శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఢిల్లీ వీధుల్లో దుశ్శాసన పర్వం!

1 గంట క్రితం

ఢిల్లీ వీధుల్లో దుశ్శాసన పర్వం! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:00 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

'ఈ దుర్యోధన.. దుశ్శాసన.. దుర్వినీత లోకంలో.. రక్తాశ్రువులు చిందిస్తూ.. వినిపిస్తున్నాం శోకంతో..` అంటూ ఢిల్లీ 'సర్` నిరసనల్లో తమపై జరిగిన లైంగిక, భౌతిక దాడులను విద్యార్థినులు, మహిళా జర్నలిస్టులు దేశం ముందు బయటపెట్టారు. ఆ భయంకర దాడులు విని దేశం నిలువెల్లా కంపించిపోయింది. ‘... భారతమాతను నేను.. బందీనై పడి ఉన్నాను.. ` అంటూ తీవ్రంగా శోకించింది. ఆ యువతులు చేసిన నేరం ఏంటి? తీవ్రవాదుల మాదిరి చీకటిగదుల్లో బంధించి మరీ వారిపై నీచమైన దాడులు చేయడానికి కారణం ఎవరు?

​అక్టోబరు 10న ఢిల్లీ వీధుల్లో నిరసనకారులపై జరిపిన అకృత్యాలు అన్నీఇన్నీ కావు. అంతలా వేధించినా.. పోరాట గళాలు వెనక్కి తగ్గలేదు. దాడులకు పాల్పడిన చోటే.. మరింత దూకుడుగా నిరసనకు ఉపక్రమించారు. పోరాడుతున్న వారి చేతుల్లోని జాతీయ జెండాలను పోలీసులు లాక్కున్నారు. ప్రశ్నించిన చేతులను మెలిపెట్టారు. జుట్టు పట్టి లాగారు. దుస్తులు పట్టుకుని ఈడ్చారు. పోలీసు వాహనాల్లోకి బలవంతంగా నెట్టారు. చీకటి గదుల్లో వేసి కొట్టారు. ఒక విద్యార్థిని చెవికి వినికిడి సమస్య ఏర్పడిందని, పెదవి చీలిందని చెబితే, మరో కార్యకర్త తనను నేలపైకి ఈడ్చి కొట్టారని వెల్లడించారు. నిరసనలను చిత్రీకరిస్తున్న మహిళా జర్నలిస్టులు 'తమపై లైంగిక వేధింపులు, దురుసు ప్రవర్తన చేశార`ని ఫిర్యాదులు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాపాడాల్సిన పోలీసులే, ఆ హక్కుకు తూట్లు పొడిచారని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబరు 10, 11 తేదీల్లో ఢిల్లీలో నిరసనలను అడ్డుకునే క్రమంలో పోలీసులు జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అంతర్జాతీయ సంస్థ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్‌ (సీపీజే) నివేదిక ప్రకారం, ఢిల్లీలో కనీసం 35 మందితోపాటు ఇతర నగరాల్లో మరో ఇద్దరు జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారు. కొందరిపై దాడులు జరిగినట్లు, వార్తా సేకరణకు ఆటంకం కలిగించినట్లు విమర్శలు వచ్చాయి.

images.jpg

​దాడులకు వెరవని విద్యార్థినుల పోరాటం

అక్టోబరు 11న స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) మహిళా కార్యకర్తలు నిర్వహించిన నిరసనలో చేతిలో జెండా పట్టుకుని పోలీసుల నిర్బంధం నుంచి తప్పించుకుంటూ పరుగెత్తిన పుఝక్కల్‌ పవిత్ర ఫొటో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 20 ఏళ్ల పవిత్ర ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్‌ కళాశాలలో మానవశాస్త్రం చదువుతున్నారు. ఎస్‌ఎఫ్‌ఐతో అనుబంధం కలిగిన ఆమె, ఢిల్లీ నిరసనలో పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జెండాతో పరుగెత్తుతున్న ఆమె చిత్రం నిర్బంధాన్ని తప్పించుకునే దృశ్యంగా మాత్రమే కాదు. పోరాడటమే ఊపిరిగా బతుకుతున్న ఎన్నో గొంతుకలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషి ఘోష్‌ కూడా ఈ నిరసనల్లో పాల్గొని తన పోరాట పటిమను చాటారు. యూనివర్శిటీ సమస్యలపైనే కాదు, దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరిగే దాడులపై కూడా ఆమె తన గళాన్ని వినిపిస్తుంటారు. తాజా ఢిల్లీ నిరసనల్లో పాల్గొన్న ఆమె, విద్యార్థులపై పోలీసుల చర్యలను తీవ్రంగా ప్రశ్నించారు. తనను నిర్బంధించిన బస్సు నుండి కిందికి దిగి రోడ్డు మీద గట్టిగా అరుస్తూ.. పోలీసుల చర్యలను దుయ్యబట్టారు.

​ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ అధ్యక్షురాలు నదియాపై పోలీసులు తీవ్రంగా ప్రవర్తించారు. ఇటీవల ఢిల్లీలో కొన్ని గంటల పాటు కదులుతున్న బస్సులో మైనర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ ఘటనకు నిరసనగా మహిళలపై లైంగిక హింసను వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 30న ఢిల్లీ సచివాలయం వరకు ప్రజా సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. ఆ ప్రదర్శనకు నదియా నాయకత్వం వహించారు. ఆ రోజు మహిళల భద్రత కోసం గొంతెత్తిన ఆమెపైనే అక్టోబరు 11న పోలీసులు దాడికి తెగబడ్డారు. 'నా స్నేహితురాలు వీడియో తీయకుండా ఆరుగురు మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలోనే మరో ఐదుగురు పోలీసులు నన్ను చుట్టుముట్టారు. ఒకరు నా చేతిపై కొట్టారు. మరొకరు నా జుట్టు లాగారు. ఇంకొకరు నా వేలిని మెలిపెట్టడానికి ప్రయత్నించారు. దాంతో భరించలేనంత నొప్పి కలిగింది` అని ఆమె చెప్పారు. మరో మహిళా కార్యకర్తపై పోలీసులు చేసిన దాష్టీకాన్ని ఆమె ఇలా వివరించారు. 'నన్ను బస్సులోకి తోసేస్తున్న సమయంలో ఒక పోలీసు నా కుర్తాను పైకి లేపారు. మహిళా నిరసనకారులను ఒక ఇరుకైన ప్రదేశంలో ఉంచిన బస్సులోకి నెట్టారు. ఆ బస్సులో పురుష పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఆ సమయంలో బస్సులో లైట్లు ఆర్పేశారు. లైట్లు వేయమని మేము అరుస్తున్నా.. పట్టించుకోలేదు` అని వివరించారు.

​‘నన్ను చంపేస్తారేమో అనిపించింది’

ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్త, ఢిల్లీలో న్యాయవిద్య అభ్యసిస్తున్న అథిరా విజయన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం నిర్బంధంలో ఉన్న మహిళల భద్రతపై మరింత ఆందోళన రేకెత్తుతోంది. కేరళలోని కోజికోడ్‌ జిల్లాకు చెందిన అథిరా, అక్టోబరు 13న ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నారు. పోలీసు వాహనం నుంచి తనను లాగి, నేలపైకి ఈడ్చి, కొట్టారని ఆమె చెప్పారు. ‘మహిళా పోలీసు సిబ్బంది లేని వాహనంలో నన్ను బంధించారు. మహిళా సిబ్బంది ఏరని అడిగితే- బయటకు తీసుకొచ్చి కింద పడేసి దాడి చేశారు. సిసిటీవీలు ఇక్కడ ఉండవు కాబట్టి ఇష్టం వచ్చినట్లు తన్నండి అని వాళ్లు ఒకరికొకరు ఆదేశాలు ఇచ్చుకున్నారు. వాళ్లు బూటు కాళ్లతో నా పైపొట్టపై, కింది పొట్టపై తీవ్రంగా కొట్టారు. నొప్పిని భరించలేక కిందపడిపోయాను. తలకు దెబ్బ తగిలింది. పెదవి చీలింది. రెండు చెంపలపై పదే పదే కొట్టడంతో చెంపలు వాచిపోయాయి. కళ్ల కింద నల్లని గాయాలు అయ్యాయి. ఇప్పుడు నా కుడి చెవి వినిపించడం లేదు. నా దగ్గర ఉన్న ఫోను ఇవ్వలేదని మెడచుట్టూ శాలువా వేసి ఊపిరాడకుండా బిగించారు. చనిపోతానని భయమేసింది. ఆ సమయంలో వాళ్లు నన్ను ఒక మనిషిగా చూడలేదు. వంతుల వారీగా దాడి చేశారు.` అని అథిరా వివరించారు.


​మహిళా జర్నలిస్టులపై దాడులు

నిరసనకారులపై క్రూరంగా విరుచుకుపడుతున్న ఖాకీల చర్యలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు దాడులు చేశారు. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై అసహ్యకరంగా ప్రవర్తించారు. అక్టోబరు 3న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలను చిత్రీకరిస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టులు పోలీసుల దురుసు ప్రవర్తన, లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేశారు. విద్యార్థి నాయకురాలు నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ తనను అభ్యంతకరంగా హింసించారని, ప్రైవేటు భాగాలను నొక్కుతూ పక్కకు తోసేశారని ఒక మహిళా జర్నలిస్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని మరో మహిళా జర్నలిస్టు కూడా పోలీసులపై ఫిర్యాదు చేశారు. పోలీసుల చర్యలను ప్రశ్నించిన జర్నలిస్టులే తమపై వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం పత్రికా స్వేచ్ఛపై ఆందోళన కలిగిస్తోంది.

brinda.jpg

​జవాబుదారీతనం ఎక్కడ..?

ఢిల్లీ నిరసనల సందర్భంగా జరిగిన ఈ పరిణామాలు ఒక్కరోజుకు, ఒక్క విద్యార్థి సంఘానికి లేదా ఒక్క పోలీస్‌ స్టేషన్‌కు పరిమితమైనవి కావు. నిరసన తెలపడం, మహిళల భద్రత కోరడం, పోలీసుల చర్యలను చిత్రీకరించడం వంటి భిన్న సందర్భాల్లో విద్యార్థినులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై ఊకుమ్మడిగా పోలీసులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త బృందా కారత్‌ వీటిపై వ్యాఖ్యానించారు. 'ఢిల్లీ వీధుల్లో దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాను. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఎన్నడూ చూడలేదు. నేడు యూనిఫాంలో ఉన్నవారు చేస్తున్న లైంగిక వేధింపులు, అసమ్మతిని అణచివేసే సాధనంగా మారాయి` అని ఆమె పేర్కొన్నారు.

నిరసన ... ఒక హక్కు

  • భారత రాజ్యాంగంలోని 19(1)(బి) అధికరణం పౌరులకు నిరాయుధంగా, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తుంది.

  • ఆంక్షలు విధించే అధికారం ఉందన్న కారణంతో శాంతియుత నిరసన హక్కును పూర్తిగా అణిచివేయకూడదు.

  • నిరసనల నిర్వహణ, ప్రజా శాంతి పరిరక్షణ మధ్య సమతుల్యత పాటించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్