ఒకప్పుడు ఉద్యోగులు జీతం అందగానే కొంత మొత్తాన్ని పొదుపు చేసేవారు. అదే డబ్బు అత్యవసర సమయాల్లో అండగా నిలిచేది. ఇప్పుడు ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. నెల జీతంలో పెద్ద భాగం గృహ రుణాలు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు, ఇతర నిత్యావసరాలకే వెచ్చించాల్సి వస్తోంది. దీంతో మంచి ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా నెలాఖరుకు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఖర్చుకు ప్రణాళిక ఉండాలి
కుటుంబ ఆర్థిక నిర్వహణలో ప్రణాళిక కీలకం. ఇందుకోసం 50/30/20 సూత్రాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. జీతంలో 50 శాతం నిత్యావసరాలకు, 30 శాతం వ్యక్తిగత అవసరాలకు, 20 శాతం పొదుపుకు కేటాయించాలి. అలాగే ఈఎంఐలు మొత్తం ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోవాలి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు అది నిజంగా అవసరమా కాదా అని ఆలోచించాలి. కొనుగోలు చేయాల్సిన వస్తువుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకుంటే అనవసర ఖర్చులను తగ్గించవచ్చు. కుటుంబంలోని ప్రతి ప్రధాన ఖర్చుపై భార్యాభర్తలు పరస్పరం చర్చించి నిర్ణయం తీసుకుంటే బడ్జెట్‌ను సమర్థంగా నిర్వహించడంతో పాటు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం సులభమవుతుంది.
పొదుపే భరోసా
లైఫ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా వంటి రక్షణ పథకాలతో పాటు అత్యవసర అవసరాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవడం అవసరం. చిన్న మొత్తంతో ప్రారంభించినా క్రమం తప్పకుండా పొదుపు చేయడం భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. రెండు దశాబ్దాల క్రితం పెట్టుబడులంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, ఈపీఎఫ్, జీవిత బీమా పాలసీలే ప్రధాన మార్గాలు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్లు, రియల్ ఎస్టేట్, డిజిటల్ బంగారం వంటి అనేక పెట్టుబడి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పూర్తి అవగాహనతోనే పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ల సలహాలను గుడ్డిగా అనుసరించకుండా, తమ ఆదాయం, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు.
ముఖ్యంగా ఐటీ వంటి రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఉద్యోగ విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం, స్థిరమైన ఆస్తులు, దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించడం అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.






కామెంట్‌లు (0)