శ్రీనగర్ : లఢఖ్‌లో సంకూను ఎనిమిదో జిల్లాగా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా శుక్రవారం ప్రకటించారు. ఈ కొత్త జిల్లాలో సుమారు 40,548 మంది జనాభా ఉన్నారు. ఈ జిల్లా ప్రకటన ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని ఆయన పేర్కొన్నారు. అంజుమన్-ఎ-సాహిబ్ జమాన్ సంస్థతో పాటు పలువురు ప్రజాప్రతినిధుల కృషిని అభినందించారు. ఈ ఏడాది ఇప్పటికే షామ్, నుబ్రా, చాంగ్తాంగ్, జన్స్కార్, ద్రాస్ జిల్లాలను ఏర్పాటు చేశారు. తాజా ప్రకటనతో లఢఖ్‌లో జిల్లాల సంఖ్య ఎనిమిదికి చేరింది.
జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం జమ్ముకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆ రాష్ట్రాన్ని జమ్ముకాశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంతో జమ్ముకాశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగ హోదా ముగిసింది. 2019లో కాశ్మీర్ ప్రాంతం నుండి వేరుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన లఢఖ్‌లో , లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో లెఫ్టినెంట్ గవర్నర్ యంత్రాంగం లఢఖ్‌లో మరో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. సంకూ జిల్లాతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో మొత్తం ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 3.5 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు.







కామెంట్లు (0)