శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకార్పొరేట్లకు కారుచౌకగా ‘రుషికొండ’

1 గంట క్రితం

rushikonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 05:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

రాష్ట్రంలోని ప్రజా వనరులను తన రాజకీయ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. తాజాగా విశాఖపట్నంలోని రుషికొండను తన అనుయాయులకు ధారాదత్తం చేసేందుకు టెండర్లను ఆహ్వానించే తంతు కూడా ప్రారంభించింది. రుషికొండలో వైసిపి ప్రభుత్వం రూ.450 కోట్లతో ప్యాలెస్‌లు నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని గగ్గోలు పెట్టారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రుషికొండకి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ పర్యటనల మీద పర్యటనలు చేశారు. తమ పార్టీ అనుయాయులతో హైకోర్టులో కేసులు కూడా వేయించారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారు.

జగన్‌మోహన్ రెడ్డి నిర్మించిన ఏడు ప్యాలెస్‌లనే కాదు, మొత్తం రుషికొండనే కబళించటానికి టిడిపి - జనసేన - బిజెపి కూటమి అగ్ర నాయకత్వం ప్రయత్నిస్తున్నది. రుషికొండ శిఖర భాగాన్ని కూడా మార్కెట్‌లో పెట్టారు. అంతటితో ఆగలేదు సరికదా... ఇదే అదనుగా రుషికొండ పక్కన ఉన్న మరో తొమ్మిదెకరాల సముద్ర తీర భూమిని కూడా కొల్లగొట్టటానికి వల వేశారు. మొత్తం రుషికొండ భూముల విలువ సుమారు రూ.10 వేల కోట్లకు పైగానే ఉంటుంది.

ప్రజల ఆస్తులను కొల్లగొట్టటానికి బూర్జువా పాలక వర్గాలు ఎలా ముందస్తు కుట్ర పూరిత ప్రచారానికి ఒడిగట్టి తమ వశం చేసుకుంటాయనడానికి విశాఖ రుషికొండ మంచి ఉదాహరణ. అధికారంలోకి వచ్చిన తరువాత మొదట అందరినీ ప్యాలెస్‌ల సందర్శనకు అనుమతిస్తాం అన్నారు. ఆ తరువాత కుదరదన్నారు. వైసిపి వలె రుషికొండ చుట్టూ నిషేధాజ్ఞలు విధించారు. ప్రతి నెలా రూ.25 లక్షలు ప్రజాధనం వృథాగా మెయింటినెన్సు ఖర్చవుతుందనే ప్రచారం ప్రారంభించారు. వీటిని ఎలా ఉపయోగించాలో అధ్యయనం చేయటానికి మంత్రుల బృందం వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందం వీటిని ప్రైవేట్‌కు ఇవ్వాలనే భావనను మీడియా ద్వారా లీక్ చేశారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజాభిప్రాయ సేకరణ అనే నాటకానికి తెర లేపారు. ప్రజలు పెద్ద ఎత్తున రుషికొండ ప్యాలెస్‌లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టకూడదని తెగేసి చెప్పారు. అంతేగాక దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సైన్స్ సిటీలు ఉన్నాయని, అందువల్ల ఈ భవనాలను ప్రజల కోసం సైన్స్ సిటీగా, బాలల విజ్ఞాన కేంద్రంగా వినియోగించాలని ప్రభుత్వానికి వేల సంఖ్యలో విజ్ఞాపనలు పంపారు. ఆ విధంగా చేయడం వల్ల విశాఖ ప్రజలకే కాక, మొత్తం పర్యాటకులకు ఎంతో ఉపయోగం జరుగుతుందని తెలిపారు. వీటిలో ఏ ఒక్క దానినీ పరిగణనలోకి తీసుకోలేదు. పైపెచ్చు పర్యాటక అభివృద్ధి, ఇంటర్నేషనల్ డెస్టినేషన్ వంటి మాయమాటలు ముందుకు తీసుకొచ్చారు. ప్రజాభిప్రాయ తంతుతో పాటు సమాంతరంగా ముఖ్యమంత్రి బడా పెట్టుబడిదారులతో విజయవాడలో రుషికొండ ప్యాలెస్‌లపై మరో సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో రుషికొండపై స్టార్ రిసార్ట్స్ నిర్మాణాలకు ప్రెజెంటేషన్లు ఇప్పించుకున్నారు.

రుషికొండ సముద్ర తీరంలో ఉన్న ఒక అరుదైన కొండని ప్రజల విజ్ఞాన కేంద్రంగా, సైన్స్‌ సిటీగా వినియోగించడం కుదరదని, అలా చేస్తే అది అభివృద్ధికి ఆటంకమనే విష ప్రచారానికి పూనుకున్నది. ఆఘమేఘాల మీద ఆసక్తికర సంస్థల పేర టెండర్ల ఆహ్వానాన్ని విడుదల చేసింది.

