.
కుంభవృష్టిగా కురిసే మట్టి మేఘాలకి
పాస్‌పోర్టులు, వీసాలు అక్కర్లేదు.
రక్తాశ్రువుల ఏటిలో మునిగిన నగరాలు,
ఇది కేవలం రాళ్లూ రప్పల కూల్చివేత కాదు,
అహంకారపు శిఖరాలకు ప్రకృతి పేర్చిన సమాధి.
కాలపు పుటల్లో మిగిలిన ఒక నల్లని మచ్చ,
శిఖరాల నుండి రాలిన కన్నీరు
నేలతో కలిసి బురద ముసుగు తొడిగింది.
పచ్చని పొలాలు శిథిలారణ్యాలై,
ఇళ్ల వాకిళ్లు సమాధి రాళ్ళుగా మారాయి.
తొక్కిన అడుగు ప్రతిదీ పూడికైపోగా,
కన్న కలలన్నీ బురద ఒడిలో కరిగిపోయాయి.
కేకలు కూడా మూగబోయిన చోట
కళ్ల ముందే మునిగిపోయిన ఆశలు.
అది నీటి ప్రవాహం కాదు,
ప్రకృతి కోపపు విలయ దావానలం.
ఇప్పుడిక్కడ మిగిలింది
ఒకే భూమి, ఒకే శోకం, ఒకే విలయం.
- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
సెల్: 8008577834







కామెంట్‌లు (0)