ఊబకాయం ఇప్పుడు ప్రపంచం మోస్తున్న అతి పెద్ద భారం. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతున్నారు. ప్రపంచ స్థూలకాయ సమాఖ్య (వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్) విడుదల చేసిన ‘వరల్డ్ ఒబెసిటీ అట్లాస్–2026’ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల పిల్లల్లో ఊబకాయం గణనీయంగా పెరుగుతుందని వెల్లడైంది. మన దేశం ఆ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 5 నుంచి 9 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో 1.5 కోట్ల మంది, 10 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారిలో 2.6 కోట్లకు పైగా పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) ఉన్న పిల్లలు కూడా మన దేశంలో ఎక్కువగానే ఉన్నారు. ఈ సంఖ్యను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. 2025 నాటికి పిల్లల్లో ఊబకాయం తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నాయి. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమై ఇప్పుడు 2030 వరకు దాన్ని పొడిగించాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు, అంటే 20.7 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 2010లో ఈ సంఖ్య 14.6 శాతంగా ఉండేది. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50.7 కోట్ల మంది పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటారని అంచనా. ఈ జాబితాలో 6.2 కోట్ల మంది పిల్లలతో చైనా అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో భారత్, మూడో స్థానంలో అమెరికా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పది దేశాల్లో 5 నుంచి 19 ఏళ్ల వయస్సు గల 20 కోట్లకు పైగా పాఠశాల విద్యార్థులు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి. 2025 చివరి నాటికి ఎనిమిది దేశాల్లో కోటి మందికి పైగా పిల్లలు అధిక బీఎంఐని కలిగి ఉంటారని అంచనా వేశారు. వీరిలో చైనా, భారత్, అమెరికా దేశాల్లోనే కోటి మందికి పైగా పిల్లలు అధిక బరువు, స్థూలకాయంతో బాధపడుతున్నారు.
అధిక బరువు .. అనారోగ్యం
నివేదికలో ఊబకాయం కారణంగా తలెత్తే అనారోగ్య పరిస్థితులను కూడా అధ్యయనం చేశారు. 15 నుంచి 49 ఏళ్ల వయస్సు గల మహిళల్లో 13.4 శాతం మంది అధిక బీఎంఐని కలిగి ఉంటే, 4.2 శాతం మంది టైప్–2 మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం వారిని మరిన్ని అనారోగ్యాల బారిన పడేటట్లు చేస్తుందని నివేదిక హెచ్చరిస్తోంది. 2040 నాటికి అధిక రక్తపోటు ఉన్న వారి సంఖ్య 2.99 కోట్ల నుంచి 4.21 కోట్లకు పెరుగుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. అలాగే మధుమేహం (హైపర్ గ్లైసీమియా) ఉన్న వారి సంఖ్య 1.39 కోట్ల నుంచి 1.91 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం కాలేయ సంబంధిత సమస్యలు 8.39 కోట్ల నుంచి 11.88 కోట్లకు, కొలెస్ట్రాల్ సమస్యలు 4.39 కోట్ల నుంచి 6.07 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.
ఇవీ కారణాలు..
* 11 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న వారిలో 74 శాతం మంది తగినంత శారీరక వ్యాయామం చేయరు.
* మొబైల్, టీవీ, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల శారీరక చలనం తగ్గుతోంది.
* 6 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ప్రతిరోజూ సగటున 50 మిల్లీలీటర్ల చక్కెర పానీయాలను (కూల్‌డ్రింక్స్) తాగుతున్నారు.
* 1 నుంచి 5 నెలల వయస్సు గల శిశువుల్లో 32.6 శాతం మందికి అవసరమైనంత తల్లిపాలు అందడం లేదు.
* కేవలం 35.5 శాతం మంది పాఠశాల విద్యార్థులకు మాత్రమే పాఠశాల మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉంది.
ఫెడరేషన్ సూచనలు
* పిల్లలు ఎక్కువగా తీసుకునే కూల్‌డ్రింక్స్‌పై పన్నులు విధించాలి.
* పిల్లలను లక్ష్యంగా చేసుకున్న జంక్ ఫుడ్ ప్రకటనలను నియంత్రించాలి.
* పాఠశాలల్లో ఆరోగ్యకరమైన ఆహార ప్రమాణాలను పాటించాలి.
* శారీరక శ్రమను, తల్లిపాలను ప్రోత్సహించే తక్షణ చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాలి.
విస్తుపోయే ఈ గణాంకాలు పిల్లల ఊబకాయం కేవలం రూపానికి సంబంధించిన సమస్య కాదని చెబుతున్నాయి. భవిష్యత్తు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన ప్రజారోగ్య సవాలుగా అది మారనుంది. కుటుంబం, పాఠశాల, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఈ సమస్యను తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం ప్రతి చిన్నారి హక్కు. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత కుటుంబానిదే కాదు.. సమాజం మొత్తానిది.







కామెంట్‌లు (0)