మొత్తం రుషికొండను, దాని చుట్టూ ఉన్న వేల కోట్ల రూపాయల విలువ చేసే మొత్తం భూమిని స్టార్ హోటల్, రిసార్ట్స్ పేర తన అనుయాయులకు ధారాదత్తం చేస్తున్నది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పేర 99 ఏళ్లకు దీనిని కట్టబెట్టబోతున్నారు. అనేక దశాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన సముద్ర తీర ప్రజా ఉమ్మడి ప్రయోజనాల రుషికొండను ఒక రాజకీయ కార్పొరేట్ సంస్థకి సొంత ఆస్తిగా బదలాయింపు జరగనుంది.

ఈ విచ్చలవిడి దోపిడీనే క్రోనీ పెట్టుబడిదారీ విధానం అంటున్నాం. పిపిపి, వృద్ధిరేటు, అభివృద్ధి వంటివన్నీ అడ్డగోలు దోపిడీకి ముద్దు పేర్లు. ఈ ముసుగులో విశాఖ సముద్ర తీరాన్ని, ప్రజా వనరులను యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. ఈ కొండలన్నీ వేల సంవత్సరాలుగా విశాఖ పర్యావరణ సమతుల్యానికి రక్షణ కోటలుగా ఉన్నాయి. 2014లో సంభవించిన ఘోర హుదూద్ తుఫాన్ నుండి కూడా విశాఖ ప్రజలను రక్షించాయి. వేడి గాలులు, ఉష్ణోగ్రత, సముద్ర విస్ఫోటనాలు వంటివి పెరగకుండా దట్టమైన అడవితో కప్పబడి ఉన్న ఈ కొండలు ఈ ప్రమాదాలను నిలవరిస్తున్నాయి.

ఇపుడు రుషికొండ చుట్టూ వైజాగ్ బే సిటీ అనే మరొక దానిని కూటమి ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. చుట్టూ 45 చదరపు కిలో మీటర్ల సముద్ర తీరప్రాంతాన్ని మార్కింగ్ చేసింది. ఈ ప్రాంతమంతా ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేస్తామని, కైలాసగిరి నుండి భీమిలి వరకు సముద్ర తీరం మొత్తాన్ని అమెరికా లోని ఫ్లోరిడా సిటీ మియామీ బీచ్ షోర్ కారిడార్, దుబాయ్ జుమేరా బీచ్‌లా అభివృద్ధి చేస్తామని బ్లూ ప్రింట్ ప్రకటించారు. ప్రపంచశ్రేణి క్లబ్బులు, లగ్జరీ హోటళ్లు, ప్రపంచ ప్రమాణాలు కలిగిన రిసార్టులు, సీ వ్యూ రెస్టారెంట్స్, విలాసవంతమైన విల్లాలు, ఎత్తైన ఐకానిక్ నివాస భవనాలు, షాపింగ్ మాల్స్ ఇలా అనేకమైనవి ఈ వైజాగ్ బే సిటీ లో ఉండబోతున్నాయని పేర్కొన్నారు. అత్యంత విలాసవంతమైన ఈ బే సిటీ నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి ప్రైవేట్ సంస్థ లతో నిర్మిస్తామని ప్రకటించారు. అంటే మొత్తం బీచ్ ప్రాంతాన్ని ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టబోతున్నారు. కైలాసగిరి, తోట్లకొండ వంటి ప్రముఖ పర్యాటక కొండల్ని కూడా ప్రైవేట్ చెరలోకి బదిలీ చేయనున్నారు.

గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు బే పార్క్, రాడిసన్ బ్లూ, అదానీ డేటా సెంటర్ వంటి అనేక సంస్థలకు ప్రభుత్వ కొండలను, సముద్ర తీరాన్ని కట్టబెట్టారు. ఇటీవల రిసార్ట్స్ పేర వందల ఎకరాల సముద్ర తీరాన్నీ ధారాదత్తం చేశారు. తాజాగా ఆర్కే బీచ్‌లో లులూ మాల్ అనే సంస్థకు ఏకంగా 2 వేల కోట్ల విలువ కలిగిన భూమిని సమర్పించారు. బీచ్ షాక్స్ పేర నేడు బీచ్‌లో బార్ షాపులు ప్రారంభానికి కూడా తెగబడ్డారు. ఈ ప్రమాదకర చర్యను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా నిస్సిగ్గుగా ఎదురు దాడికి దిగుతున్నారు. కుటుంబ సమేతంగా బీచ్ షాక్స్‌కి వెళ్ళి తనివి తీరా విహరించవచ్చనే ప్రచారానికి దిగారు. బీచ్ షాక్స్‌తో విశాఖపట్నం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు రావటంతో పాటు రూ.వేల కోట్ల విదేశీ పెట్టుబడులు కూడా వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇలా విశాఖ నగరమే కాదు మొత్తం రాష్ట్రంలోని తీర ప్రాంతాన్నంతటిని ప్రైవేటు శక్తుల పరం చేయటానికి ప్రభుత్వం పూనుకున్నది.

