శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అద్దెకు మనవళ్లు!

2 గంటల క్రితం

అద్దెకు మనవళ్లు! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 04:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అమ్మానాన్న ముసలివాళ్లయిపోయారు. వయసులో ఉన్నప్పుడు పిల్లల కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ ఇప్పుడు పిల్లలు విదేశాల్లో ఉంటే.. వృద్ధులైన తల్లిదండ్రులు సొంత ఇంట్లో ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారి బాగోగులు చూసుకోవడమంటే మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తీసుకురావడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం, వంట చేసిపెట్టడం మాత్రమే కాదు.. వారితో కాసేపు సమయం గడపాలి. సరదాగా మాట్లాడాలి. వారికి ఇష్టమైన చోటుకు విసుక్కోకుండా తీసుకెళ్లాలి. ఇవన్నీ విదేశాల్లో ఉన్న పిల్లలకు సాధ్యమా? ‘మనవళ్లు, మనవరాళ్లతో ముచ్చట్లు చెప్పాలని సంబరపడే తాతయ్య, నానమ్మలకు ఆ ముచ్చట కలగానే మిగిలిపోతుందా?’ అంటే.. ‘ఇక ఆ అవసరం లేదు’ అంటున్నాయి కొన్ని వ్యాపార సంస్థలు. ‘అద్దెకు మనవళ్లు’, ‘అద్దెకు పిల్లలు’ అంటూ కుటుంబ సభ్యులు సహజంగా అందించాల్సిన ఆప్యాయత, సహచర్యాన్ని డబ్బులు తీసుకుని సేవల రూపంలో అందిస్తున్నాయి.

గురుగ్రామ్‌కు చెందిన సునీల్ బుధిరాజా, ఆయన భార్య ఒంటరిగా ఉంటున్నారు. వారి ఇద్దరు కుమార్తెలు అమెరికాలో నివసిస్తున్నారు. పిల్లలకు దూరంగా బతకడం ఆ వృద్ధ దంపతులకు కష్టంగా ఉండేది. మాట్లాడేవారు లేక ఇబ్బందిపడేవారు. మార్కెట్‌కు, గుడికి వెళ్లినప్పుడు ఎవరైనా తోడుగా వస్తే బాగుండని అనుకునేవారు. ఇప్పుడు వారు బయటకు వెళ్లాలంటే 26 ఏళ్ల రోనీ రాజు తోడుగా ఉంటున్నాడు. ఆస్పత్రికి వెళ్లినా, గుడికి వెళ్లినా వెంట వస్తాడు. కాసేపు మాట్లాడతాడు. వారి అవసరాలను తెలుసుకుంటాడు. అతను ఆ దంపతులకు ‘అద్దె మనవడు’!

ఒకసారి బుధిరాజాకు శస్త్రచికిత్స జరిగినప్పుడు కూడా కుమార్తెలు ఇండియాకు రాలేకపోయారు. ఆ సమయంలో రోనీ దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. వైద్యులు, మందుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. విధులు ముగిసిన తర్వాత కూడా ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగేవాడు. అలా మొదలైన పరిచయం క్రమంగా కుటుంబ అనుబంధంగా మారింది. రోనీ సామాజిక సేవలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. గురుగ్రామ్‌లోని ఓ సంస్థ ద్వారా బుధిరాజా దంపతులకు మనవడిగా సేవలందిస్తున్నాడు.

భారత్‌లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. 2022లో దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడినవారు 10.5 శాతం ఉన్నారు. 2050 నాటికి ఈ సంఖ్య 21 శాతానికి చేరుతుందని అంచనా. అంటే సుమారు 34.7 కోట్ల మంది వృద్ధులు ఉంటారు. 2046 నాటికి దేశంలో పిల్లల కంటే వృద్ధుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని అంచనా. భారత ప్రభుత్వం అంచనా ప్రకారం వృద్ధుల సంరక్షణ రంగం విలువ సుమారు రూ.6,576 కోట్లకు పైగా ఉంది.

