శుక్రవారం, 31 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ఆ` అమ్మలకు అండగా..

55 నిమిషాల క్రితం

kerala mother.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 06:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

బిడ్డలను పెంచడం అమ్మ ఎప్పుడూ భారంగా అనుకోదు. అది తన బాధ్యత అనుకుంటుంది. వైకల్యంతో బాధపడే పిల్లలను చూసుకోవడంలో కూడా అమ్మ తర్వాతే ఎవరైనా. కుటుంబం అడ్డుకున్నా, అవమానాలు ఎదురైనా ఆ బిడ్డలను కంటికి రెప్పలా సాకుతుంది. అయితే అలాంటి బిడ్డలను సాకడంలో మానసికస్థైర్యం ఒక్కటే చాలదు. ఆర్థిక భరోసా కూడా ఆ అమ్మకు కావాలి. చేతిలో డబ్బులు లేకపోతే ఆస్పత్రి ఖర్చులకే కాదు, బిడ్డలకు కావాల్సినవి ఇవ్వడమూ కష్టమే. అలాంటి అమ్మలకు ఆర్థిక దన్నుగా, ఆ బిడ్డల సంరక్షణ కోసం కేరళ తిరువనంతపురంలో 'స్నేహ సంద్రం' అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. దాని వ్యవస్థాపకురాలు షీజా. సాండ్రా ఆమె కూతురు. డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న సాండ్రానే ఈ సంస్థ ఆవిర్భావానికి కారణం.

సాండ్రా 2010లో పుట్టింది. వ్యాధి కారణంగా తను ఎక్కువకాలం బతకదని వైద్యులు పుట్టినప్పుడే చెప్పారు. కానీ షీజా ఆశ వదులుకోలేదు. గత 16 ఏళ్లుగా బతుకుకు, చావుకు మధ్య పోరాడుతున్న కూతురిని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తోంది. అత్యవసర చికిత్సలు, మందులు, నిద్రలేని రాత్రులు ఆమె జీవితంలో భాగమయ్యాయి. అయితే షీజా కలలుగన్న జీవితం అది కాదు. ఉన్నత విద్య అభ్యసించి, క్రీడల్లో రాణించి, మంచి ఉద్యోగం చేయాలని ఆశపడింది. కానీ సాండ్రా పుట్టిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయింది. వైకల్యంతో బిడ్డ పుట్టిందని భర్త వదిలేసి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల సాయంతో బిడ్డను సాకుకున్నా, ఆస్పత్రి ఖర్చులు భరించడం కుటుంబానికి భారమైంది. దీంతో కుట్టుమిషన్‌తో పని చేసి డబ్బులు సంపాదించింది. ఇదంతా ఒక్క షీజా జీవితం మాత్రమే కాదు. వైకల్యంతో బాధపడే పిల్లలను సాకుతున్న ఎందరో తల్లుల జీవితం.

అందరూ ఒంటరివాళ్లే..

ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న షీజా ఒక విషయం గమనించింది. అక్కడ ఎంతోమంది తల్లులు బిడ్డలతో వచ్చారు. వారితో పాటు ఎవరూ లేరు. బిడ్డల సంరక్షణలో వాళ్లు ఒంటరిగానే పోరాడుతున్నారు. కొందరిని భర్తలు వదిలేశారు. అక్కడే షీజాకు విద్య పరిచయమైంది. గణిత ఉపాధ్యాయురాలిగా ప్రైవేటు స్కూల్లో పనిచేసే విద్య, సెరెబ్రల్ పాల్సీతో బాధపడే తన కొడుకు ఆదిని పెంచడానికి చాలా ఇబ్బంది పడుతోంది. మొదట్లో ఏడాదిలో పరిస్థితి చక్కబడుతుందని అనుకుంది. కానీ తర్వాత ఉద్యోగాన్నే వదిలేసి ఆదితో గడపాల్సి వచ్చింది. భర్త కూడా వదిలేశాడు. తన బాధంతా షీజాతో చెప్పుకునేది. విద్యలాంటి తల్లులను షీజా ఆస్పత్రి కారిడార్లలో ఎంతోమందిని కలిసింది.

