శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాలింతకు భరోసా అవసరం!

1 గంట క్రితం

బాలింత
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

బిడ్డ పుట్టిన తర్వాత ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంట్లో ప్రతి మాటా బిడ్డ చుట్టూనే తిరుగుతుంది. కానీ ఆ బిడ్డను కన్న తల్లి ఎలా ఉంది? ఆమెకు తగినంత విశ్రాంతి లభిస్తోందా? ఆమె మనసులో ఏముంది? ఆమెకు ఏమైనా బాధ ఉందా? అనే విషయాలను చాలాసార్లు ఎవరూ పట్టించుకోరు. ప్రసవం తర్వాత తల్లి శరీరంలో జరిగే మార్పులతో పాటు మానసికంగానూ మార్పులు వస్తాయి. కొన్నిసార్లు నిరాశ, నిరాసక్తి, నిస్సహాయత కలుగుతాయి. అలాంటప్పుడు బాలింతకు ఊరట, ఓదార్పు, అభినందన, ఆప్యాయత కావాలి.

సరోజది ప్రేమ వివాహం. భర్తతో అన్యోన్యంగా సాగిన జీవితంలో బాబు పుట్టడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత ఆమెపై బాధ్యతలు పెరిగాయి. బిడ్డను చూసుకోవడం, ఇంటి పనులు చేయడం, రాత్రిళ్లు నిద్ర లేకుండా గడపడం... అన్నీ ఆమెపైనే పడ్డాయి. బిడ్డ సంరక్షణలో అందరూ నిమగ్నమైనప్పటికీ, తన బాధ్యతల్లో తోడుగా ఎవరూ లేరనే భావన సరోజలో ఏర్పడింది. భర్త నుంచి గతంలో లభించినంత ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లభించడం లేదనే భావన కూడా ఆమెలో బలపడింది. తన ఇబ్బందులను చెప్పుకునే అవకాశం లేకపోవడం ఒంటరితనాన్ని మరింత పెంచింది. నిద్రలేమి, అలసట, నిరంతర ఆలోచనలు, కుటుంబ పరిస్థితులపై ఆందోళన క్రమంగా ఆమెను మానసికంగా కుంగదీశాయి. చివరకు ‘జీవితం ఎందుకు?’ అనే ఆలోచనకు చేరుకుంది. ఒకరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుడితో మాట్లాడుతున్నప్పుడు- ‘నాకు చనిపోవాలని ఉంది’ అని చెప్పింది.

ఆ మాట విన్న వైద్యులు ఆమెను మందలించలేదు. తేలిగ్గా తీసుకోలేదు. ఆమె అలా భావించడానికి కారణాలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. ఆమె చెప్పిన విషయాలను శ్రద్ధగా విని, ఆ మాటల వెనుక ఉన్న బాధను అర్థం చేసుకున్నారు. ఆమెతో మాట్లాడటంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా అవసరమైన సూచనలు అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యుల అండతో తన పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేస్తోంది.

ప్రసవం తర్వాత...

ప్రసవం తర్వాత కొంతమంది మహిళల్లో తాత్కాలికమైన మానసిక మార్పులు కనిపించవచ్చు. అయితే బాధ, నిరాశ, ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం, నిద్రలో తీవ్రమైన మార్పులు వంటి లక్షణాలు కొనసాగితే ప్రసవానంతర డిప్రెషన్‌ గురించి ఆలోచించాలి. ఇది తల్లి బలహీనత కాదు. గుర్తించి వైద్య సహాయం అందించాల్సిన ఆరోగ్య సమస్య. తరచూ ఏడవడం, నిద్ర లేదా ఆకలిలో తీవ్రమైన మార్పులు, తాను కుటుంబానికి భారమని భావించడం, బిడ్డను చూసుకోవాలనే ఆసక్తి తగ్గడం, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం వంటి లక్షణాలను గమనించాలి. ముఖ్యంగా ‘నేను లేకపోతే అందరికీ మంచిది’ అని చెప్పడం, ఆత్మహత్య గురించి మాట్లాడటం లేదా ఆలోచించడం అత్యంత తీవ్రమైన హెచ్చరికలు. ఇలాంటి పరిస్థితిలో ఆమెను ఒంటరిగా వదిలేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

బాలింత మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవి కేవలం ప్రసవం, హార్మోన్ల మార్పులు మాత్రమే కావు. తగినంత నిద్ర లేకపోవడం, బిడ్డ సంరక్షణలో అలసట, భర్త సహకారం లేకపోవడం, కుటుంబ సభ్యుల విమర్శలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, బిడ్డ ఆరోగ్యంపై అధిక ఆందోళన, భావోద్వేగ వేధింపులు వంటివి కూడా మానసిక భారాన్ని పెంచుతాయి. ‘నువ్వు మంచి తల్లివి కావు’ అని అనడం కూడా చిన్న విషయం కాదు. కొత్తగా తల్లైన మహిళకు తనపై ఇప్పటికే అనేక సందేహాలు ఉండవచ్చు. అలాంటి సమయంలో విమర్శలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తాయి. అందుకే సలహా ఇవ్వడానికి ముందుగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవాలి.

