శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅప్రమత్తతతో ప్రాణ రక్షణ

1 గంట క్రితం

JIVANA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 05:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక్క క్షణం నిర్లక్ష్యం... ప్రాణాన్ని బలితీసుకోగలదు. మునిగిపోవడం అలాంటి ప్రమాదమే! నదులు, చెరువులు, బావులు, కాలువలు, స్విమ్మింగ్ పూల్స్... నీరు ఉన్న ప్రతి చోటా ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను బలితీసుకుంటోంది. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూలై 25ను ప్రపంచ మునిగిపోవడం నివారణ దినోత్సవంగా నిర్వహిస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది నీటిలో మునిగి మరణిస్తున్నారు. భారత్ కూడా ఈ విషాద గణాంకాల్లో ముందున్న దేశాల్లో ఒకటి. 2021లో భారతదేశంలో 36,362 మంది మునిగి మరణించారు. ఇందులో 30–44 సంవత్సరాల వయసు వారు 28.6 శాతంతో అత్యధికంగా ఉండగా, 18–29 సంవత్సరాల యువత 27.5 శాతం, 45–59 సంవత్సరాల వారు 17 శాతం, 14–17 సంవత్సరాల వారు 9.8 శాతం, 0–13 సంవత్సరాల పిల్లలు 13.2 శాతం ఉన్నారు.

మన రాష్ట్రంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2024లో రాష్ట్రంలో 1,345 మునిగిపోయిన ఘటనలు నమోదై, 1,403 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017–2022 మధ్య 10,076 మంది మునిగి మరణించారు. అంటే, సగటున ఏటా 1,680 మంది, రోజుకు నలుగురు ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గోదావరి, కృష్ణా నదులు, విస్తారమైన కాలువల వ్యవస్థ, వేలాది చెరువులు, సముద్ర తీరం ఉండటం వంటి కారణాలతో రాష్ట్రంలో ఈ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంది.

మునిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం, ఈత రాకపోవడం, వరదల సమయంలో ప్రవాహాన్ని తక్కువ అంచనా వేయడం, చెరువులు, నదుల్లో ప్రమాదకర సాహసాలు చేయడం, మద్యం సేవించి నీటిలోకి దిగడం, పడవల్లో లైఫ్ జాకెట్లు ధరించకపోవడం, పిల్లలను పర్యవేక్షణ లేకుండా నీటి వనరుల వద్ద వదిలేయడం ముఖ్యమైనవి.

ప్రాణాలను కాపాడే జాగ్రత్తలు

మునిగిపోవడం అనేది పూర్తిగా నివారించగల ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొన్ని సాధారణ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

• చిన్న పిల్లలను చెరువులు, బావులు, కాలువలు, నదుల వద్ద ఒంటరిగా వదిలేయకూడదు.

• ప్రతి చిన్నారికి చిన్న వయస్సు నుంచే ఈత నేర్పించాలి.

• బావులు, చెరువులకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి.

• పడవ ప్రయాణాల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలి.

• వరదల సమయంలో ప్రవాహాన్ని దాటి వెళ్లేందుకు ప్రయత్నించకూడదు.

• మద్యం సేవించిన తర్వాత నీటిలోకి దిగకూడదు.

• నదులు, డ్యాంలు, సముద్ర తీరాల్లో ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, అజాగ్రత్త సాహసాలు చేయకూడదు. ప్రవాహాన్ని, లోతును, జలాశయం స్వభావాన్ని అంచనా వేయకుండా నీటిలోకి దిగకూడదు.

• ప్రతి గ్రామంలో, పాఠశాలలో ప్రాథమిక ప్రాణరక్షణ (సిపిఆర్‌) శిక్షణ అందించాలి.

• ప్రమాదకర జలాశయాల వద్ద హెచ్చరిక బోర్డులు, రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలి. ‌సందర్శకులు వాటిని కచ్చితంగా పాటించాలి.

మునిగిపోవడం అనేది చాలా సందర్భాల్లో నివారించగల ప్రమాదం. చిన్నపాటి అప్రమత్తత, పిల్లలపై నిరంతర పర్యవేక్షణ, ఈతపై అవగాహన, భద్రతా నియమాల పాటింపు వల్ల ఏటా వేలాది ప్రాణాలను కాపాడవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్