శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅన్నకు ప్రాణదానం చేసిన రెండేళ్ల చిన్నారి

1 గంట క్రితం

rakhsabandan.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 05:56 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్‌ చుట్టూ అనేక కథలు వినిపిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోమ్‌, ఖుషి యాదవ్‌ల కథ కూడా అలాంటిదే. తలసేమియాతో బాధపడుతున్న తన అన్న సోమ్‌ను చెల్లెలు ఖుషి తన రక్త మూలకణాలు దానం చేసి కాపాడింది. అప్పుడు ఆమె వయసు కేవలం రెండేళ్లు. సోమ్‌కు ఐదు నెలల వయసులోనే తలసేమియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత అతని చెల్లెలు సౌమ్యకు కూడా అదే వ్యాధి ఉన్నట్లు తేలింది. తలసేమియా వారసత్వంగా వచ్చే రక్త సంబంధిత వ్యాధి. శరీరం తగినంత ఆరోగ్యకరమైన హిమోగ్లోబిన్‌ను తయారు చేయలేకపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. తీవ్రమైన తలసేమియాతో బాధపడేవారికి తరచూ రక్త మార్పిడి అవసరమవుతుంది. చిన్న గ్రామంలో నివసించే ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి ప్రతి నెలా రక్తం, మందులు సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారింది.

సోమ్‌, సౌమ్యలకు కుటుంబంలో పూర్తి స్థాయి హెచ్‌ఎల్‌ఏ మ్యాచ్‌ దొరకలేదు. దీంతో కొన్నేళ్లపాటు వారు క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేయించుకున్నారు. ఈ పరిస్థితుల్లో 2021లో కుటుంబంలో మూడో బిడ్డగా ఖుషి పుట్టింది. నారాయణ హెల్త్‌, కాష్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో డీకేఎంఎస్‌ ఫౌండేషన్‌ ఇండియా కుటుంబ సభ్యులకు ఉచితంగా హెచ్‌ఎల్‌ఏ పరీక్షలు నిర్వహించింది. అందులో ఖుషి తన అన్న సోమ్‌కు 12/12 హెచ్‌ఎల్‌ఏ మ్యాచ్‌ అని తేలింది. అంటే సోమ్‌కు అవసరమైన రక్త మూలకణాలను ఖుషి దానం చేయగలదని నిర్ధారణ అయింది. ఆ విషయం కుటుంబంలో కొత్త ఆశలు నింపింది.

2023లో రెండేళ్ల వయసున్న ఖుషి తన అన్న సోమ్‌కు రక్త మూలకణాలను దానం చేసింది. తలసేమియాతో సంవత్సరాలుగా పోరాడుతున్న సోమ్‌కు ఈ మార్పిడి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు సోమ్‌ ఆరోగ్యంగా పాఠశాలకు వెళ్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఖుషి కూడా అన్నతో కలిసి పాఠశాలకు వెళ్తూ, ఆటలాడుతూ పెరుగుతోంది. తనకు తెలియని వయసులోనే అన్నకు ఎంత గొప్ప బహుమతి ఇచ్చిందో ఆమెకు ఇప్పటికీ తెలియదు. రక్షాబంధన్‌ అంటే అన్న చెల్లిని కాపాడతానని ఇచ్చే వాగ్దానంగా సాధారణంగా భావిస్తారు. కానీ సోమ్‌, ఖుషి కథ ఆ బంధానికి మరో అర్థాన్ని చూపిస్తోంది. అవసరమైన సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం, కష్టాల్లో భరోసా ఇవ్వడం, ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడం కూడా రక్షణలో భాగమే.

ఈ కథ వైరల్‌ కావడానికి డీకేఎంఎస్‌ ఫౌండేషన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పాట్రిక్‌ పాల్‌ చేసిన పోస్టు కారణమైంది. “ప్రతి రోగికి కుటుంబంలో సరైన స్టెమ్‌ సెల్‌ డోనర్‌ దొరకడం సాధ్యం కాదు. భారతదేశంలోని జన్యు వైవిధ్యం కారణంగా సంబంధం లేని డోనర్‌లో సరైన మ్యాచ్‌ను కనుగొనడం మరింత కష్టమవుతోంది” అని ఆయన పేర్కొన్నారు. డీకేఎంఎస్‌ సమాచారం ప్రకారం, సంబంధిత వయసు గల భారతీయుల్లో కేవలం 0.09 శాతం మంది మాత్రమే బ్లడ్‌ స్టెమ్‌ సెల్‌ డోనర్లుగా నమోదయ్యారు. కుటుంబంలో మ్యాచ్‌ దొరకని రోగులకు కుటుంబం వెలుపలి డోనర్ల అవసరం ఏర్పడుతుంది. అందువల్ల మరింత మంది భారతీయులు డోనర్‌ రిజిస్ట్రీలో నమోదు కావాల్సిన అవసరం ఉందని సంస్థ చెబుతోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 10 వేల మందికి పైగా పిల్లలు తలసేమియా మేజర్‌తో జన్మిస్తున్నట్లు అంచనా. అర్హత ఉన్న రోగులకు బ్లడ్‌ స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ వ్యాధి నుంచి కోలుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే సరైన డోనర్‌ను గుర్తించడం, చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం ఇప్పటికీ అనేక కుటుంబాలకు సవాలుగానే ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్