శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆఖరి వరకూ అభ్యుదయ ఉద్యమాలతోనే...

2 గంటల క్రితం

v sumathi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 05:39 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

వల్లిపల్లి సుమతి...కృష్ణా జిల్లా కాటూరు గ్రామంలో పుట్టారు. తల్లి లక్ష్మీ తులసి, తండ్రి నాగభూషణం. అభ్యుదయ భావాలు కలిగిన కుటుంబం వీరిది. అంతేకాదు, ఆమె పుట్టిన కాటూరు అభ్యుదయ భావాలకు, మహిళా ఉద్యమానికి పుట్టినిల్లు. మానికొండ సూర్యావతి, రాజేశ్వరమ్మ, కడియాల బుల్లెమ్మ నాయకత్వంలో అప్పట్లో మహిళా ఉద్యమం నడిచేది. మూఢనమ్మకాలకు, ఛాందస భావాలకు వ్యతిరేకంగా మహిళల్లో, యువతలో పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. అలాగే స్ర్తీ విద్య, వితంతు పునర్వివాహాలు, కులం మతం పట్టింపులు లేని సమాజం కోసం అనేక ఉద్యమాలు అక్కడి నుండే జరిగేవి. అలాంటి చోట పుట్టి పెరగడం వల్ల సుమతిపై కూడా ఆ ప్రభావం పడింది.​

అప్పట్లోనే సాంకేతిక విద్య...

సుమతి వాళ్లు ముగ్గురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. ఆర్థికంగా అంతంత మాత్రమే. అయినప్పటికీ నాగభూషణం దంపతులు తమ పిల్లలను బాగా చదివించారు. ఆ రోజుల్లో ‘ఆడపిల్లలకు చదువెందుకు?’ అని అందరూ అనుకునేవారు. కానీ ఆయన తన ముగ్గురు ఆడపిల్లల్ని సాంకేతిక విద్యలో ప్రోత్సహించారు. అంతేకాదు, గ్రామంలోని మిగతా ఆడపిల్లలను కూడా చదివించమంటూ తల్లిదండ్రులను ప్రోత్సహించేవారు. ఇంట్లో సుమతినే పెద్ద కూతురు. ఆమె సివిల్‌ ఇంజనీరింగ్‌‌లో డిప్లొమా చేసి, ఇరిగేషన్‌ ‌డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉద్యోగం సంపాదించింది. పి.మధును కులాంతర వివాహం చేసుకుంది. అప్పటికే మధు పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా ఉన్నారు. తన చెల్లెళ్లను చదివించడంతో పాటు వాళ్లు కూడా కులాంతర వివాహాలు చేసుకునేలా ప్రోత్సహించిన ఆదర్శమూర్తి సుమతి. భర్త మధు పార్టీ పనుల్లో విరామం లేకుండా తిరుగుతుంటే ఉద్యోగం చేసుకుంటూనే కుటుంబాన్ని చూసుకునేది. అంతేకాదు... పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు ఇంటికి వచ్చినా అందరికీ అన్నీ చేసి పెట్టేది. ఎంతో ప్రేమగా వారినీ తన కుటుంబ సభ్యులుగా ఆదరించేది. అలాగే సైన్స్ ఉద్యమం (జె.వి.వి)లో కూడా కీలక పాత్ర పోషించింది. కూతురు ప్రతిభకు పదేళ్లు వున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నైట్‌ కాలేజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ (డిగ్రీ) సీటు వచ్చింది. కానీ పాప చదువుకోసం దాన్ని విరమించుకుంది.

ఉద్యోగానికి విఆర్‌ఎస్‌ ‌తీసుకొని...

కూతురు ప్రతిభ ఈరోజు డాక్టర్‌ అయ్యిందంటే అందులో సుమతి కృషి చాలా ఉంది. అంతేకాదు ఈ రోజు పి.మధు పార్టీలో ఓ నాయకుడిగా ఎదిగారంటే అందులో ఆమె పాత్ర చాలా కీలకం. తర్వాత ఉద్యోగానికి విఆర్‌ఎస్‌ ‌తీసుకొని మహిళా ఉద్యమంలోకి వచ్చింది. అలాగే ‘ప్రజాశక్తి’లో కొన్ని రోజులు అనువాదకురాలిగా చేసింది. బుక్‌హౌస్‌‌లో ఉంటూ అనేక పుస్తకాలను అనువదించింది. ఉమ్మడి రాష్ట్రంలో ‘ఐద్వా’ అభివృద్ధికి తన వంతు కృషి చేసింది. 2001లో ‘ఐద్వా’ అఖిల భారత 7వ మహాసభ విశాఖపట్నంలో జరిగింది. అప్పడు ఓ సావనీర్‌ ‌తీసుకొచ్చాం. ఆ సావనీర్‌ పనులన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంది. వ్యాసాలు తెప్పించడం, తప్పులు లేకుండా చూడడం, ఫ్రీగా ప్రింటింగ్‌ వేయించడం ఇలా అన్ని పనులూ ఆమె చూసుకుంది.​

