మహిళలు, శాంతి, భద్రత (డబ్ల్యు.పి.ఎస్) సూచిక ప్రకారం 181 దేశాల్లో ఏ దేశం కూడా మహిళలపై గృహ హింస విషయంలో నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకోలేదు. దీనినిబట్టే పరిస్థితులు మహిళలకు ఎంత ప్రతికూలంగా మారాయో మనం ఊహించవచ్చు. అయితే మహిళలపై గృహ హింస అనేది అతి తక్కువ జరిగిన దేశాల్లో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉండటం, తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ తదితర దేశాలున్నాయి. ఇదిలా ఉంటే మన దేశం మాత్రం మహిళలపై గృహహింస నిర్మూలన విషయంలో ఏకంగా 128వ స్థానంలో నిలవడం అత్యంత బాధాకరమైన విషయం. అయితే మన దేశంలోనే ప్రధానంగా మహిళలపై గృహ హింస జరిగే విషయంలో ఒక్కసారి వాస్తవాలను తరచి చూస్తే అందుకు ప్రధాన కారణం పురుషాధిపత్య భావజాలమే అనే విషయం మనకు స్పష్టంగా బోధపడుతున్నది. అందులో భాగంగా టీవీ, సినిమా, సోషల్ మీడియా వంటి మాధ్యమాల్లో మహిళను సెక్సువల్ ఆబ్జెక్ట్ గా చూపించడం, ఇంకా నిరక్షరాస్యత, మహిళలకు స్వావలంబన లేకపోవడం, తమ రక్షణ, భద్రతకు సంబంధించిన చట్టాల మీద సరైన అవగాహన లోపం, సురక్షితమైన రవాణా సౌకర్యాలు తగినన్ని లేకపోవడం లాంటి కారణాలు రోజురోజుకు మహిళలపై గృహహింస కేసులు ఇబ్బడి ముబ్బడిగా మన దేశంలో పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. ప్రత్యేకంగా గృహ హింస కింద కేసు వేయాలంటే మాత్రం మహిళ - శిశు సంక్షేమ అధికారుల దగ్గర కానీ, మేజిస్ట్రేట్ దగ్గర కానీ దరఖాస్తు చేసుకోవాలి. ఇక 498ఏ ఫిర్యాదును పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలలో తగిన మార్పులు చేయడం అత్యంత అవసరం. మరోవైవు మహిళల భద్రత కోసం ప్రస్తుతం వున్న చట్టాల మీద చైతన్యమూ కల్పించాలి. మహిళల మీద జరుగుతున్న హింస, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న చట్టాలపైనా స్కూల్ స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. జెండర్ సెన్సిటివిటీని ఓ పాఠ్యాంశంగా చేయాలి.
(నవంబర్ 25 మహిళలు- బాలికలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం)
- బుగ్గన మధుసూదనరెడ్డి,
బేతంచెర్ల, నంద్యాల జిల్లా.







కామెంట్లు (0)