ప్రభుత్వమే హామీగా వుండి పెట్టుబడులకు బ్యాంకుల నుండి రూ.వందలు వేల కోట్లు ఇప్పిస్తున్నది. 10 నుండి 20 ఏళ్ల వరకు పన్ను ల రాయితీలు, విద్యుత్ చార్జీల రాయితీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వమే వయబిలిటి ఫండ్ గ్యాప్ పేర ప్రజా ఖజానా నుండి వేల కోట్ల రూపాయలు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. భూములను 99 పైసలకు లేదా అతి తక్కువ ధరలకే కట్టబెడుతున్నారు. వీటికి ప్రతిఫలంగా అధికార కూటమి పార్టీలు ఎన్నికల బాండ్లు, విరాళాలు, ముడుపులు, క్విడ్‌ ప్రో ‌కో కింద రూ.వందల వేల కోట్లు పొందుతున్నాయి.

ఉమ్మడి ప్రజా వనరులు, ప్రభుత్వ ఆస్తులు, సహజ వనరులు, సముద్ర తీరం, అరుదైన బీచ్ ఖనిజాలు వంటి వాటిని బరితెగించి లూటీ చేయటానికి అడ్డంకిగా ఉన్న చట్టాలన్నింటిని మార్చేస్తున్నారు. కోస్టల్ రెగ్యులేటర్ జోన్ నిబంధనలను బడా ప్రైవేట్ సంస్థల వ్యాపారాలకు అనుకూలంగా మార్చబోతున్నారు. మారిటైమ్ టైమ్ విధానాన్ని సరళతరం చేశారు. భూ వినియోగ నిబంధనలను, పట్టణ మాస్టర్ ప్రణాళిక, జోనింగ్ విధానం, నిబంధనలను, ప్రైవేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేస్తున్నారు. ప్రస్తుత పర్యావరణ విధానాన్ని, నియమ, నిబంధనలను కూడా పూర్తిగా మార్చేయటానికి సిద్ధపడుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ, సామాజిక తనిఖీ, ప్రాజెక్టు పర్యావరణ, సామాజిక ప్రభావ నివేదిక వంటి వాటికి తావు లేకుండా చేస్తున్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ - అదానీ డేటా సెంటర్ నిర్మాణాలకు అవసరమైన పర్యావరణ అనుమతుల ప్రక్రియను తెలుగుదేశం కూటమి, కేంద్ర బిజెపి కుట్రతో పూర్తిగా తుత్తునియలు చేసేశాయి. ‘ఏ’ కేటగిరీలోని అంశాన్ని రాష్ట్ర పరిధిలోని ‘బి’ కేటగిరీలోకి మార్చేసి కేవలం ఐదు రోజుల్లోనే పర్యావరణ, అటవీ అనుమతులను గూగుల్ డేటా సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది. భూ చట్టాలను రైతులకు నష్టదాయకంగా మార్చేస్తున్నారు.

వీటన్నిటికి అభివృద్ధి ముసుగు తొడుగుతున్నారు. సహజ వనరులనే కాదు, మొత్తం పట్టణ పౌర సేవలు, మౌలిక సదుపాలన్నింటినీ కూడా తమ అనుయాయులకు కైంకర్యం చేస్తున్నారు. ఈ దోపిడీలో వైసిపి, తెలుగుదేశం, జనసేన, బిజెపి మధ్య ఎలాంటి తేడా లేదు. పైగా వైసిపి ని మించిపోయి ఈ దోపిడీని తెలుగుదేశం కూటమి విచ్చలవిడిగా సాగిస్తున్నది. మొత్తం విశాఖ నగరాన్నే ధ్వంసం చేస్తున్నారు. ఈ దోపిడీ విధానాన్ని, చర్యలను ప్రతిఘటించక పోతే విశాఖ నగరం ప్రైవేట్ నగరంగా మారిపోయే ప్రమాదం ముంచుకొస్తున్నది.

Gangarao garu

వ్యాసకర్త -డా॥ బి.గంగారావు

సెల్‌: 9490098792

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్