కాశ్మీర్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులను మోడీ ప్రభుత్వం రెండోసారి వచ్చాక రద్దు చేసింది. ఎలాంటి చర్చ లేకుండా, ఆర్టికల్ 370, 35(ఏ) లను బలవంతంగా రద్దు చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్ము కాశ్మీర్ భూభాగాన్ని భారతదేశంలో ఏ షరతుల కిందైతే విలీనం చేశారో, అవే షరతులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 , 35(ఎ)లలో కాశ్మీర్ వాసుల ప్రత్యేక హక్కులుగా పొందుపరిచారు. తీవ్ర హిందుత్వ అత్యంత మతతత్వపూరితమైనది, ముస్లిం వ్యతిరేకమైనది. కాబట్టి, 2014లో బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి, ముస్లింలు అధికంగా ఉన్న కాశ్మీర్ వాసుల ప్రత్యేక హక్కులను హరించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ మొదటి దఫా మోడీ ప్రభుత్వం అందుకు సాహసించలేదు.
పుల్వామా ఘటన తర్వాత దేశంలో నెలకొన్న ఉద్రిక్తతలు, జాతీయవాద ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని, రెండోసారి వచ్చిన మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి చర్చకు అవకాశం ఇవ్వకుండా కాశ్మీర్ ప్రత్యేక హక్కులను తొలగించింది. ప్రజాస్వామ్య విలువలకు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకుంది.
రాజ్యాంగం కాశ్మీర్ లోని శాశ్వత నివాసులకు భూమి హక్కులతో పాటు అనేక ప్రత్యేక హక్కులను కల్పించింది. అక్కడి భూములు స్థానిక శాశ్వత నివాసితులకే చెందుతాయి. వాటిని బయటివారికి బదిలీ చేయలేరు. అయితే, కాశ్మీర్ భూమి, అడవులు, ఖనిజ వనరులను స్వాధీనం చేసుకోవడానికి కార్పొరేట్ అనుకూల మోడీ ప్రభుత్వంపై కార్పొరేట్ల నుండి బలమైన ఒత్తిడి ఉంది. స్థానిక ప్రజల హక్కులను తొలగించి, ప్రకృతి సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పులు చేశారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులను లాక్కుని ఇప్పటికే ఏడు సంవత్సరాలు గడిచాయి. మోడీ తన లక్ష్యాన్ని సాధించడంలో చాలా వరకు విజయం సాధించారు. ఈ కాలంలో కాశ్మీర్ ప్రజలపై ఆంక్షలు పెరిగాయి. భారీగా సైనిక బలగాలను మోహరించి, కాశ్మీర్‌ను ఒక జైలుగా మార్చారు. ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే పరిస్థితులు నెలకొన్నాయి. భావప్రకటన, నిరసన తెలిపే హక్కులపై ఆంక్షలు విధించారు. ప్రజలను రెండవ తరగతి పౌరులుగా మార్చారు. వారి వాక్ స్వాతంత్ర్యం, నిరసన, అసమ్మతి హక్కును లాక్కున్నారు. మరోవైపు ఎవరికీ తెలియకుండా నిశ్శబ్దంగా భూకబ్జాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ అండతో వివిధ కార్పొరేట్ సంస్థలు... యాపిల్ తోటలు, వరి పొలాలు, ఇతర వ్యవసాయ భూములను ఆక్రమించి, రిసార్ట్‌లతో సహా పలు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాయి. వీటిలో అమిత్ షా కుమారుడికి సంబంధించిన వ్యాపార సంస్థలూ ఉన్నాయి. పహల్గామ్‌లో అమిత్ షా కుమారుడి రిసార్ట్ నిర్మించబడింది.
వ్యవసాయ భూములను వ్యాపార అవసరాలకు మళ్లించడంతో స్థానిక కుటుంబాల ఉపాధి దెబ్బ తింటోంది. వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలకు ఆదాయ మార్గాలు తగ్గుతున్నాయి. నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే అడవులు, కొండలు, ఇతర ప్రకృతి వనరులు కూడా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. పర్యావరణ విధ్వంసం మరింత పెరిగే అవకాశం ఉంది.
కాశ్మీర్ ప్రజల హక్కులను హరించి, వారి భూములు, ప్రకృతి వనరులను కార్పొరేట్లకు అప్పగించే విధానాలు అక్కడి ప్రజల జీవనాధారాలను దెబ్బతీస్తున్నాయి. ప్రజల హక్కుల పరిరక్షణ కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం, కాశ్మీర్‌లో హిందూత్వ రాజకీయ ఆధిపత్యాన్ని పెంచేందుకు ప్రయత్నించడం దేశ ప్రజాస్వామ్యానికి ఆందోళనకర పరిణామాలు.
(‘గణశక్తి’ సంపాదకీయం )







కామెంట్‌లు (0)