శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition' హల్వా' లాండ్!

1 గంట క్రితం

For Nalli.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 05:12 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

" కారం, వెటకారంతో కాలం గడవదండీ! పనులు జరగాలంటే, మనసులో ఎలా ఉన్నా, మాటలు తియ్యగా ఉండాలి"

" మా ప్రేంతంలో నోట్లో బూర్లొండడం అంటారు లెండి! పనైపోయిన తర్వాత బూరీ వుండదూ..గారీ వుండదూ!"

" ఉండదని తెలిసేలోగా మన పనైపోతుంది కదా పరదేశీ!"-నవ్వుతూ అన్నాడు నారాయణమూర్తి.

" సారూ! మీ లవుక్యానికి మా ఏరియా షావుకార్లు సరిపోరు"

" లౌక్యంలోనే సౌఖ్యం ఉందని చెప్పేవాడు మా జుత్తాడ కరణం.. సచ్చిపోయి, ఏ లోకంలో ఉన్నాడో!? "--అన్నాడు దశుమంతునాయుడు, కారు కిటికీలో నుంచి ఆకాశం వంక చూస్తూ!

" అవున్సార్! ఉన్నోడికైనా, లేనోడికైనా షుగరుండొచ్చు గానీ పొగరుండకూడదు! కడుపులో కత్తులున్నా కౌగిలించుకోవాల! అది తెలియకే యుద్ధంలో బొబ్బిలోళ్లు దెబ్బైపోయారు."-- బుస్సీ కూడా మాట కలిపాడు. మూర్తి కొత్తగా కొన్న కోటి రూపాయల కారు మాడుగుల వైపు పరుగెడుతుంది.. దూరంగా చెరువు చూసి, దాహంతో ఉన్న గుర్రంలా!

" మొత్తానికి మన వాల్వా కారుకి ఇవాళ హల్వా గాలి రుసి తగులుతుందన్నమాట!"-

నవ్వుతూ అన్నాడు పరదేశి. కొన్న తర్వాత విశాఖ నుంచి ఇదే తొలిసారి దూరం ప్రయాణం." హల్వా అంటే గుర్తొచ్చిందీ ..మన బాబు గారి దృష్టి ఈ మధ్య మాడుగుల మీద పడిందేటి? మొన్నొచ్చి ఈ ప్రాంతంలో పరిశ్రమలు కుమ్మరించేస్తానని ప్రకటించి వెళ్లారు"- నాయుడు అసలు విషయాన్ని చర్చకు తెచ్చాడు.

" స్టేజి మీదే మన ఎమ్మెల్యే తినిపించేసినాడని మనం భోగాపురంలో ఉన్నప్పుడు కొండబాబు ఫోన్లో చెప్పలేదా!"--పరదేశి గుర్తు చేశాడు.

" ఇక్కడ కాదండీ.. గత జనవరిలో ఆలిండియా డ్వాక్రా బజార్ ప్రారంభానికి వచ్చి, మాడుగుల స్టాల్లో తిన్నారు. చాలా సేపు అక్కడే ఉండి, దాని తయారీ, మార్కెట్ సదుపాయం గురించి మహిళలతో మాట్లాడారు"-మూర్తి చెప్పాడు.

" అద్గదీ సంగతి.. కారం, గోంగూర దగ్గర హల్వా తింటే ఎవరు మర్చిపోగలరు? అందులోనూ మాడుగుల హల్వా! ఇంగవ కట్టిన గుడ్డలా ఎంటాడుతాది "

" అలా కాదు పరదేశీ.. విశాఖపట్నంలో భూములు ఎక్కడా లేవు. ఇటు అనకాపల్లి దాటి నర్సీపట్నం వరకు వచ్చేశాం. అటు భీమిలి దాటి భోగాపురం, పూసపాటి రేగ వరకూ, వెళ్లిపోయాం. ఒకే దగ్గర వందల ఎకరాలు కావాలంటే, ఎక్కడ దొరుకుతాయి?"-అన్నాడు మూర్తి."

అవున్లెండి.. ప్లెయిన్ దోస లాటి వొయిజాగు పేపర్ దోశయిపోయింది "

" అల్లూరి జిల్లా ఏజెన్సీ బోర్డర్ వరకు వచ్చేస్తే, ఆ తర్వాత కొండలెక్కిపోవడం సులువే! మాడుగుల మండలం బోర్డర్ గదా! "

" అవునండీ! ముందు మాడుగుల మోదకొండమ్మ దీవనలు అందిపోతే, ఆ తర్వాత పాడేరు మోదకొండమ్మని ప్రాధేయపడొచ్చు"

