శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవందేమాతరం ఎందుకు వివాదం?

2 గంటల క్రితం

Modi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 05:24 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

‘వందేమాతరం’ – అనే మన జాతీయ గేయాన్ని బంకించంద్ర ఛటర్జీ రాసి, 150 ఏళ్ళయిన సందర్భంగా 2025 డిసెంబర్ 8న లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘‘వందేమాతరం గేయాన్ని నెహ్రూ ముక్కలు చేశారు. దాని ఫలితంగానే ఈ దేశం ముక్కలైంది" అని ప్రకటించారు. వందేమాతర గేయం గూర్చి పూర్తి నిజాలు దేశ ప్రజలకు తెలియజేయకుండా, నెహ్రూ మీద అభాండాలు వేశారు. అలా మాట్లాడ‌టం జాతిపిత గాంధీజీని, నాటి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్‌ను, మౌలానా ఆజాద్ ను, సుభాష్‌ చంద్రబోస్ ను, ఆచార్య దేవ్ ను, విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్‌ను మోడీ అవమానించినట్లయింది. ఎందుకంటే, మన జాతీయ గీతం 'జన గణ మన'తో పాటు వందేమాతరాన్ని కూడా జాతీయ గేయంగా గుర్తించిన ప్రముఖులు వీరంతా.

వందేమాతరాన్ని గుర్తించినపుడు అది రెండు చరణాలదే! అందులో సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం - అంటూ దేశ ఔన్నత్యాన్ని తెలియజేప్పే చరణాలున్నాయి. బంకించంద్ర ఛటర్జీ ఆ రెండు చరణాల గేయం 1875లో రాశాడు. అది 1876లో ప్రచురింపబడింది. భారత ప్రభుత్వం ఆ రెండు చరణాలనే ఆనాడు అధికారికంగా గుర్తించింది. స్వాతంత్రోద్యమ కాలంలో ఉద్యమకారులు ఆ రెండు చరణాలనే పాడుతుండేవారు. ఆ తరువాత కొన్ని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బంకించంద్ర, ఆ రెండు చరణాలకు తోడుగా మరో మూడు చరణాలు రాసి, 1882లో తన 'ఆనంద్ మఠ్‌' నవలలో చేర్చుకున్నాడు. అయితే తర్వాత, నవల కోసం రాసుకున్న చరణాలు ఈ దేశానికి సంబంధించినవి కావు. అవి దేవి/ దుర్గ / కాళీమాత / లక్ష్మి/ సరస్వతి వంటి హిందూ దేవతల ప్రశంసలతో ఉన్నవి. నవలలోని చరణాలు మన జాతీయ గేయంలో భాగం కాదు. వాస్తవం ఇదయితే, పనిగట్టుకుని నెహ్రూను దూషించడానికి దీన్ని ఉపయోగించారు. ఈ గేయం ముక్కలు అయినందువల్లే, హిందుస్తాన్-పాకిస్తాన్ గా దేశం ముక్కలైందనడంలో ఔచిత్యం ఉందా? ​మన టెలిప్రాంప్టర్ ప్రచార (ప్రధాన) మంత్రి తన ఆక్రోశం వెళ్ళగక్కడంలో అర్థం ఉందా? అని ఈ దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

దేశ ఔన్నత్యం గూర్చి రాసిన రెండు చరణాల వందేమాతర గేయానికి 2025 నాటికి 150 ఏళ్ళయ్యింది. బంకించంద్ర ఛటర్జీ ఆ తర్వాత 1882లో రాసిన 3 చరణాలకు 150 ఏళ్ళు రావాలంటే మనం 2032 దాకా వేచి ఉండాలి కదా? ప్రధాని పదవిలో ఉండి అలవోకగా అబద్ధాలాడడం హర్షించదగ్గ విషయమా? దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. మోడీ ఒక అబద్ధానికి తెర లేపగానే, లోక్‌సభలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. విశ్వకవి రవీంద్రుణ్ణి, ఆనాటి మహనీయుల్ని అవమానించినట్లయిందని నినాదాలిచ్చారు. అంత జరిగినా, బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌లో వందేమాతరం బిల్లు ఇటీవల పాస్ చేసుకుంది. అయినా, దేశ ప్రజల్లో ఫెయిల్ అయిన విషయం, అక్కడ పాస్ చేసుకుంటే లాభమేమిటి? గతంలోకి వెళ్ళి కొన్ని వాస్తవాలు వెలికి తీస్తే, అవి ఇలా ఉన్నాయి. ‘వందేమాతం' గురించి చర్చ వచ్చినప్పుడు- అది సాహిత్య విషయం గనక, నాటి ప్రధాని నెహ్రూ విశ్వకవి, నోబెల్ గ్రహీత అయిన రవీంద్రుడి అభిప్రాయం కోరారు. ఆయన కూడా ఆ రెండు మొదటి చరణాలనే ఆమోదించారు. 1937 అక్టోబర్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాతీయ సమావేశంలో తొలిసారి ఆ రెండు చరణాల్ని ఆలాపించారు. ఆ తర్వాత, ఆ రెండు చరణాలనే స్వాతంత్య్ర పోరాట యోధులు గొంతెత్తి పాడుకునేవారు. మొదట రాసిన ఆ రెండు చరణాల్ని ఆమోదించడమే కాకుండా రవీంద్రుడు దానికి బాణిని కూడా సమకూర్చాడు.

