గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆన్ లైన్ వారథిగా...

1 రోజు క్రితం

punya-mohan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అవకాశాల కోసం ఎదురుచూడడం కాదు, వాటిని సృష్టించుకుంటూ ముందుకు ఎలా వెళ్లాలో చాలామంది ఆచరించి చూపిస్తారు. అలాంటి వారిలో ఒకరే కేరళకు చెందిన పుణ్య మోహన్ టీచర్. మలయాళం బోధించే ఈ టీచరమ్మ కోవిడ్ టైంలో ఖాళీగా కూర్చోవడం ఇష్టంలేక ఆన్‌లైన్ బోధన ప్రారంభించారు. ఒకే ఒక్క విద్యార్థితో ఏడాది పాటు క్లాసులు నిర్వహించిన ఆమె, ఇప్పుడు అమెరికా, లండన్, ఖతార్, యుఎఇలో ఉన్న విద్యార్థులకు కూడా క్లాసులు చెబుతున్నారు. గతేడాది సోషల్ మీడియాలో తను ప్రారంభించిన 'మలయాళీ వర్డ్ స్మిత్' పేజీ ద్వారా ప్రస్తుతం దేశ విదేశాల్లో 45 మంది విద్యార్థులకు మలయాళం క్లాసులు తీసుకుంటున్నారు. ఒక పక్క స్కూల్లో బోధన, మరో పక్క ఆన్‌లైన్ బోధనతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పుణ్య తండ్రి ఆటోడ్రైవర్. కూతురును ఆటోలో స్కూలుకు, ఇంటికి తీసుకెళ్లడం అతని దినచర్యల్లో ఒకటి.

​స్కూల్ లాంగ్ బెల్ మోగగానే టీచర్లందరూ వాళ్ల వర్కింగ్ డే పూర్తయినట్లు భావిస్తారు. పుణ్య లాంటి వాళ్లు మాత్రమే రెండో షిఫ్ట్ మొదలైందని అనుకుంటారు. కేరళ కరప్పుజకు చెందిన 28 ఏళ్ల పుణ్యకు చిన్నప్పటి నుండి మాతృభాష అంటే వల్లమాలిన అభిమానం. మలయాళ వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. స్కూల్లో పుణ్యకు సైన్స్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చేవి. అందరూ తను సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారని అనుకున్నారు. కానీ పుణ్య మాత్రం తన హయ్యర్ స్టడీస్‌లో సైన్స్‌కు బదులు మలయాళం ఎంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

​కోవిడ్ చూపించిన అవకాశం..

​కాలేజీ చదువు చదువుకుంటూనే ట్యూషన్లు చెప్పే పుణ్యకు కోవిడ్ టైంలో ఒక అవకాశం తలుపుతట్టింది. యుఎఇలో పనిచేస్తున్న ఒక మలయాళి, పశ్చిమ బెంగాల్‌లో ఉంటున్న 3వ తరగతి చదువుతున్న తన కూతురు ఇషితకు మలయాళం నేర్పించాలని అనుకుంటున్నారు. ఆ విషయం పుణ్య దృష్టికి వచ్చింది. ఆన్‌లైన్‌లో బోధించడం అప్పటివరకు తనకు తెలియదు. అయినాసరే ఒప్పుకుంది. ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం సరిగ్గా రాకపోయినా ఏడాదిపాటు ఇషితకు మలయాళం నేర్పించింది. పుణ్య నిబద్ధత, చదువు చెప్పడంలో చూపిస్తున్న పరిణతి ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న వ్యూయర్స్ క్రమంగా పెరిగారు. సోషల్ మీడియాలో 'మలయాళీ వర్డ్ స్మిత్' పేజీ ప్రారంభించాక ఆ సంఖ్య మరింతగా పెరిగింది.

punya-mohan-family

​2022లో పల్లికూడమ్ స్కూల్లో మలయాళ టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన పుణ్య చెబుతున్న ఆన్‌లైన్ క్లాసులకు మొట్టమొదటిసారి అక్షరాలు నేర్చుకుంటున్న వారి దగ్గరి నుండి 72 ఏళ్ల వృద్ధురాలి వరకు హాజరవుతున్నారు. ఈ పేజీ ద్వారా మలయాళం రాయడం, చదవడం రెండింటినీ నేర్పిస్తున్నారు. ఈ పేజీ గురించి మరిన్ని విషయాలు పుణ్య ఇలా చెబుతున్నారు.

​‘కొందరికి బేసిక్ అక్షరాల నుండి నేర్పించాలి. ఇంకొందరికి స్కూల్లో చెప్పిన పాఠాలను అర్థమయ్యేలా మరోసారి బోధించాలి. మరికొందరికి భాషా నైపుణ్యాలు చెప్పాలి. అందరికీ ఒకేసారి క్లాసులు తీసుకోవడం కుదరదు. అలాగే ఒకే టీచరు చెప్పడం కుదరదు. అందుకే మరో 5 గురు టీచర్లను నాతో కలుపుకున్నాను’ అంటున్న పుణ్య రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్ బోధనలోనే గడుపుతున్నారు. భవిష్యత్తులో ఈ పేజీని యాప్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లాగా అభివృద్ధి చేయాలని, ప్రపంచ దేశాల నుండి మరింత మంది పాఠకులను ఆకర్షించాలని అనుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్