బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆమె సంగీతం.. అనేక ప్రశ్నల ప్రవాహం!

2 గంటల క్రితం

ఆమె సంగీతం.. అనేక ప్రశ్నల ప్రవాహం! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 06:20 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

పాట ఆమెకు వినోద సాధనం కాదు. సమాజాన్ని అర్థం చేసుకునే మార్గం. అన్యాయాన్ని ప్రశ్నించే ఆయుధం. కులవివక్ష, మతతత్వం, సామాజిక అసమానతలపై ఎక్కుపెట్టిన చైతన్య స్వరం. కేరళ సంగీత ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న గాయని పుష్పవతి పొయ్పాడత్తు సంగీత ప్రయాణం ప్రత్యేకమైనది. శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిన ఆమె, తన గానాన్ని సామాజిక చైతన్యానికి వేదికగా మలుచుకున్నారు. అలాంటి గాయని సంగీత ప్రదర్శనకు తిరువనంతపురంలోని మానవీయం వీధిలో అనుమతి నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కేరళలోని త్రిస్సూర్ జిల్లా వేల్లూరు పుష్పవతి స్వస్థలం. ఆమె తండ్రి రాఘవన్ కూలిపనులు చేసేవారు. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని పాత సినిమా పాటలు, కేరళ నాటక గీతాలు పాడేవారు. ఆ పాటలే చిన్నతనంలో పుష్పవతికి సంగీతంపై ఆసక్తిని పెంచాయి. పాఠశాల రోజుల్లో సంగీత పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారు. ఆమె ప్రతిభను గుర్తించిన ద్రౌపది టీచర్ సంగీతంలో శిక్షణ ఇచ్చారు. అనంతరం పుష్పవతి పాలక్కాడ్‌లోని చెంబై మెమోరియల్ ప్రభుత్వ సంగీత కళాశాలలో కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆల్ ఇండియా రేడియోలో బి-గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొందారు. 2001లో 'నమ్మళ్' మలయాళ సినిమాతో నేపథ్య గాయనిగా ప్రవేశించారు. 'చెంబావిన్ పున్నెల్లిన్ చోరో', 'పాతి చిరి చంద్రికయే' వంటి పాటలు ఆమెకు గుర్తింపు తెచ్చాయి. సినిమా పాటలతోపాటు శాస్త్రీయ, జానపద, సామాజిక చైతన్య గీతాల్లోనూ రాణించారు. పాటలు రాయడం, వాటికి సంగీతం సమకూర్చడం కూడా ఆమె సంగీత ప్రయాణంలో భాగమయ్యాయి.

వివక్షను గుర్తించి...

సంగీతంలో ఉన్నత శిక్షణ పొందినా పుష్పవతికి కులవివక్ష తప్పలేదు. ఒకసారి ఆమె తల్లి చేసిన పాయసాన్ని పక్కింటికి తీసుకెళ్లి ఇచ్చినప్పుడు, ఆమె కులం కారణంగా వారు దాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. మరో సందర్భంలో కర్ణాటక సంగీతం నేర్పడానికి వెళ్లిన ఇంట్లో కుర్చీ ఉన్నప్పటికీ ఆమెకు నేలపై చాప వేశారు. ఆ అవమానాన్ని అంగీకరించకుండా పుష్పవతి కుర్చీలోనే కూర్చున్నారు. సంగీతంలో ప్రతిభను నిరూపించుకున్నా కులం పేరుతో వివక్ష ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆమెను తీవ్రంగా కలచివేసింది. మార్గళి, స్వాతి తిరునాళ్, కల్పాతి సంగీత ఉత్సవాల్లో దళిత కళాకారులకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం, దళిత మహిళలను జానపద గీతాలకే పరిమితం చేయాలనే ధోరణి కూడా ఆమెను ఆలోచింపజేశాయి. ఈ వివక్షపై పోరాటాన్ని తన సంగీత ప్రయాణంలో భాగం చేసుకున్నారు.

కేరళలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అప్పచ్చన్ పాటలకు పుష్పవతి కొత్త సంగీత రూపాన్ని అందించారు. ఆ పాటల్లోని సామాజిక సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కులవివక్ష వ్యతిరేకతతోపాటు మానవత్వం, మతసామరస్యం, సమానత్వం వంటి భావాలూ ఆమె పాటల్లో చోటుచేసుకున్నాయి. శ్రీనారాయణ గురు రచించిన 'దైవదశకం', 'అనుకంపాదశకం', కుండలినీ పాటలకు సంగీత రూపం ఇచ్చారు. కబీర్ దాస్ రచనలను ఆలపించారు. కాజీ నజ్రుల్ ఇస్లాం కవిత్వం, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలోని కొన్ని భాగాలు, మాధవికుట్టి కవితలను కూడా సంగీతంలోకి తీసుకొచ్చారు. ఖురాన్‌లోని కొన్ని భావాలకూ సంగీత రూపం కల్పించారు. 2004లో 'కబీర్ మ్యూజిక్ ఆఫ్ హార్మనీ' పేరుతో తొలి ఆల్బమ్ విడుదల చేశారు. మతాల మధ్య విద్వేషాల కంటే మానవ సంబంధాలు, సామరస్యమే ముఖ్యమనేది ఆమె ఉద్దేశం.

