అమెరికాతో కుదరనున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ) చుట్టూ నెలకొన్న చర్చలు, తాజా ట్రంప్ సుంకాల ప్రకటనలతో భారత ఎగుమతులు, వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ పై సుంకాలను 18 శాతానికి తగ్గించారని మురిసిపోయి ప్రకటించిన మోడీ, అమెరికా నుండి దిగుమతులపై భారత్ మొత్తం సుంకాలనే ఎత్తేస్తుందన్న ట్రంప్ ప్రకటనపై నోరు మెదపకపోవడం గమనార్హం. తాజాగా ట్రంప్ ప్రకటించిన 10 శాతం టారిఫ్‌లతో స్వల్ప ఉపశమనం పొందామని ప్రభుత్వం సంతృప్తి చెందవచ్చు. కానీ, దీని వల్ల భారతావనికి పెద్దగా ఒరిగిందేమీ ఉండదని ఆర్థిక నిపుణుల మాట. అయితే, ఒక వైపు సుంకాల ఒత్తిడి, మరోవైపు వాణిజ్య ఒప్పందపు షరతులు ఈ రెండింటి మధ్య నలిగిపోయేది సామాన్యుడే. ఇప్పటికే యు.కె, న్యూజిలాండ్‌లతో ఎఫ్‌టిఎలు కుదిరాయి. ఆ దేశాలతో పాటు అమెరికా నుండి చౌక దిగుమతుల వరద వస్తే దేశీయ ధరలు కుప్పకూలడం, రైతుల ఆదాయం పడిపోవడం, గ్రామీణ ఉపాధిపై ప్రభావం పడటం తప్పదు. దీంతో కోట్లాది మంది జీవనోపాధికి వెన్నెముకైన వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొనటం ఖాయం. ఇవన్నీ కేవలం ఊహాజనితాలు కావు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఒప్పందాల అనుభవాలు నేర్పిన గుణ పాఠాలు.
అమెరికాలో సగటు వ్యవసాయ భూమి 469 ఎకరాలు కాగా, భారతదేశంలో ఇది కేవలం 2.67 ఎకరాలు మాత్రమే. అమెరికాలో కేవలం 2 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడితే, భారతదేశంలో దాదాపు 48 శాతం మంది ఆధారపడి ఉన్నారు. ఈ గణాంకాలు రెండు దేశాల వ్యవసాయ రంగాల మధ్య ఉన్న అసమానతలను స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, భారతీయ చిన్న, మధ్య తరహా రైతులు అమెరికా ఉత్పత్తులతో పోటీ పడటం అసాధ్యం. ఇది కేవలం రైతులకే కాకుండా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ), దేశీయ పరిశ్రమలు, సాంప్రదాయ విత్తన హక్కులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన నిబంధనలు రైతుల సాంప్రదాయ విత్తన హక్కులను ప్రభావితం చేస్తాయని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. దిగుమతి సుంకాలు తగ్గితే, భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోతారు. అంతేకాకుండా, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, గోధుమలు, బియ్యం, చక్కెర, సోయాబీన్స్ వంటి సున్నితమైన రంగాలపై కూడా ఈ ఒప్పందం ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నాడు పంజాబ్, హరియాణా, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీ వైపు కదిలారు. అయితే, హరియాణా పోలీసులు వారిని సరిహద్దుల్లోనే అడ్డగించారు. ఇది కేవలం ఒక నిరసన కాదు, రైతన్నల గుండెల్లో గూడుకట్టుకున్న భయానికి ప్రతిబింబం. ఒప్పందం ఇంకా ఖరారు కాకముందే వారు వీధుల్లోకి రావడమే సమస్య తీవ్రతను చెబుతోంది.
ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు ఉత్పాదక వ్యయంపై 50 శాతం కలిపి కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. దేశంలోని చిన్న, సన్నకారు రైతుల, కౌలు రైతుల వ్యవసాయ రుణాలన్నింటినీ ఒకేసారి పూర్తిగా మాఫీ చేసి ఆదుకోవాలి. విద్యుత్ ప్రైవేటీకరణ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను దూరం చేస్తుంది. ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, పంట నష్టపరిహారం, బ్యాంక్ రుణాలు, మద్దతు ధర అందేలా చూడాల్సిన బాద్యత పాలకులదే.
జనరిక్ ఔషధాలపై అమెరికా భవిష్యత్తులో 200 శాతం వరకు సుంకాలు విధించే ప్రతిపాదన, ప్రపంచ దేశాలకే కాదు, మన సొంత ఔషధ పరిశ్రమ మనుగడకూ ముప్పు తెచ్చేదే. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, మానసిక ఆరోగ్యం వంటి అనేక వ్యాధులకు చౌకగా మందులందించే మన ఔషధ కంపెనీలు, భవిష్యత్తులో అమెరికాలోనే తయారీ యూనిట్లు పెట్టాలన్న ఒత్తిడిని ఎదుర్కోబోతున్నాయి. భారత్ 2025లో 38 శాతం అంటే 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఒక్క అమెరికాకే ఎగుమతి చేసింది. జనరిక్ ఔషధాల ఎగుమతుల్లో అమెరికాపై అత్యధికంగా ఆధారపడిన దేశం భారతేనని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ సమస్య కాదు భారతీయులకు ఉద్యోగాలు, పెట్టుబడులు, ఎగుమతి ఆదాయం అన్నింటిపైనా దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశం.
కేంద్ర ప్రభుత్వం రైతులు, సంఘాల ప్రతినిధులు, నిపుణులు, ప్రజాప్రతినిధులతో కనీస సంప్రదింపులు జరపకుండా, మూసిన తలుపుల వెనుక కుదుర్చుకునే ఒప్పందం నష్టదాయకం. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యతను, కోట్లాది మంది జీవనోపాధి దానిపైనే ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని విస్మరించి తీసుకునే ఏ నిర్ణయమైనా దేశానికి శ్రేయస్కరం కాదు. వాణిజ్య ఒప్పందాల పేరుతో సామాన్యుల నడ్డి విరిస్తూ భారత్ వికసిస్తుందంటే జనులు ఒప్పరు. వినాశకరమైన అమెరికాతో వాణిజ్య ఒప్పందం నుండి భారత్ వైదొలగడమే శ్రేయస్కరం.







కామెంట్‌లు (0)