"చెప్పడం మర్చిపోయాను. సీఎం గారు వచ్చి వెళ్లిన తర్వాత, ఇక్కడ కూడా భూములకు ఇప్పుడే కాకపోయినా, ఆశలకైతే ఈపాటికే రెక్కలొచ్చేసి ఉంటాయి. మనం రైతుల గాలితీస్తూ మాట్లాడాలి. నా మాటలు బట్టి వేరే జిల్లా వాడు అని పోల్చేస్తారు. మీరు కూడా, గాలి తీయడానికి మాటలు కలపండి"-- ప్లాన్ చెప్పాడు మూర్తి. ఇలాగా మాడుగుల ఊరు వచ్చేసింది. నాయుడు ఫ్రెండ్ కొండబాబు, సేరీ ( పెద్ద తోట )దగ్గర ఎదురు చూస్తున్నాడు. గేటు దగ్గరే కారు దిగి, పరిచయాలైన తర్వాత లోపల బంగ్లా వైపు నడిచారు. ముందు హాల్ చాలా రిచ్ గా ఉంది. మూర్తికి తెగ నచ్చింది. కుర్చీలకు ఎదురు సోఫాలో నలుగురు రైతులు కూర్చున్నారు. గోడకు అలంకరించిన ఏనుగు దంతాలు, దుప్పి కొమ్ములు వైపు చూస్తూ, కూర్చున్నాడు బుస్సీ. నాయుడు దృష్టి..పులి తల...వెనుక పరిచిన పులి చర్మం మీద ఉంది. పరదేశి మాత్రం టేబుల్ మీద పెట్టిన హల్వా ప్లేటు అందుకున్నాడు. మూర్తి కూడా తింటూ," కొండబాబు గారూ! ఏంటి విషయం? మనకు ఓ అయిదొందల ఎకరాలు సరిపోతుంది.. ఏమండీ!"-- నాయుడు, బుస్సీ వైపు తిరిగి అడిగాడు మూర్తి. వాళ్లు ఉలిక్కిపడి, చర్చలో జాయినయ్యారు.

" అవునవును.. కుదిరితే మరి కొంత తీసుకుందాం. ఏదైనా మా కొండబాబు ఎలా చెబితే అలాగే! "- అన్నాడు నాయుడు.

" వీళ్ళు పయివోళ్లు కాదండీ..మా బాగార్లే( దాయాదులు)! ఆళ్ల ఉద్దేశం కూడా అడగాలి కదా!( నవ్వి) సెప్పండ్రా!"-అన్నాడు వాళ్ళ వైపు తిరుగుతూ కొండబాబు.

" బాబు గారొచ్చి ఎనౌన్స్ చేసెళ్లిన తర్వాత, మరి మా రైతులకు నిద్దర్లు లేవండీ"-- ఓ వృద్ధ రైతు నవ్వుతూనే చెప్పాడు.

" ఆయనంతే.. నిద్రపోడూ, నిద్రపోనివ్వడూ!"-- అంటూ, తినడం పూర్తి చేసి, వేళ్ళకు అంటిన జిగుర్ని నాలుకతో క్లీన్ చేస్తున్నాడు పరదేశి. ఆ మాటకు అందరూ నవ్వారు.

" ఆయన వచ్చి అలాగే అనేసి వెళ్ళిపోతారండి.. ఒకప్పుడు అందరం నమ్మేవాళ్లం.. ఎప్పుడైతే, ఐదు వేల కోట్ల రూపాయల ఎయిర్ పోర్ట్ అని, యస్రాయవరం, అచ్చుతాపురం, సబ్బవరం ఏరియాలు అధికారులను తిప్పి, ఎన్నో ఆశలు పెట్టి.. భోగాపురం దగ్గర బోర్డు పెట్టేశారో.. అప్పుడే, నమ్మకం పోయింది. మాకు "-- నాయుడికింకా, కడుపు మంట తీరలేదు. అయితే, అతని మాటలు రైతుల మీద పడ్డాయి.

"మా విజయనగరం జిల్లాలో ఏమైంది? గిరిజన యూనివర్సిటీకీ అయిదొందలెకరాలు..ఆరొందల కోట్లు అన్నారు. బొబ్బిలి దగ్గర ఎమ్మెల్యే రాజుగారు, ప్రహరీ గోడకి శంకుస్థాపన కూడా చేశారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత, అది సాలూరెల్లిపోయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ శంకుస్థాపన చేశారు "--బుస్సీ చెబుతుండగానే..

" అవునవును.. సెంట్రల్ మినిస్టర్.. మొన్న జెన్ జీల దెబ్బకు రిజైన్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కూడా వచ్చారు.. నాకు బాగా గుర్తు"-అన్నాడు మూర్తి.

" ఓహో.. ఆ దెబ్బకే గావాలా! ముందు జగను.. తర్వాత సెంట్రల్ మినిస్టర్ ఇంటికెళ్ళిపోయారు. అందుకే పెద్దలు.. ఆస్తి కొనేముందు వాస్తు సూడమన్నారు! ఇక్కడ కూడా, మీరు సూసి కొనండి "-- పరదేశి కూడా గాలి తీయడంలో గట్టి పాత్రనే పోషించాడు. రైతుల ముఖాలు పాలిపోవడం గమనించి..పైకి లేచి

" మరోసారి వస్తాం.. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి "- అన్నాడు మూర్తి.

" ఏదైనా, మా కొండబాబు మాటే ఫైనల్.. డీల్ కుదిరితే, అమ్మవారికి పెద్ద సంబరం చేద్దాం"- నవ్వుతూ, పంచె సర్దుకున్నాడు నాయుడు. అందరూ కారు వైపు కదిలారు. కారెక్కేముందు, కొండబాబు చెవి దగ్గర " ఇక, బెజవాడ దగ్గిర హాయిలాండు లాగా, మాడుగుల ' హల్వాలాండే'!.. అయిపోద్దిలే.. నువ్వు హుషారుగా ఉండూ!"-- గుస, గుసలాడి.. పక పకా నవ్వి కారెక్కేశాడు పరదేశి.

- ' నల్లి ' కుట్టు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్