గురుగ్రామ్‌లోని ఓ సంస్థ నెలకు 10 గంటల సేవలకు గంటకు రూ.450, 25 గంటల సేవలకు గంటకు రూ.400 చొప్పున వసూలు చేస్తోంది. వృద్ధులను గుడికి, మార్కెట్‌కు తీసుకెళ్లడం, ఆస్పత్రికి వెళ్లినప్పుడు తోడుగా ఉండటం, పేకాట, ఇండోర్ గేమ్స్ ఆడటం, కాసేపు మాట్లాడటం వంటి సేవలు అందిస్తోంది. వినియోగించుకోని గంటలను తర్వాతి నెలకు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది. ఈ ఆలోచన కొత్తదేమీ కాదు. 2017లోనే ఈ తరహా సేవలందించే ఐదు స్టార్టప్ సంస్థలు దేశంలో ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. 2022లో టాటా గ్రూప్‌కు చెందిన రతన్ టాటా కూడా ముంబయికి చెందిన ఇలాంటి ఓ స్టార్టప్‌ను ప్రోత్సహించారు.

ఒంటరితనమే అసలు సమస్య

2022లో భారత్ నిర్వహించిన ‘లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ’లో 72 వేల మందికి పైగా వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. మధ్య వయస్కులు, వృద్ధుల్లో 20.5 శాతం మంది మధ్యస్థ స్థాయి ఒంటరితనాన్ని, 13.3 శాతం మంది తీవ్ర ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఒంటరిగా నివసిస్తున్న 60 ఏళ్లు పైబడినవారిలో 37 శాతం మంది ఒంటరితనంతో బాధపడుతున్నట్లు గుర్తించింది. బెంగళూరులో వృద్ధుల సంరక్షణ సేవలందిస్తున్న ఓ సంస్థ సీఈఓ సంతోష్ అబ్రహం అనుభవాలు ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తాయి. ‘వృద్ధులైన తల్లిదండ్రుల అవసరాల గురించి విదేశాల్లో ఉన్న పిల్లలు బాగా ఆలోచిస్తారు. అయితే వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, మార్కెట్ పనుల గురించే ఎక్కువగా ఆందోళనపడతారు. కానీ వృద్ధుల మనసు కోరుకునేది వేరు. ‘‘నేను ఒంటరిగా ఉన్నాను. నాతో మాట్లాడేవారెవరూ లేరు. నా కుటుంబం కోసం, సమాజం కోసం ఎంతో చేశాను. కానీ ఇప్పుడు నన్ను గుర్తించేవారే లేరు’’ అని ఆశ్రయం పొందుతున్న ఓ వృద్ధుడు తనతో అన్న మాటలను అబ్రహం గుర్తుచేసుకున్నారు.

‘కొన్నిసార్లు ఆరోగ్యం బాగోలేదని, సహచరులను పంపించమని మాకు ఫోన్లు వస్తాయి. అయితే అక్కడికి వెళ్లి చూస్తే ఆరోగ్య సమస్యేమీ ఉండదు. వచ్చినవారు ఒక గంటసేపు తమ పక్కన కూర్చుని మాట్లాడాలని మాత్రమే కోరుకుంటారు. అంటే వారికి కావాల్సింది మందులు, వైద్యం మాత్రమే కాదు.. మనుషుల తోడు!’ అని అబ్రహం అంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సహచరుడిగా పనిచేస్తున్న వినయ్ కుమార్ కూడా ఇలాంటి అనుభవాలనే పంచుకున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధులు తమతో పేకాట, ఇండోర్ గేమ్స్ ఆడాలని, సినిమాలకు, గుడికి, పార్కులకు వెళ్లాలని కోరుకుంటారని చెప్పారు. కొందరు తమ ఆరోగ్య సమస్యలను విదేశాల్లో లేదా ఇతర నగరాల్లో నివసించే పిల్లలకు చెప్పకుండా దాచిపెడతారని తెలిపారు. తమతో బాగా అనుబంధం పెంచుకుంటారని తెలిపారు.

కాగా, అమ్మానాన్నల ఆలనాపాలనా చూసుకోవడానికి సంస్థల సేవలను వినియోగించుకునే పిల్లలను సమాజం చులకనగా చూడకూడదని ‘జిందాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్’ అసిస్టెంట్ ప్రొఫెసర్ శిల్పా బెనర్జీ అంటున్నారు. అయితే వృద్ధులకు ‘అద్దెకు మనవళ్ల’ను ఏర్పాటు చేయడం కుటుంబ బంధాలకు ప్రత్యామ్నాయం కాదు. పిల్లలు దగ్గరగా ఉండలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఒంటరితనంతో కుంగిపోకుండా చూసే ప్రయత్నం మాత్రమే!


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్