ఇప్పటి జీవనశైలిలో మహిళలు చదువు, ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తూ కొంత ఆలస్యంగా తల్లులు కావాలని నిర్ణయించుకుంటున్నారు. అందుకే 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం ఇప్పుడు సాధారణ విషయంగా మారుతోంది. వైద్య రంగంలో వచ్చిన పురోగతి వల్ల ఈ వయసులోనూ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం సాధ్యమే! అయితే ఈ దశలో గర్భధారణను కొంత ఎక్కువ జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య, వాటి నాణ్యత క్రమంగా తగ్గుతాయి. ప్రతి నెల గర్భం దాల్చే అవకాశం కూడా తగ్గుతుంది. గర్భస్రావం, గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక రక్తపోటు, నెలలు నిండకముందే ప్రసవం, శిశువులో కొన్ని జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు కొంత పెరుగుతాయి. అందుకే గర్భం కోసం ప్రయత్నించే ముందు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పరీక్షలు భయపెట్టడానికి కాదు... గర్భధారణను మరింత సురక్షితంగా మార్చడానికి.
ముందస్తు పరీక్షలు
గర్భధారణకు ముందు వైద్యులు మొదట అండాశయాల పనితీరును పరిశీలిస్తారు. కొన్ని రక్తపరీక్షలు, అల్ట్రాసౌండ్ ద్వారా అండాల నిల్వ గురించి అంచనా వేస్తారు. దీంతో గర్భం కోసం ఎంతకాలం వేచి చూడవచ్చు, చికిత్స అవసరమా అనే విషయాలపై స్పష్టత వస్తుంది. అదే సమయంలో థైరాయిడ్ పరీక్ష కూడా చాలా ముఖ్యం. థైరాయిడ్ సమస్య ఉంటే అండోత్సర్గం సక్రమంగా జరగకపోవచ్చు. గర్భం రావడంలో ఆలస్యం కావచ్చు. చికిత్స లేకపోతే గర్భస్రావం ప్రమాదం కూడా పెరుగుతుంది.
రక్తంలో చక్కెర, రక్తపోటు పరీక్షలు కూడా తప్పనిసరి. ముందుగానే మధుమేహం లేదా అధిక రక్తపోటును గుర్తించి నియంత్రిస్తే గర్భధారణ సమయంలో వచ్చే అనేక సమస్యలను నివారించవచ్చు. అలాగే హిమోగ్లోబిన్, ఇనుము నిల్వలు, విటమిన్ డి, విటమిన్ బి–12 వంటి పోషకాల స్థాయిలను కూడా పరీక్షిస్తారు. వీటి లోపం ఉంటే రక్తహీనత, అలసట, గర్భంలోని శిశువు ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే అవసరమైతే ముందుగానే పోషకాహార సప్లిమెంట్లు సూచిస్తారు. ముఖ్యంగా గర్భం కోసం ప్రయత్నించే ప్రతి మహిళ రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శిశువులో మెదడు, వెన్నెముక అభివృద్ధికి సంబంధించిన లోపాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్యమే భరోసా
గర్భాశయం, అండాశయాల్లో ఫైబ్రాయిడ్లు, తిత్తులు, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నాయా అని అల్ట్రాసౌండ్ ద్వారా పరిశీలిస్తారు. ఇవి గర్భం రావడాన్ని లేదా గర్భం నిలవడాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలాగే రుబెల్లా, చికెన్‌పాక్స్ వంటి వ్యాధులపై రోగనిరోధక శక్తి ఉందా అని కూడా పరీక్షిస్తారు. అవసరమైతే ముందుగానే టీకాలు వేయించుకోవచ్చు. హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిఫిలిస్ వంటి అంటువ్యాధుల పరీక్షలు కూడా అవసరాన్ని బట్టి చేస్తారు. ఇవన్నీ తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్య రక్షణ కోసమే.
35 ఏళ్లు దాటాక గర్భం దాల్చడం ప్రమాదకరమని అనుకోవడం సరైంది కాదు. అయితే ముందస్తు ప్రణాళిక మాత్రం ఎంతో ముఖ్యం. గైనకాలజిస్టును సంప్రదించి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయించుకోవడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, బరువును అదుపులో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యానికి దూరంగా ఉండడం వంటి అలవాట్లు ఆరోగ్యకరమైన గర్భధారణకు బలమైన పునాది వేస్తాయి. తల్లిగా మారే అందమైన ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, ఆనందంగా మార్చేది ముందస్తు జాగ్రత్తలేనని వైద్యులు గుర్తుచేస్తున్నారు.







కామెంట్‌లు (0)