• జులైలోనూ చినుకు జాడ లేదు
• వాన కోసం ఆకాశంకేసి రైతు ఎదురుచూపు
• స్తంభించిన ఖరీఫ్
• వర్షాధార పంటలకు నీటి గండం
• రిజర్వాయర్లు అడుగంటడంతో ప్రమాదంలో కాల్వల కింద సాగు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రం కరువు కోరల్లోకి జారుకుంటోంది. అక్కడ ఇక్కడ అనే భేదం లేకుండా యావత్ రాష్ట్రాన్నీ తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అనావృష్టి పరిస్థితులు భయంకరంగా తయారవుతున్నాయి. ఎల్‌నినో ఎపిపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. మామూలుగా జూన్‌లో తొలకరి వానలు జోరుగా కురుస్తాయి. ముమ్మరంగా ఖరీఫ్ పనులను రైతులు చేపడతారు. కాగా ఈ ఏడాది నైరుతి కాలం తొలి మాసంలో కురవాల్సిన సాధారణ వర్షంలో ఏకంగా 63 శాతం తక్కువ పడింది. తదుపరి నెల జూలైలోనైనా వర్షాలు పడతాయని రైతులు ఆశలు పెట్టుకోగా మొదటి రెండు వారాల్లో చినుకు జాడ లేదు. ఈ పక్షం రోజుల్లో కురవాల్సిన వర్షంలో 70 శాతం తక్కువ కురిసింది. రాష్ట్రం అత్యల్ప వర్షం (సాధారణ వర్షంలో 60-99 శాతం తక్కువ) కేటగిరీలోకి చేరింది.
జూన్‌లో కంటే జూలైలో వర్షాభావం మరింత తీవ్ర రూపం దాల్చింది. ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ పదిహేను రోజుల్లో 94 శాతం మైనస్ నమోదైంది. ఈ సమయంలో 45.87 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా కేవలం 3.02 మిమీ పడింది. కోస్తాలో 78.97 మిమీకిగాను 23.64 మిమీ కురిసింది. ఇక్కడ 70 శాతం తక్కువ వర్షం నమోదైంది. గడచిన పదిహేను రోజుల్లో అన్నమయ్య, కడప జిల్లాల్లో ఒక్క మిమీ కంటే తక్కువ వర్షం కురిసిందంటే వర్షాభావం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.
సీజన్ మొత్తంగా...
ఈ ఏడాది రుతుపవనాలు జూన్ 6న రాష్ట్రంలోకి ప్రవేశించి తొలుత మురిపించి అంతలోనే వెనకపట్టుపట్టడంతో ఆది నుంచీ వర్షాభావం తిష్ట వేసింది. జూన్ 1 నుంచి జూలై 15 వరకు సీజన్ నెలన్నరలో చూసుకుంటే 49.3 శాతం తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలో సగటున 170.3 మిమీ పడాల్సి ఉండగా 86.3 మిమీ పడింది. ఏ జిల్లాలోనూ సాధారణ స్థాయిలో వర్షాల్లేవు. అన్నమయ్య, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ.. నాలుగు జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని తతిమ్మా 24 జిల్లాల్లో తక్కువ (మైనస్ 20-59 శాతం) వర్షం రికార్డయింది. ఎపిలో 676 మండలాలుండగా 80 శాతానికిపైగా మండలాల్లో వర్షాభావం నెలకొందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమగోదావరిలో రాష్ట్రంలోనే కనిష్టంగా 68 శాతం వర్షపులోటు కొనసాగుతోంది. తర్వాత అన్నమయ్య జిల్లాల్లో 67 శాతం మైనస్ రికార్డయింది. ఉన్నంతలో ఇప్పటి వరకు అల్లూరి జిల్లాలోనే కాస్త ఆశాజనకంగా వానలు కురిశాయి.
నిలిచిపోయిన సేద్యం
వర్షాభావం కారణంగా ఖరీఫ్ సాగు దాదాపు నిలిచిపోయింది. సీజన్‌లో నెలన్నర గడిచినా వానల్లేక రైతులు సాగు పనులు చేపట్టట్లేదు. అప్పో సప్పో చేసి సేద్యానికి ఉపక్రమిద్దామనుకున్నా వర్షాల్లేక అడుగు ముందుకేయలేకపోతున్నారు. వానల కోసం ఆకాశం వైపు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. అడపా దడపా పడుతున్న చినుకులతో విత్తనాలేసినా అసాధారణంగా 35-40 డిగ్రీ సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చాలా చోట్ల మొలకలు పైకి రాకుండా భూమిలోని మాడిపోతున్నాయి. ఒక వేళ మొలకెత్తినా తదుపరి వానల్లేక ఎండుతున్నాయి. వర్షాధారంపై పండించే మెట్ట పంటల సేద్యం స్తంభించింది. వేరుశనగ, పత్తి, పప్పుధాన్యాలు, తృణ ధాన్యాల సేద్యం జరగట్లేదు. ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శ్రీశైలం నిల్వ సామర్ధ్యం 215 టిఎంసి కాగా 43 టిఎంసి ఉన్నాయి.
డెడ్ స్టోరేజిగా పేర్కొంటున్నారు. కృష్ణా ఎగువ ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలలోనూ నీళ్లు లేవు. నాగార్జునసాగర్ కెపాసిటీ 312 టిఎంసి కాగా 137 టిఎంసి ఉన్నాయి. పులిచింతల, సోమశిల, కండలేరులోనూ కెపాసిటీ కంటే తక్కువే నీళ్లున్నాయి. ఎగువన వానలు పడటంతో గోదావరికి స్వల్పంగా వరద రావడంతో పట్టిసీమ ద్వారా నీటిని ప్రకాశం బ్యారేజికి తరలించి కృష్ణా డెల్టాలో వరి నాట్లకు కాల్వలకు ఇవ్వాలనుకోగా, ఎల్‌నినో హెచ్చరికల నేపథ్యంలో గోదావరిలో వరద తగినంత లేకపోతే పట్టిసీమ నీరు కూడా ప్రశ్నార్ధకమవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కొంత వరకు గోదావరి డెల్టాలో వరి సాగుకు నీటి సమస్య లేదంటున్నారు. వర్షాభావంతో భూగర్భ జలాలు సైతం లోతుల్లోకి పోతున్నాయి. బోరు భావులపై ఆశ మిణుకుమిణుకుమంటోంది. ఉచిత విద్యుత్ ఇచ్చినా సరఫరాలో అంతరాయాలు, అప్రకటిత కోతల వలన మోటార్లపై సాగు అంతంతమాత్రంగానే ఉంది. ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యానవన పంటలన్నీ కలుపుకొని కోటి ఎకరాల వరకు సాగు ఉండగా వర్షాభావం రైతులను భయపడుతోంది.






కామెంట్‌లు (0)