వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాల మధ్య సహకారం అత్యవసరం. కానీ, ఆ సహకారానికి పునాదైన న్యాయం, సమానత్వం, బాధ్యతల సూత్రాలు సంపన్న దేశాల వైఖరితో బలహీనపడుతున్నాయి. టర్కీలోని అంటాల్యలో జరిగిన 31వ ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (సిఓపి–31) మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. నిర్దేశించిన రెండు వారాల చర్చలను ఎన్నడూ లేనివిధంగా యాభై గంటలు పొడిగించినా కీలక అంశాలపై ఏకాభిప్రాయం సాధించలేక విఫలం కావడం దురదృష్టకరం. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగి, వాతావరణ మార్పులకు చారిత్రకంగా కారణమైన సామ్రాజ్యవాద, సంపన్న దేశాలు తమ బాధ్యతలను గుర్తించకుండా, అన్ని దేశాలపై ఒకే తరహా భారాన్ని మోపాలని చూడటమే ఈ సమస్యకు కారణం. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఎవరు ఎంత బాధ్యత వహించాలి, ఆర్థిక భారాన్ని ఎవరు మోయాలి, పరిష్కారాల కోసం ఎవరు వనరులు సమకూర్చాలి అనే మౌలిక ప్రశ్నలను వినడానికి, వాటిపై చర్చించడానికి సైతం ఆ దేశాలు సిద్ధపడకపోవడం పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది. ఫలితంగా ముగింపు ప్రకటనలో శిలాజ ఇంధనాల వినియోగం నిలిపివేతపై స్పష్టమైన నిర్ణయం చోటుచేసుకోలేదు. దీని వెనుక ఆయిల్ ఉత్పత్తి దేశాల తీవ్ర ఒత్తిడి ఉందన్నది బహిరంగ రహస్యం. అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలు వాతావరణ మార్పులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడానికి (అడాప్షన్) అవసరమైన ఆర్థిక సహాయంపై నిర్దిష్ట లక్ష్యాలు లేవు. అడాప్షన్ ఫండ్‌కు 2035 నాటికి ఏటా సుమారు 30,500 కోట్ల డాలర్లు అవసరమవుతాయన్నది అంచనా కాగా, అంటాల్యలో ఈ నిధికి ప్రకటించిన మొత్తం కేవలం ఐదు కోట్ల డాలర్లు మాత్రమే. లాభాపేక్ష తప్ప మరేమీ పట్టని సామ్రాజ్యవాద, సంపన్న దేశాల సహాయనిరాకరణే కారణం. ఫలితంగా స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూర్చే బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. ఇది సమస్యకు పరిష్కారం కాదు. దీంతో కాప్-31తీవ్ర వైఫల్య సదస్సుగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సంపన్న దేశాలతో పాటు, ఆయిల్ కంపెనీల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఈ పరిస్థితే కారణం.
అంటాల్యలో మన దేశం బేసిక్ ( బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనా) కూటమితో పాటు భావసారూప్యత కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి (ఎల్‌ఎండిసి)తో కలిసి పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ 9.1 అమలు కోసం ఒత్తిడి చేసింది. ఆ ఒప్పందంలో పేర్కొన్న విధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యతను సంపన్న దేశాలు నెరవేర్చాలని భారత్ పట్టుబట్టింది. దేశాల సామర్థ్యాలకు అనుగుణంగా వాతావరణ కర్తవ్యాలు ఉండాలని కోరింది. 2005వ సంవత్సరం స్థాయితో పోలిస్తే ఉద్గారాల తీవ్రతను 47 శాతానికి తగ్గించాలని, 2035 నాటికి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజేతర ఇంధనాల వాటాను సుమారు 60 శాతానికి పెంచాలన్న లక్ష్యాలను గత ఏడాది మన దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో వివిధ దేశాలు ప్రకటించిన జాతీయ వాతావరణ లక్ష్యాలను సాధించడానికి ఉదారంగా ఆర్థిక సాయం అందించాలన్న మన దేశ విజ్ఞప్తికి సంపన్న దేశాల నుండి సానుకూల స్పందన లభించలేదు. అదే సమయంలో వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను భారీ ఖర్చుతో మాత్రమే నియంత్రించగలిగే సాంకేతికతను కాప్-31 తుది ముసాయిదాలో చేర్చారు. దీని వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంకేతికతకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు తలకు మించిన భారంగా మారుతుంది. అదే సమయంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా నిలిపివేయాలన్న గత సమావేశాల నిర్ణయాల నుండి తప్పుకోడమే అవుతుంది.
సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ శక్తులే మితిమీరిన లాభాపేక్షతో ప్రకృతి వనరులను విధ్వంసం చేసి మానవాళిని ముప్పు ముంగిట నిలిపాయి. ఇప్పుడు ఆ శక్తులే భూ తాపాన్ని తగ్గించి, ప్రకృతిని కాపాడే చర్యలను సైతం అడ్డుకుంటున్నాయి. మానవాళితో పాటు, భూమి మీద జీవరాశి మనుగడ సాగించాలంటే వాతావరణ పరిరక్షణ చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అదేసమయంలో పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి వంటి అవసరాలను విస్మరించి భూమి మీద ఉన్న అన్ని దేశాలను ఒకే గాటిన కట్టివేయాలనడం ఏ మాత్రం సబబు కాదు. శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మారడానికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్ గ్రిడ్‌లు, నిల్వ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలకు సహకరించాలి. శిలాజ ఇంధన రంగంలో పనిచేసే కార్మికులు, బొగ్గు ఆధారిత ప్రాంతాలు, పేద వర్గాలపై అన్యాయమైన భారం పడకుండా సక్రమమైన, న్యాయమైన మార్పునకు నిధులు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కూడా ఆ దేశాలదే! ఈ దిశలో సంపన్న దేశాలతో పాటు, సదస్సుకు దూరంగా ఉన్న అమెరికా పైనా ఒత్తిడి చేయడానికి బేసిక్, ఎల్‌ఎండిసి కూటమి మరింత సంఘటితంగా కృషి చేయాలి. సదస్సులో ఒకలా, సదస్సు బయట మరోలా వ్యవహరించడం సరికాదు. వాతావరణ న్యాయం అంటే అన్ని దేశాలపై ఒకే భారాన్ని మోపడం కాదు. చారిత్రక కారణాలు, ఆర్థిక సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని బాధ్యతలను పంచడం! ఈ సూత్రానికి నిజమైన ప్రాధాన్యం లభించి, ప్రకటనలు ఆచరణాత్మక నిర్ణయాలుగా మారినప్పుడే చారిత్రాత్మకమైన పారిస్ ఒప్పందం అమలు సార్థకమవుతుంది.







కామెంట్‌లు (0)