ఆహారం - అపోహలు

ఆహారానికి సంబంధించిన అపోహలు కూడా బాలింత ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. గుడ్లు తింటే కుట్లు పాడవుతాయని, చేపలు లేదా చికెన్‌ తింటే బిడ్డకు ఇబ్బంది కలుగుతుందని, పండ్లు తింటే జలుబు వస్తుందని చెప్పడం సాధారణంగా కనిపిస్తుంది. వైద్యపరమైన ప్రత్యేక నిషేధం లేని సందర్భాల్లో ఇలాంటి ఆంక్షలు అవసరం లేదు. బాలింతకు ప్రోటీన్‌, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో కూడిన సమతుల ఆహారం అవసరం. ప్రసవం తర్వాత శరీరం కోలుకోవడానికి పోషకాహారం, నీరు, విశ్రాంతి అవసరం. వైద్యులు సూచించిన ఐరన్‌, కాల్షియం వంటి మందులను నిర్దేశించిన విధంగా వాడాలి.

‘కొన్ని వారాలు స్నానం చేయకూడదు’ వంటి ఆంక్షల విషయంలోనూ వైద్యపరమైన సూచనలకే ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ముఖ్యం. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిపాలను వీలైనంత త్వరగా ప్రారంభించడం మంచిది. మొదటి పాలు అయిన కొలస్ట్రం బిడ్డకు ఎంతో విలువైనవి. తల్లికి తల్లిపాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటే కుటుంబ సభ్యులు, ఆరోగ్య సిబ్బంది సహాయం చేయాలి. నవజాత శిశువుకు వైద్యుల సలహా లేకుండా తేనె, గ్లూకోజ్‌ నీరు, గుట్టి వంటి పదార్థాలు ఇవ్వకూడదు. బిడ్డకు ఏం ఇవ్వాలనే దానిపై ఎంత శ్రద్ధ చూపుతున్నామో, బిడ్డకు పాలు ఇస్తున్న తల్లి ఏం తింటోంది, ఎంత విశ్రాంతి తీసుకుంటోంది అనే విషయాలపైనా అంతే శ్రద్ధ చూపాలి.

కుటుంబమే తొలి అండ

బాలింతకు మందులు, ఆహారం ఇవ్వడం మాత్రమే కుటుంబ బాధ్యత కాదు. ఆమె మనసును అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. బిడ్డ సంరక్షణ తల్లి ఒక్కరి బాధ్యత కాదు. భర్త బిడ్డను చూసుకోవడంలో భాగస్వామి కావాలి. ఇంటి పనుల్లో కుటుంబ సభ్యులు సహాయం చేయాలి. బాలింతకు తగినంత నిద్ర, విశ్రాంతి లభించేలా చూడాలి. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి. ఇతరులతో పోల్చకూడదు. తప్పుపట్టకూడదు. ‘అందరూ పిల్లలను పెంచారు... నువ్వెందుకు చేయలేవు?’ అనే మాటలకు బదులు ‘నీకు ఏం సహాయం కావాలి?’ అని అండగా ఉండాలి. ఆమె నిరాశగా, నిరాసక్తిగా ఉంటే తేలిగ్గా తీసుకోకూడదు. ఆమెను ఒంటరిగా వదిలేయకూడదు. వైద్య నిపుణుల సలహా కూడా తీసుకోవాలి.

ప్రసవం తర్వాత తల్లి శరీరం కోలుకోవడానికి సమయం పడుతుంది. అదే సమయంలో ఆమె మనసుకూ కోలుకునే అవకాశం ఇవ్వాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఇంట్లో అందరూ బిడ్డను చూస్తారు. కానీ ఆ బిడ్డను కన్న తల్లిని కూడా ప్రత్యేకంగా పట్టించుకోవాలి. తల్లి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డను ఆరోగ్యంగా పెంచగలదు. అందుకే బిడ్డను చూసే కళ్లతోనే తల్లినీ చూడాలి.

డాక్టర్_ బాలక సురేష్_ కుమార్

- డాక్టర్‌ బాలక సురేష్‌ కుమార్

చిన్నపిల్లల వైద్య నిపుణులు

ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ (పీడియాట్రిక్స్)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్