భారత్‌కు 7,500 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉంది. అయినప్పటికీ క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, కుస్తీ, బాక్సింగ్‌ల మాదిరిగా సముద్ర క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చే ప్రయత్నంలో ఉంది తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల కమలి మూర్తి. ఈ ఏడాది సెప్టెంబరులో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో సర్ఫింగ్ విభాగంలో పాల్గొనే తొలి భారత జట్టులో చోటు దక్కించుకుని చరిత్ర సృష్టించబోతోంది. భారత సర్ఫింగ్‌కు కొత్త గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఆమె అలలతో పోరాడుతోంది.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో మత్స్యకార కుటుంబంలో కమలి జన్మించింది. సముద్రమే వారి జీవనాధారం. తండ్రి మూర్తి చేపల వేటతో కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి సుగంతి ఇంటి బాధ్యతలు చూస్తున్నారు. చిన్నప్పటి నుంచే కమలికి సముద్రం అంటే మమకారం. ఇతర పిల్లలు ఇసుకలో ఆడుకుంటే తాను మాత్రం అలలతో ఆడేది. పర్యాటకులు చూసి మురిసిపోయే సముద్రం ఆమెకు ఆటస్థలం, పాఠశాల, సాధన మైదానం. కమలి చదువును కూడా కొనసాగిస్తోంది. పాఠశాల పూర్తయ్యాక నేరుగా సముద్ర తీరానికి వెళ్లి గంటల తరబడి సాధన చేస్తోంది. తెల్లవారుజామునే వ్యాయామం, శారీరక దారుఢ్య సాధన, ఈత, అలల పరిస్థితుల అధ్యయనం, బోర్డు నియంత్రణ... ఇలా ప్రతిరోజూ కఠినమైన శిక్షణలో పాల్గొంటుంది. పాఠశాల విహారయాత్రలు, స్నేహితులతో గడిపే సమయం, పండుగల సందడి... వీటిలో చాలా వాటిని వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెబుతోంది. కానీ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆ త్యాగాలన్నింటికీ మించినదని భావిస్తోంది.
స్కేట్‌బోర్డు నుంచి సర్ఫ్‌బోర్డు వరకు
కమలి క్రీడా జీవితం సర్ఫింగ్‌తో మొదలు కాలేదు. ఏడేళ్ల వయసులో తన గ్రామంలో స్కేట్‌బోర్డు తొక్కిన ఏకైక బాలికగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అసాధారణ ప్రయాణాన్ని గుర్తించిన న్యూజిలాండ్ దర్శకురాలు సాషా రెయిన్‌బో 'కమలి' పేరుతో ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం బాఫ్టా అవార్డుకు నామినేట్ కావడమే కాకుండా 2020 ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో కూడా చోటు దక్కించుకుంది. దీంతో చిన్న వయసులోనే కమలి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
అయితే ఆమె మనసు మాత్రం స్కేట్‌బోర్డుపై నిలవలేదు. చిన్నతనం నుంచే సర్ఫింగ్ శిక్షకుడిగా పనిచేసే తన మామ అలలపై బోర్డు నడిపే తీరు ఆమెను ఆకట్టుకుంది. మూడేళ్ల వయసులోనే తొలిసారి సర్ఫ్‌బోర్డుపై నిలబడ్డ కమలి, క్రమంగా అదే తన జీవితమని నిర్ణయించుకుంది. "ఒక్కసారి ప్రయత్నించాను... ఆ తర్వాత సముద్రంతో ప్రేమలో పడ్డాను" అని ఆమె చెబుతోంది.
ఈ ప్రయాణంలో కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. ముఖ్యంగా తల్లి సుగంతి ప్రోత్సాహం విశేషం. "మత్స్యకార కుటుంబంలో పుట్టిన పిల్లకు సముద్రం కొత్తది కాదు. అందుకే కమలిని సముద్రంలోకి పంపడానికి ఎప్పుడూ భయపడలేదు. ఇప్పుడు ఆమె విజయం మా కుటుంబానిదే కాదు, తీర ప్రాంతాల్లోని ప్రతి మత్స్యకార కుటుంబానిదే" అని ఆమె చెబుతున్నారు. కమలి విజయాన్ని చూసి తమ పిల్లలను కూడా సర్ఫింగ్‌లో చేర్పించాలని అనేక మంది తల్లిదండ్రులు అడుగుతున్నారని ఆమె ఆనందంగా చెబుతున్నారు.
దేశానికి కొత్త దారి
"దేశంలో 90కి పైగా సర్ఫింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ పోటీలు నిర్వహించాం. చిన్న వయసు నుంచే ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు చేపట్టాం. ఆసియా క్రీడల్లో భారత్ పాల్గొనడం ఆ దీర్ఘకాల కృషికి లభించిన గుర్తింపు" అని భారత సర్ఫింగ్ సమాఖ్య అధ్యక్షుడు అరుణ్ వాసు అంటున్నారు. ఒకప్పుడు సముద్రంలోకి వెళ్లే అమ్మాయిలను సమాజం ప్రోత్సహించేది కాదని, ఎండలో తిరిగితే చర్మం నల్లబడుతుందని, బీచ్‌లలో ఎక్కువసేపు ఉండకూడదని చెప్పేవారని భారత తొలి మహిళా ప్రొఫెషనల్ సర్ఫర్ ఇషితా మలవియా గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కమలి వంటి యువ క్రీడాకారిణులు ఆ అపోహలను చెరిపేస్తున్నారని చెబుతున్నారు.
కమలి మాత్రం తన విజయాన్ని కేవలం పతకాలతో కొలవడం లేదు. "నన్ను చూసి అందరూ సర్ఫింగ్‌నే ఎంచుకోవాలని నేను కోరుకోవడం లేదు. కానీ ప్రతి అమ్మాయి తనకు నిజంగా ఇష్టమైన రంగాన్ని ధైర్యంగా ఎంచుకోవాలి. అది క్రీడ కావచ్చు, కళ కావచ్చు, విజ్ఞానం కావచ్చు. మనసు చెప్పిన దారిలో నడిస్తే విజయమే వెంట వస్తుంది" అంటోంది. అలలపై నిలబడి ప్రపంచాన్ని సవాలు చేస్తున్న కమలి మూర్తి ఇప్పుడు ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు. భారత సముద్ర తీరాల్లో దాగి ఉన్న అవకాశాలకు ప్రతీక. ఆసియా క్రీడల్లో ఆమె ప్రదర్శన ఎలా ఉన్నా, భారత సర్ఫింగ్ చరిత్రలో తొలి అడుగు వేసిన యువతిగా ఆమె పేరు శాశ్వతంగా నిలిచిపోనుంది.








కామెంట్‌లు (0)