గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

టిటిడి మాజీ ఐటీ జీఎం సందీప్ రెడ్డి నియామకంపై సీఐడీ విచారణ ప్రారంభం

1 గంట క్రితం

Former TTD IT GM
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ ఐటీ జనరల్ మేనేజర్ (జీఎం) సందీప్ రెడ్డి నియామకంపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. నియామకం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని టిటిడి అధికారులు ఆదేశించారు. ఒక ఉద్యోగి నియామకంపై సీఐడీ విచారణ కోరిన తొలి ఘటనగా అధికారులు భావిస్తున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సందీప్ రెడ్డి ఐటీ జీఎంగా నియమితులయ్యారు. అయితే, ఈ నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, అర్హతల విషయంలో లోపాలున్నాయని 2024 ఆగస్టులో టిటిడి విజిలెన్స్ విభాగం ప్రాథమిక నివేదికలో పేర్కొంది. టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి విచారణ కోసం టిటిడి సీఐడీని ఆశ్రయించింది. ఈ మేరకు తిరుపతి సీఐడీ అధికారులు పలు కీలక పత్రాలు, వివరాలను పరిశీలిస్తున్నారు. ఐటీ జీఎం పోస్టుకు నిర్దేశించిన విద్యార్హతలు, నియామకానికి సంబంధించి విడుదల చేసిన పత్రికా ప్రకటన, దరఖాస్తు చేసిన అభ్యర్థులు, ఇంటర్వ్యూకు హాజరైన వారి వివరాలను సేకరిస్తున్నారు. నియామక ప్రక్రియలో ఏవైనా అక్రమాలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సందీప్ రెడ్డి ఐటీ జీఎంగా పనిచేసిన కాలంలో టిటిడికి సంబంధించిన కీలక సమాచారం బయటకు వెళ్లిందా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సిమ్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా కొనసాగుతూ అదే సమయంలో జీతం పొందిన అంశంపైనా సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్