బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫీజు బకాయిలు... బలవుతున్న విద్యార్థులు!

1 గంట క్రితం

fee re.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 05:32 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

చిత్తూరు ఎస్‌విసెట్ కళాశాలలో ఫీజుల ఒత్తిడి నేపథ్యంలో విద్యార్థిని మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ విషాదం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులోని లోపాలు, పేరుకుపోతున్న బకాయిలు, వాటి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరోసారి చర్చకు తెచ్చింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వాలు విద్యార్థులకు చేసే ఉపకారం కాదు. అది వారి హక్కు, కానీ నిధుల విడుదలలో జాప్యం వల్ల ఈ పథకమే విద్యార్థులకు భారంగా మారుతోంది. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజుల కోసం విద్యార్థులు కళాశాలల ముందు దీనంగా నిలబడాల్సిన పరిస్థితి వస్తున్నది.

బకాయిలకు మోక్షమెప్పుడు?

ప్రభుత్వాలు మారుతున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు. ప్రతి ప్రభుత్వం గత పాలకులు మిగిల్చిన బకాయిలను ప్రస్తావిస్తూ తమ వైఫల్యాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వం రూ.2,100 కోట్ల బకాయిలు మిగిల్చిందని టిడిపి విమర్శిస్తుంటే, 2019లో తాము వచ్చే నాటికి అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా రూ.2 వేల కోట్ల బకాయిలు పెట్టిందని వైసిపి గుర్తుచేస్తోంది. గత ప్రభుత్వం నుంచి బకాయిలు వారసత్వంగా వచ్చినా, వాటిని చెల్లించి విద్యార్థు ల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభు త్వానిదే. గత పాలకుల తప్పిదాల ను సాకుగా చూపి తన బాధ్యత నుంచి తప్పించుకోవడం ఏ ప్రభుత్వానికీ సమర్థనీయం కాదు.

విడుదలైన నిధులెన్ని? మిగిలిన బకాయిలెన్ని?

విద్యాశాఖ మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, 2024 జూన్ నాటికి గత ప్రభుత్వం నుంచి రూ.3,828 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 విద్యా సంవత్సరానికి రూ.3,060.48 కోట్లు, 2025-26కు రూ.1,708.72 కోట్లు, 2023-24 వరకు ఉన్న పాత బకాయిలకు రూ.193.02 కోట్లు కలిపి, 2026 నవంబర్ వరకు మొత్తం రూ.4,962.22 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ మొత్తాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? కళాశాలలకు వాస్తవంగా చేరాయా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఎందుకంటే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు, ప్రభుత్వం నుంచి నిధుల విడుదల, కళాశాలలకు వాస్తవంగా చేరిన చెల్లింపులు వేర్వేరు అంశాలు. ఈ అనుమానాలకు కారణం కూడా లేకపోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, ఆ నిధులు దాదాపు రెండు నెలల తర్వాత విడతలవారీగా కళాశాలలకు చేరాయి. కాబట్టి నిధులు విడుదల చేసినట్లు ప్రకటించడం మాత్రమే కాకుండా, అవి కళాశాలలకు ఎప్పుడు చేరాయన్నది కూడా కీలకం.

ప్రభుత్వం ప్రకటించిన మొత్తాలన్నీ పూర్తిగా చెల్లించినట్లు పరిగణించినప్పటికీ, ఇంకా దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ఫీజు బకాయిలు ఉంటాయి. దీనికి తోడు ‘వసతి దీవెన’ గురించి మూడేళ్ళలో ప్రస్తావనే లేదు. వాటిని కూడా లెక్క కడితే మరో రూ.3 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా విద్యా సంవత్సరాల వారీగా చేసిన చెల్లింపులు, మిగిలిన బకాయిలు, కళాశాలలకు వాస్తవంగా చేరిన నిధుల వివరాలను ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. బకాయిల చెల్లింపునకు నిర్దిష్ట గడువు ప్రకటించడంతోపాటు, వాటి పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను వెల్లడించాలి.

ప్రభుత్వ జాప్యానికి విద్యార్థులకు శిక్షా?

ఫీజు బకాయిల ప్రభావం విద్యార్థుల చదువుపై తీవ్రంగా పడుతోంది. ప్రభుత్వం నుంచి ఫీజులు అందలేదనే కారణంతో కొన్ని కళాశాలలు విద్యార్థులపై చెల్లింపుల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. పరీక్షల సమయంలో ఫీజులు చెల్లించాలని పట్టుబట్టడం, హాల్‌టికెట్ల జారీలో ఇబ్బందులు సృష్టించడం, చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ల కోసం తిప్పడం వంటివి విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రైవేటు కళాశాలలకే పరిమితం కాలేదు. కొన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజుల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి రావడం విచారకరం.

మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రతి నెలా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు నిధులు విడుదలవుతున్నాయని ప్రకటించింది. మరి నిధులు విడుదలవుతున్నప్పుడు విద్యార్థుల నుంచి ఫీజులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారో స్పష్టం చేయాలి. ప్రభుత్వం, కళాశాలల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలకు విద్యార్థులను బాధ్యులుగా చేయడం సరికాదు. ఫీజుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి చేయకుండా, అదనపు వసూళ్లకు పాల్పడకుండా ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటుచేయాలి.

విద్యకు దూరమైతే నష్టపోయేది సమాజమే!

బకాయిల సమస్యను ప్రభుత్వం, కళాశాలల మధ్య ఆర్థిక లావాదేవీగా చూడలేం. కుటుంబ ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించాలనే పేద, మధ్యతరగతి విద్యార్థులు కలను నిరుగార్చడమే. ముఖ్యంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యావకాశాలు తగ్గిపోతాయి. చదువు ద్వారా ఉపాధి పొంది జీవితాలను మెరుగుపరుచుకోవాలన్న వారి ఆకాంక్షలు నీరుగారిపోతాయి. నైపుణ్యం కలిగిన యువతను తీర్చిదిద్దే అవకాశాలకూ విఘాతం కలుగుతుంది. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కేవలం సంక్షేమ పథకంగా కాకుండా, పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా చూడాలి.

బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేసి, ఇప్పటివరకు చేసిన చెల్లింపులు, మిగిలిన బకాయిల పూర్తి వివరాలను వెల్లడించాలి. బకాయిల చెల్లింపునకు నిర్దిష్ట గడువు ప్రకటించి, అందుకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయాలి. విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలి. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజులను సకాలంలో విడుదల చేసే శాశ్వత విధానాన్ని అమలు చేయాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీజుల బకాయిలపై వివాదాలు తలెత్తకుండా, ఈ పథకం నిరంతరాయంగా అమలయ్యేలా చూడాలి.

prasanna sfi.jpg

వ్యాసకర్త - ఎస్‌.ఎఫ్‌.ఐ ఎ.పి రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్న కుమార్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్