సుజలాం సుఫలాం మలయజ శీతలాం

సస్య శ్యామలాం మాతరం - వందే మాతరం

శుభ్ర జ్యోత్స్న పులకిత యామిని

పుల్లకు సుమిత ధ్రుమదళ శోభిని

సుహాసినీం, సుమధుర భాషిణీం

సుఖదాం వరదాం-మాతరం వందేమాతరం (1875)

​తర్వాత రాసి, నవలలో చేర్చిన చరణాలు ఇలా ఉన్నాయి.

సప్త కోటి కంఠ కలకల నినాదే- అన్న చరణంలో బెంగాల్ జనాభా ఏడు కోట్ల గురించి, వారికి ఆరాధ్య దైవమైన దుర్గామాత గురించి ఉంది. మరి మన దేశ జనాభా ఇప్పుడు - 1.48 బిలియన్లు! పైగా సెక్యులర్ దేశం !!

​త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ

కమలా కమలదళ్ విహారిణీ

​వాణీ విద్యా దాయినీ నమామిత్వం

​నమామి కమలా అమలా అతులామ్ (1882)

ఇందులో బిజెపి పార్టీ గుర్తు కమలం ఉన్నందువల్ల, వారు దాన్ని దేశ ప్రజలందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారేమో?

‘ఆనంద్‌ మఠ్‌’ నవల నుండి తీసుకున్న చరణాల గూర్చి ఆ రోజుల్లోనే తర్జన భర్జన జరిగింది. 1939 జులై 1న గాంధీజీ తన 'హరిజన్' పత్రికలో ఇలా రాశారు. బెంగాల్‌లోని హిందూ ముస్లింల మధ్య ఈ గేయం విద్వేషాలు రేకెత్తిస్తున్నట్లయితే - అందరూ కలిసి ఉన్న సమూహాల్లో దీన్ని పాడడం కొందరికి అభ్యంతరకరంగా ఉంటే - తక్షణం దాన్ని పాడడం ఆపేయాలి!" అని! మరోవైపు 1938 అక్టోబర్ లో కరాచీలో జరిగిన ముస్లింలీగ్ కాన్ఫరెన్స్ లో మహ్మదాలీ జిన్నా- వందేమాతరం పట్ల తన తీవ్రమైన అభ్యంతరం తెలియజేశాడు. హిందూ దేవతల ప్రార్థనగా ఉన్న ఈ గేయం ముస్లింల పట్ల ద్వేష భావాన్ని పెంచుతోంది. ముస్లింలు విగ్రహారాధనను ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ ప్రార్థనా గీతాన్ని ఎలా ఒప్పుకుంటారు? -అన్నాడు. ఇలా భిన్నమైన అభిప్రాయాలు ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనే వెలువడ్డాయి. ఇది చారిత్రక సత్యం! అయితే, స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఏర్పడ్డ తొలి భారత ప్రభుత్వం 1950 జనవరి 24న దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఆ మొదటి రెండు చరణాల్ని అధికారికంగా జాతీయగేయంగా గుర్తించింది. జాతీయ గీతంగా ఉన్న జనగణ మన ‘అధినాయక జయహే' తో పాటు వందేమాతరానిక్కూడా ఆ స్థాయీ, గౌరవం ఇచ్చారు. అప్పుడు భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ !

ఇందులో వందేమాతరం గేయాన్ని నెహ్రూ విరగ్గొట్టిందెక్కడ? దేశాన్ని విభజించిందెక్కడ? దేశం విడిపోవడానికి మహ్మద్ ఆలీ జిన్నా ఎంత కారణమో హిందూ మహాసభ కూడా అంతే కారణం. దేశం బ్రిటీషు వారి పాలనలో ఉండాలని కలలుగన్న వారు ఈ హిందూ మహాసభా/ ఆర్‌ఎస్‌ఎస్ వారే కదా? వారి వారసులే జనసంఘ్ / బిజెపి నాయకులయ్యారు కదా? ఈ విషయాలు ఈ దేశంలో ఏ స్కూలు పిల్లాడిని అడిగినా చెప్తారు. స్వాతంత్ర్య పోరాటంలో ఏ మాత్రం పాలు పంచుకోని వీరు, ఇప్పుడు దేశా ప్రజలకు దేశభక్తి గురించి ఉపన్యాసాలిస్తున్నారు.

జాతీయ గీతంగా ఉన్న ‘జనగణమన' ను తొలగించి, దాని స్థానంలో వందేమాతరాన్ని పెట్టాలని కొంతమంది ఆ మధ్య ఢిల్లీ కోర్టులో ‘పిల్సు’ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) వేశారు. ఈ సెక్యులర్ దేశానికి దుర్గామాత స్త్రోతం అవసరం లేదని కోర్టు వాటినన్నింటినీ కొట్టేసింది.

హిందువులూ ముస్లింలు కలిసే బ్రిటీష్ కంపెనీపై తిరుగుబాట్లు చేశారని ప్రస్తుతం అధికారంలో ఉన్న ఓట్‌ చోరి నాయకులకు తెలిసినట్టులేదు. ఈ దేశంలో హిందువులు-ముస్లింలు - క్రైస్తవులు - మైనార్టీలు - ఆదివాసీలు ఎప్పుడైనా కలిసే ఉన్నారు. వీరిని విడగొట్టడానికి ఒకప్పుడు బ్రిటీషు వారు ప్రయత్నించారు. నేడు అధికారంలో వున్న ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.

Devaraju.jpg

వ్యాసకర్త - కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవ శాస్త్రవేత్త ప్రొ.దేవరాజు మహారాజు​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్