ప్రజాస్వామ్యంలో ఓటు కేవలం ఒక హక్కు మాత్రమే కాదు. అది రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత విలువైన రాజకీయ అధికారం. ఆ హక్కును వినియోగించే అవకాశాన్ని కల్పించే ఓటరు జాబితా ఎంత ఖచ్చితంగా ఉంటుందో, ప్రజాస్వామ్యమూ అంత బలంగా ఉంటుంది. ప్రస్తుత బిజెపి పాలనలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ -ఎస్‌ఐఆర్) కార్యక్రమం గతానికి భిన్నంగా వివాదాస్పదంగా మారింది. వివిధ రాష్ట్రాలలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలవుతున్న తీరు ప్రజల్లో అనుమానాలకు, రాజకీయ పార్టీల్లో అభ్యంతరాలకు దారి తీస్తోంది. మాజీ ఎన్నికల కమిషనర్లు సైతం ఆందోళనలు వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఈ నెల14తో ముగియాల్సిన ప్రత్యేక సవరణ గడువును ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించి 24వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం యాదృచ్ఛికంగా, ఎన్నికల సంఘం తనంతట తాను తీసుకున్నది కాదు. విస్తృత ప్రజా బాహుళ్యం నుండి క్షేత్ర స్థాయిలో వస్తున్న ఒత్తిడితో పాటు, వివిధ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తుల మేరకే ఈ పొడిగింపు జరిగింది. ఈ విజ్ఞప్తుల ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దానికి స్పందిస్తూ మరో పది రోజుల పాటు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలుత నిర్ణయించిన గడువుకు ప్ర్రకియ మొత్తం పూర్తి కావడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల అధికారులు స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇది ఓటు హక్కుపై ప్రజానీకంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు పరోక్ష అంగీకారమే. అయినా, ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఎస్‌ఐఆర్ పనిలో ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెంచే చర్యే! మిగిలిన కొద్ది రోజుల్లోనే లక్షలాది దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది.
రాష్ట్రంలో సుమారు 4.16 కోట్ల మంది ఓటర్లు ఉండగా, దాదాపు అందరికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘ అధికారులు చెబుతున్నారు. అయితే, అదే స్థాయిలో నింపిన ఫారాలు ఓటర్ల నుండి వెనక్కి రాలేదు. వీటిలో పెద్ద సంఖ్యలో ఫారాలు సేకరించడం సాధ్యం కాదని, వాటి వివరాలు రావడానికి ఏ మాత్రం అవకాశం లేదని (అన్ కలెక్టబుల్) అధికారులు చెబుతుండటం ఆందోళనకరం. అధికారిక సమాచారం ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 43,39,523 మంది ఓటర్ల వివరాలు సేకరించే అవకాశం లేదని అధికారులు తేల్చారు. అంటే ఈ ఓట్లన్నీ రద్దయ్యే ప్రమాదం ఉంది. ఇది పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ తొలగించిన ఓట్లకు దాదాపు సగం కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 2.92 లక్షలు, తిరుపతి జిల్లాలో 2.91 లక్షలు, కర్నూలు జిల్లాలో 2.69 లక్షల ఎన్యూమరేషన్ ఫారాల వివరాలు సేకరించడం సాధ్యం కాదన్నది అధికారులు చెబుతున్న సమాచారం. జిల్లాలోని మొత్తం ఓటర్లలో ఈ తరహా అన్ కలెక్టబుల్ ఫారాల శాతం తిరుపతిలో అత్యధికంగా 16.50, నెల్లూరులో 14.81, కర్నూలులో 12.90 గా ఉంది. పోలవరం జిల్లాలో అత్యల్పంగా 40,186 ఫారాలు ఈ జాబితాలో ఉన్నాయి. చనిపోవడంతో పాటు, వలసలు పోవడం, అసంపూర్ణ వివరాలు, ఆధార పత్రాల లేమి, చిరునామా నిర్ధారణ కాకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు. ఈ దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తారు? వాటిలోని అర్హులైన ఓటర్ల హక్కును ఎలా రక్షిస్తారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇ.సి అధికారుల నుండి రావడం లేదు. మరోవైపు అన్ని వివరాలతో అందిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా నూరు శాతం పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రజలకు ఓటు హక్కును ఇవ్వడానికన్నా తొలగించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదన్న ఆయన ‘ఓటరు జాబితాల ప్రక్షాళన అవసరమే కానీ దాని ఉద్దేశం జాబితాను కుదించడం కాదు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు అందులో ఉండేలా చూడడమే దాని లక్ష్యం’ అని స్పష్టం చేశారు. ఓటు హక్కు ఎన్నికల సంఘం ప్రసాదించిన దయాదాక్షిణ్యం కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కు.’ అని కూడా ఆయన అన్నారు. పెద్ద సంఖ్యలో పేర్లు తొలగిపోయే పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యం ఒక్కసారిగా కూలిపోదని, ఇలాంటి చిన్న చిన్న పరిపాలనా తప్పిదాల ద్వారానే క్రమంగా బలహీన పడుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఏ మాత్రం విస్మరించలేనివి. ఎన్నికల సంఘం చెబుతున్నట్లు నకిలీ ఓట్లను, మరణించిన వారి పేర్లను, ద్వంద్వ నమోదులను నివారించడం ముఖ్యమే. అయితే, ఆ పేరుతో అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు. ఎన్నికల స్వచ్ఛత ఎంత ముఖ్యమో, ఓటు హక్కు పరిరక్షణ అంతకంటే ముఖ్యమైనది. ఒక నకిలీ పేరు ఉండటం కంటే ఒక నిజమైన ఓటరు పేరు తొలగిపోవడమే ప్రజాస్వామ్యానికి పెద్ద నష్టం. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించాలి. కేవలం గడువు పొడిగింపుతో బాధ్యత ముగిసినట్లు భావించకూడదు. పరిశీలనకు వీలుకాదంటూ పక్కన పెడుతున్న ప్రతి దరఖాస్తును మరోసారి క్షుణ్ణంగా చూడాలి. తిరస్కరణకు గురయ్యే ప్రతి ఓటరుకి అభ్యంతరం చెప్పే అవకాశం కల్పించాలి. వలస కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, విదేశాల్లో ఉన్నవారికి ప్రత్యేక విధానం అమలు చేయాలి. ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలి. ఓటు హక్కును కాపాడటమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే! అదే ఎన్నికల సంఘం ముందున్న అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ బాధ్యత.






కామెంట్‌లు (0)