చిన్నతనం నుంచే కమ్యూనిస్టు, మార్క్సిస్టు భావాల పట్ల ఆసక్తి పెంచుకున్న పుష్పవతికి కుల అసమానతలు, ఆధిపత్య ధోరణులపై స్పష్టమైన అవగాహన ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) వంటి విధానాలను ఆమె వ్యతిరేకించారు. పౌరసత్వం పేరుతో కొన్ని వర్గాలను అనుమానంతో చూసే పరిస్థితిని ప్రశ్నించారు. ఈ అంశాలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. 'ఆజాదీ' పేరుతో రూపొందించిన పాటలో స్వేచ్ఛ, హక్కులు, ప్రజాస్వామిక ఆకాంక్షలు ప్రతిధ్వనిస్తాయి.

ఆమె సంగీతానికి అడ్డంకి

సామాజిక చైతన్యంతో కూడిన పాటలు పాడే పుష్పవతికి తిరువనంతపురంలోని మానవీయం వీధిలో చేదు అనుభవం ఎదురైంది. మానవీయం వీధికి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్కడి కళాకారులు ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 22న రజతోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా నవంబర్ 14న పుష్పవతి సంగీత ప్రదర్శన ఏర్పాటు చేశారు. నిర్వాహకులు నవంబర్ 3న రజతోత్సవ కమిటీ పేరుతో నగరపాలక సంస్థకు అనుమతి కోసం దరఖాస్తు చేసి రసీదు పొందారు. నవంబర్ 9న మైకుల వినియోగానికి అనుమతి కోరుతూ పోలీసులకు మరో దరఖాస్తు సమర్పించారు. అయితే, బీజేపీ ఆధీనంలోని తిరువనంతపురం నగరపాలక సంస్థ సంగీత ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. మానవీయం వీధి రజతోత్సవాల్లో తమకు భాగస్వామ్యం కల్పించకపోవడం వల్లే అనుమతి ఇవ్వలేదని మేయర్ వి.వి. రాజేష్ పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన రాజకీయాలతో ముడిపెట్టడంపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. నవంబర్ 15న కళాకారులు అదే వీధిలో 'మనదే మానవీయం.. మనదే స్వరం' పేరుతో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. సంగీతం, నృత్యం, నిరసన గీతాల ద్వారా తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి పి.సి. విష్ణునాథ్ కూడా ఈ నిరసనకు మద్దతు తెలిపారు.

పాతికేళ్లుగా అదే వేదికపై కార్యక్రమాలు నిర్వహిస్తున్న కళాకారులే రజతోత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ముందుగానే దరఖాస్తు చేసి రసీదు పొందినా అనుమతి నిరాకరించడంపై నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ విధానాలను విమర్శించడం, ప్రజల బాధలను కళ ద్వారా వ్యక్తం చేయడం కళాకారుల హక్కు. బాధ్యత కూడా. దానిని కాలరాయడానికి బీజేపీ నేతృత్వంలో ఉన్న నగరపాలక సంస్థ పూనుకోవడం పట్ల కవులు, కళాకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన సాంస్కృతిక వేదికలు అధికారంలో ఉన్నవారి కనుసన్నల్లో నడవాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటున్నారు.

ఆ వీధి ప్రత్యేకత ఏమిటంటే...

కేరళ రాజధాని తిరువనంతపురంలోని మానవీయం వీధి కళాకారుల కోసం ఏర్పాటైన బహిరంగ సాంస్కృతిక వేదిక. ఈ వేదిక ఆలోచన 1995లోనే మొదలైంది. పారిస్ వంటి నగరాల్లో వీధులే కళా ప్రదర్శనలకు వేదికలుగా ఉండటంతో ప్రేరణ పొందిన రంగస్థల కళాకారుడు డి. రఘుతమన్ తిరువనంతపురంలోనూ అలాంటి వేదిక ఉండాలని ప్రతిపాదించారు. 1999లో కొత్త సహస్రాబ్దికి స్వాగతం పలుకుతూ కేరళ పర్యాటక శాఖ ఏడాదిపాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత ఈ ఆలోచనకు కార్యరూపం లభించింది. ప్రముఖ సాంస్కృతిక కార్యకర్త సూర్య కృష్ణమూర్తి సహకారంతో 2001లో మ్యూజియం-వెల్లయంబలం రహదారికి సమీపంలోని సుమారు 180 మీటర్ల ప్రాంతాన్ని సాంస్కృతిక కారిడార్‌గా ప్రకటించి 'మానవీయం' అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఇక్కడ సంగీతం, నృత్యం, వీధి నాటకాలు, కవితా పఠనాలు, చిత్రలేఖనం, జానపద కళారూపాల ప్రదర్శనలు జరుగుతున్నాయి. సామాజిక, రాజకీయ అంశాలపై చర్చలు, నిరసన కార్యక్రమాలకూ ఇది వేదికైంది. వామపక్ష ప్రభుత్వం ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.3.5 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, నిర్వహణ బాధ్యతలను నగరపాలక సంస్థకు అప్పగించారు. 2026లో నగరపాలక సంస్థలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమాల నిర్వహణపై వివాదాలు మొదలయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్