శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేపాల్‌ విషాదం

1 గంట క్రితం

G--nepal.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

నేపాల్‌లో ఆకస్మిక వరదలు విరుచుకుపడి 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, 1,300 మందికి పైగా ఆచూకీ తెలియకపోవడం అత్యంత విషాదకరం. ఇది ఇటీవలి కాలంలో హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న అత్యంత దారుణమైన ప్రకృతి విలయం. మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి సృష్టించిన ఉధృత ప్రవాహం గ్రామాలను ముంచెత్తింది. ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలు, విద్యుత్ మౌలిక వసతులు కొట్టుకుపోయాయి. 35 మోటారు వంతెనలు, 45 వేలాడే వంతెనలు, సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. మృతుల సంఖ్య, ఆస్తి నష్టం ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన అనేకమంది భారతీయులు ఈ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలకు చెందిన 288 మంది యాత్రికులు ఈ వరదల్లో గల్లంతైనట్టు సమాచారం. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైలాస యాత్రకు వెళ్లిన 77 మందితో కూడిన బృందం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. తమవారు ఎక్కడున్నారో తెలియక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. భారత ప్రభుత్వం నేపాల్, చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. హిమాలయ ప్రాంతాలను సందర్శించే భారతీయుల భద్రతకు ప్రత్యేకమైన విపత్తు నిర్వహణ, అత్యవసర సమాచార వ్యవస్థ అవసరం ఎంత ఉందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

ఈ దారుణ విపత్తుకు కారణం సాధారణ భారీ వర్షపు వరద కాదు. భూకంపం కారణమని ప్రారంభంలో భావించినా, దాని తీవ్రత అంతగా లేదని నేపాల్ అధికారులు అంటున్నారు. భీకర వరదలకు కారణమయ్యేంత భారీ వర్షపాతం కూడా నమోదు కాలేదని మరొక పరిశీలన. మంచుపెళ్లలు, పెద్ద పెద్ద రాళ్లు, మట్టి విరిగిపడడంతో నదీ మార్గంలో అడ్డంకి ఏర్పడి, పెద్ద ఎత్తున నీరు వెనుకకు చేరిందని; ఆ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో మంచు, రాళ్లు, మట్టి, నీరు కలిసి అత్యంత వేగంతో ప్రవాహం దిగువకు దూసుకొచ్చిందని అంటున్నారు. భోటేకోశి నదిలో మొదలైన ఈ ఉధృత జలరాశి ఒక్కసారిగా త్రిశూలి నదిపై పడింది. కొన్ని ప్రాంతాల్లో నది నీటిమట్టం అరగంటలోనే 15 మీటర్లకు పైగా పెరిగింది. పెద్ద బండరాళ్లు, చెట్లు, మట్టి, మంచు, నిర్మాణాల అవశేషాలతో కూడిన ప్రవాహం అత్యంత విధ్వంసకరంగా మారింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో సాగుతూ ఆ మార్గంలోని ప్రతి చెట్టునూ, నిర్మాణాన్నీ ఊడ్చుకుపోయింది. ఈ వైపరీత్యాన్ని అప్పటికప్పుడు గుర్తించినా, మనుషులు పరుగెత్తి తప్పించుకోవడం, వాహనాలతో దూరంగా వెళ్లడం కూడా సాధ్యం కాలేదు. చూస్తుండగానే జలవిలయం భీకరంగా ముంచెత్తింది.

హిమాలయాల్లో జరుగుతున్న పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఘటనను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు నిల్వలు తగ్గడం, శాశ్వత మంచు పొరలు బలహీనపడటం, కొత్త హిమానీనద సరస్సులు ఏర్పడటం వంటి పరిణామాలు పర్వత ప్రాంతాల స్థిరత్వంపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా మంచు, రాళ్లు విరిగిపడటం, సరస్సులు ఒక్కసారిగా తెగిపడటం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి. హిమాలయాలు ఆసియాలోని అనేక ప్రధాన నదులకు ఆవిర్భావ కేంద్రాలు. అక్కడ జరిగే ప్రతి మార్పూ కోట్లాది ప్రజల జీవనంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి హిమాలయాల పర్యావరణ పరిరక్షణను దక్షిణాసియా భద్రతకు సంబంధించిన అంశంగా చూడాలి. సంబంధిత దేశాలు సమన్వయంతో వ్యవహరించి విపత్తులు నష్టదాయకంగా మారకుండా జాగ్రత్త వహించాలి. నదులకు దేశాల సరిహద్దులు తెలియవు. నేపాల్ పర్వత ప్రాంతాల్లో సంభవించే ఆకస్మిక ప్రవాహాలు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలపైనా ప్రభావం చూపుతాయి. అందువల్ల భారత్, నేపాల్, చైనా మధ్య వాతావరణ సమాచారాన్ని తక్షణమే పంచుకునే వ్యవస్థ అత్యవసరం.

మనదేశంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. 2021లో ఉత్తరాఖండ్‌లోని చమోలీ ప్రాంతంలో జరిగిన భారీ మంచు, రాళ్ల ప్రవాహం జలవిద్యుత్ ప్రాజెక్టులను ధ్వంసం చేసి వందలాది మందిని బలిగొంది. 2023లో సిక్కింలో హిమానీనద సరస్సు ఒక్కసారిగా ఉప్పొంగడంతో తీస్తా నది ఉధృతంగా ప్రవహించి భారీ విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తమ అభివృద్ధి నమూనాపై పునరాలోచించాలి. పర్వత ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలకు పరిమితులు కచ్చితంగా పాటించాలి. హిమాలయాలను కేవలం పర్యాటకానికో, తీర్థయాత్రలకో, జలవిద్యుత్ ఉత్పత్తికో పరిమితం చేయకుండా అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థగా గుర్తించి విధానాలు రూపొందించాలి. హిమానీనద సరస్సులు, కొండచరియలు, నదీ ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేయాలి. ఉపగ్రహ చిత్రాలు, రాడార్ పరిశీలనలు, భూకంప పరికరాలు, నీటిమట్టం, వర్షపాతం కొలిచే కేంద్రాలను అనుసంధానించాలి. నదులకు పూజలూ, పుష్కరాలూ పేరిట కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న పాలకులు ఆ నదుల పరిరక్షణపైనా, పెను విపత్తులు తలెత్తని పద్ధతుల్లో సద్వినియోగం చేసుకోవడంపైనా శ్రద్ధ పెట్టాలి. ప్రకృతి ప్రమాదాలను ఆపలేకపోయినా, వాటిని ముందుగానే గుర్తించి సంసిద్ధం కావడం ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. విపత్తు వచ్చిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం ఎంత ముఖ్యమో, దానికి ముందే భద్రత, హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం అంతకంటే ముఖ్యం. నేపాల్ విషాదం మనకు చేస్తున్న హెచ్చరిక ఇదే!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్