కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్న వేళ, అమెరికా మరోసారి ఇరాన్‌పై వైమానిక దాడులకు దిగడం అత్యంత అమానుషం, గర్హనీయం. శాంతి వైపు వేసిన అడుగును మళ్లీ యుద్ధం వైపు, ఉద్రిక్తతల వైపూ లాగిన దుర్మార్గ, దురహంకార చర్య ఇది. ఇరాన్ ప్రజలు తమ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీకి అంతిమ వీడ్కోలు పలుకుతున్న విషాద వాతావరణంలో అమెరికా దాడులకు పాల్పడడం కనీస మానవీయ స్పృహ, దౌత్య సంయమనం లేని నీచానికి నిదర్శనం. యుద్ధాలకు కూడా కొన్ని నైతిక హద్దులుంటాయి. మరణం, దుఃఖం, అంతిమ సంస్కారాల సందర్భాల్లో సంయమనం పాటించడం నాగరిక ప్రపంచం ఆశించే కనీస ప్రమాణం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాటన్నిటినీ తోసిరాజని టర్కీ పర్యటనలో ఉంటూనే బెదిరింపులకు, దాడులకు బరితెగించడం హద్దుల్లేని అహంభావానికి, అమానుషానికి నిదర్శనం. ఇరాన్ నాయకత్వాన్ని ఉద్దేశించి 'నీచులు', 'ఉన్మాదులు', 'ఉగ్రవాదులు' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అక్షరాలా ఆ వదరుబోతుకే వర్తిస్తాయి.
ఒకపక్క చర్చలు జరుగుతుండగానే ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం కురిపించి ఆ దేశం సుప్రీం నాయకుడు ఖమేనీని, ఇంకొంతమంది ముఖ్య నాయకులను పొట్టనపెట్టుకుంది. నాయకత్వాన్ని నిర్మూలించి, అస్తవ్యస్త, అస్థిర పరిస్థితులు కల్పించి, ఇరాన్‌ను తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని భావించింది. అది సాధ్యమయ్యే పని కాదని, ఇరాన్ చేత అనేకమార్లు చావుదెబ్బలు తిన్నాక కానీ దానికి అర్థం కాలేదు. ఈ యుద్ధంతో ఏం సాధించారని అమెరికా ఇంటా, బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. చర్చల్లో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒప్పందం కుదిరాక కూడా ట్రంప్ అడ్డూ అదుపూ లేకుండా ఆధిపత్య వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉండడం శాంతి ప్రక్రియకు ఎప్పటికప్పుడు విఘాతం ఏర్పడింది. హోర్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని బీరాలు పలికితే, అది మీ ఆటస్థలం కాదంటూ ఇరాన్ గట్టిగానే హెచ్చరించింది. పెడబుద్ధి మారని అమెరికా ఉన్నఫళాన శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచి, ఇరాన్‌పై దాడులకు తెగించింది. ఇంకా దాడులు కొనసాగిస్తామని నిస్సిగ్గుగా ప్రకటించింది. ఇరాన్ కూడా తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించింది.
భౌగోళికంగానో, భౌతిక నష్టంగానో చూస్తే అమెరికా కిరాతక దాడి ఇరాన్‌కే పరిమితం కావొచ్చు. వాస్తవానికి ఇది వాషింగ్టన్ ప్రపంచ ప్రజల మీద చేస్తున్న దాడి. ట్రంప్ యుద్ధోన్మాదం పర్యవసానాన్ని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు, ప్రజలు చవిచూడాల్సి వస్తోంది. ఈ ప్రభావం భారత్‌పై మరింత తీవ్రంగా ఉంటుంది. దేశానికి అవసరమైన ముడి చమురులో 85 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధర పెరిగిన ప్రతిసారీ దేశ విదేశీ మారక నిల్వలపై, దిగుమతి బిల్లుపై, ద్రవ్యోల్బణంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగి సామాన్యజనం విలవిల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టాక్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల మదుపుదారుల సంపద ఆవిరైపోతోంది. బియ్యం, ఔషధాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాలు, రసాయనాలు, మాంస ఉత్పత్తుల ఎగుమతులపైనా మళ్లీ ప్రభావం పడుతుంది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచ జీవనం మరింత కష్టతరమవుతుంది. అమెరికా సామ్రాజ్యవాదం, ఆధిపత్య ధోరణి ప్రపంచానికి ఎంత ప్రమాదకరమో వర్తమాన చరిత్ర పదేపదే గుర్తు చేస్తోంది. అందుకనే భారత్ ఈ విషయమై నోరు విప్పి ట్రంప్ విధానాలను ఖండించాలి. దుర్మార్గ దాడులు, దుష్ట పన్నాగాలు ప్రపంచ శాంతికి, పౌరుల జీవనానికి భంగకరమన్న విషయాన్ని గొంతెత్తి చెప్పాలి.
ఇరాన్‌లోని ఆర్థిక వనరుల మీద, చమురు వ్యాపారాల మీద పెత్తనం చెలాయించాలన్న అమెరికా దుష్ట పన్నాగం ఫలించేది కాదని ఈ నాలుగు నెలల యుద్ధానుభవం స్పష్టం చేసింది. వాస్తవానికి ఇరాన్‌పై దాడి, అనంతర పరిణామాలు అమెరికాకు పెద్ద గుణపాఠం. ఆ అనుభవం నుంచి అది బుద్ధి తెచ్చుకోవాలి. తన ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. ప్రపంచానికి తానే పెద్దన్న, తానే తీర్పరి అనే భావనను విడిచిపెట్టాలి. సార్వభౌమ దేశాల గౌరవాన్ని, అంతర్జాతీయ చట్టాలను, బహుళపాక్షిక దౌత్యాన్ని గౌరవించాలి. యుద్ధాలు ఎప్పుడూ విజేతలను సృష్టించవు; కొత్త బాధితులను మాత్రమే సృష్టిస్తాయి. ప్రపంచానికి ఇప్పుడు కావలసింది శక్తి ప్రదర్శన కాదు, శాంతి ప్రదర్శన.






కామెంట్‌లు (0)