స్నేహ సంద్రం చారిటబుల్ ట్రస్టు ఒక ప్రణాళిక ప్రకారం మొదలుపెట్టింది కాదు. ఎన్నో సంఘటనలు, ఆస్పత్రుల్లో గడిపిన అనుభవాల నుంచే అది పుట్టుకొచ్చింది. అలాంటి కొన్ని చేదు అనుభవాలను షీజా ఇలా గుర్తు చేసుకున్నారు. 'ఒక సంఘటనలో ఆస్పత్రుల చుట్టూ తిరగలేక ఓ జంట తమ బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. కానీ బిడ్డ మాత్రం బతికింది. మరో సంఘటనలో ఒకామె బిడ్డను కాసేపు చూసుకోమని చెప్పి పై అంతస్తుకు వెళ్లింది. ఆమె మళ్లీ తిరిగి రాలేదు. ఈ ఘటనల్లో నాకు అత్యంత బాధ కలిగించిన విషయం ఏంటంటే.. ఈ తల్లులకు తమను కాపాడే వారు ఎవరూ లేరనే దుఃఖం నిత్యం వెంటాడుతోంది. ఆ బాధే ఈ దారుణాలకు కారణమైంది. ఆ లోటు పూడ్చాలనే ట్రస్టును ఏర్పాటు చేశాను' అని సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న విషాదాన్ని గుర్తుచేసుకున్నారు.

ఐదేళ్లుగా....

2021లో ట్రస్టును ప్రారంభించారు. వైకల్య బాధిత పిల్లలను సాకుతున్న తల్లులకు ఇందులో సభ్యత్వం ఇచ్చారు. ఈ తల్లులకు బిడ్డల సంరక్షణతో పాటు ఆర్థిక వెసలుబాటు కూడా ఉండాలని ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా కుట్టుమిషన్లు, పశుపోషణ, పౌల్ట్రీ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లులు ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరం లేదు. బిడ్డల సంరక్షణ కోసం అయ్యే ఖర్చులు వాళ్లే సొంతంగా సంపాదించుకుంటున్నారు. పనులు చేసుకోవడం, బిడ్డలను చూసుకోవడం వారికి సులువైంది. సంస్థలో భాగమైన షైలీ తన అనుభవాన్ని ఇలా చెప్పింది. 'నా బిడ్డను స్కూల్లో చేర్పించడానికి ఎంతో కష్టపడ్డాను. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని స్కూలు ముగిసే వరకు బయటే కూర్చునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నా పని చేసుకుంటూనే బిడ్డను చూసుకుంటున్నాను. గత నెల నా కూతురు ఫిజియోథెరపీకి అయ్యే ఖర్చును మా నాన్నను అడగకుండా నేనే చెల్లించాను' అని ఎంతో సంతోషంగా చెబుతోంది.

ప్రస్తుతం ట్రస్టు ద్వారా 200 మంది తల్లులు లబ్ధి పొందుతున్నారు. పప్పానంకోడ్‌లో సంస్థ ప్రధాన కార్యాలయం నిర్వహిస్తున్నారు. అయితే నివాస ప్రాంతాల్లో, ఆస్పత్రుల్లోనే ట్రస్టు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రైవేటు దాతలు, సీఎస్‌ఆర్ విరాళాలతో నడుస్తున్న ఈ సంస్థకు సుమారు రూ.40 లక్షల విరాళాలు కావాల్సి ఉంది. ప్రస్తుతం అంత సొమ్ము వాళ్ల దగ్గర లేదు. కానీ షీజా తన లక్ష్యంలో మాత్రం మార్పులేదని చెబుతున్నారు. ఇంకా ఆమె ఇలా చెప్పారు. 'మేము జీవిత పరీక్షల్లో పదేపదే విఫలమైన తల్లులం. అలా పడిపోయిన ప్రతిసారీ ఒకరికొకరం అండగా నిలబడగలిగినప్పుడే అదే మా విజయం' అంటున్నారు.

షీజా ప్రయాణం చాలామందికి చిన్నగా అనిపించవచ్చు. కానీ అది ఒక తల్లి, కూతురు ఆస్పత్రి గదిలో నిశ్శబ్దంగా అనుభవించిన వేదన నుంచి పుట్టింది. ఆ బాధ ఇప్పుడు అలాంటి ఏ తల్లీ పడకూడదన్న సంకల్పంగా విస్తరించింది. ఒకప్పుడు ఆస్పత్రి కారిడార్లలో ఒంటరిగా కూర్చున్న తల్లులకు ఇప్పుడు అక్కడ ఒకరికొకరు అండగా నిలబడే ఎందరో తల్లులు తోడుగా కనిపిస్తున్నారు. అదే 'స్నేహ సంద్రం'.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్