‘మానవి’ పత్రిక ప్రారంభించడంలో సుమతి కీలక పాత్ర పోషించింది. పత్రిక బోర్డు సభ్యురాలిగా ఉంటూ ‘మానవి’కి కావాల్సిన వ్యాసాలు తెప్పించడం, రాయడం, దాన్ని బయటకు తీసుకురావడంలో ఎంతో కృషి చేసింది. అలాగే ‘మోటూరు ఉదయం ట్రస్ట్‌’ ప్రారంభంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది. ట్రస్ట్‌‌ సభ్యురాలిగా కూడా ఉంది. ‘ఐద్వా’ రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఉండేది. అప్పట్లో మహబూబ్‌‌నగర్‌ ‌జిల్లా ధన్వాడ ప్రాంతంలో జోగిని వ్యవస్థ బాగా ఉండేది. చాలా మంది మహిళలు బలైపోతూ ఉండేవారు. అప్పట్లో ఇద్దరు పిల్లల తల్లి ఆకలికి తట్టుకోలేక చనిపోయింది. అప్పుడు నేనూ, సుమతి కలిసి ధన్వాడ వెళ్లి పక్కన ఉన్న మరో రెండు గ్రామాల్లో తిరిగి జోగినీల సమస్యలు తెలుసుకున్నాం. సుమతి అయితే వాళ్లతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. వారికి పునరావాసం కల్పించాలని, పిల్లలకు చదువులు చెప్పించాలని కొన్ని డిమాండ్లతో జిల్లా కలెక్టర్‌‌ని కలిసి వినతిపత్రం ఇచ్చాం.​

పెన్షన్‌ ‌మొత్తం విరాళంగా...

రాష్ట్రం విడిపోయిన తర్వాత వారి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌‌కు మారింది. గత కొన్నేళ్లుగా మహబూబ్‌‌నగర్‌‌లో డాక్టర్‌‌గా పని చేస్తున్న తన కూతురు ప్రతిభ దగ్గరే ఆమె ఉంటోంది. కదలలేని స్థితిలో ఉన్నా తనకు వచ్చే పెన్షన్‌‌ మొత్తం రెండు రాష్ట్రాల పార్టీ కమిటీలకు విరాళంగా ఇచ్చేది. ఇటీవల హైదరాబాద్‌‌లో జరిగిన ‘ఐద్వా’ అఖిల భారత మహాసభకు కూడా రూ.30 వేలు విరాళం ఇచ్చింది. ఇదంతా ప్రజా ఉద్యమాలపై ఆమెకున్న ప్రేమకు నిదర్శనం. పార్టీ అన్నా, పార్టీలో పని చేసే పూర్తి కాలం కార్యకర్తలన్నా ఆమెకు ఎంతో ప్రేమ.​

రాజకీయ చైతన్యంతో ఉద్యమాలకు తోడ్పాటు...

నాకైతే వ్యక్తిగతంగా ఎన్నో సలహాలు ఇచ్చేది. పెళ్లి కాక ముందు నుండి నాకు సుమతక్కతో మంచి పరిచయం. మా సృజన పుట్టిన కొత్తలో ఉద్యమాన్ని, పాపని సమన్వయం చేసుకోలేక సతమతమవుతుంటే ఎలా నిర్వహించుకోవాలో సలహాలు ఇచ్చేది. అభ్యుదయ ఉద్యమాలు జరగడం ఓ భాగమైతే వాటి ప్రభావం మనుషులపై చాలా ఉంటుంది. అలా ప్రభావితమైన వ్యక్తి సుమతి. ఆ ప్రభావంతోనే రిటైర్‌ అయిన తర్వాత కూడా పార్టీకి తన వంతుగా సహకారం అందించింది. అప్పట్లో చిర్రావూరిగారినైతే నాన్న అంటూ ఆప్యాయంగా పిలిచేది. నండూరి ప్రసాదరావు అండర్‌గ్రౌండ్‌‌లో ఉన్నప్పుడు సుమతి దగ్గరే ఉండేవారు. ఎం.హెచ్‌‌ తో కూడా ఈమెకు మంచి అనుబంధం ఉండేది. నాయకులందరినీ తన కుటుంబ సభ్యులుగా చూసుకునేది. కుటుంబాల్లో ఉండే మహిళల తోడ్పాటు లేకుండా అభ్యుదయ ఉద్యమాలు కొనసాగించడం సాధ్యం కాదు. అలాంటి పాత్ర పోషించిన వారిలో సుమతి ఒకరు. చివరి రోజుల్లో తన తల్లిని ప్రతిభ కంటికి రెప్పలా చూసుకుంది.


వ్యాసకర్త : ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్