అనావృష్టికి 90% భూభాగం
599 మండలాల్లో వర్షాభావం
240 మండలాల్లో *పరిస్థితి దారుణం
కృష్ణా డెల్టాలో *వరి వద్దంటున్న ప్రభుత్వం
గోదావరి ఆయకట్టుకూ కటకట
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రాన్ని తీవ్ర దుర్భిక్షం చుట్టుముట్టింది. జూలై నాల్గవ వారం గడుస్తున్నా వాన చినుకు అడ్రస్ లేదు. మొత్తం అన్ని జిల్లాలూ వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏడు జిల్లాల్లో అత్యల్ప స్థాయి (సాధారణంలో 60-99 శాతం తక్కువ) వర్షం పడింది. రోజురోజుకూ వర్షాభావం తీవ్ర రూపం దాల్చుతోంది. ఎల్‌నినో వలన భవిష్యత్తులో కూడా అంతగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. ఖరీఫ్‌లో జూలై ముగుస్తున్నందున ఈ ఏడాది సీజన్ ఖాళీయేనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎపిలో 688 మండలాలకుగాను 599 మండలాల్లో వర్షాభావం తిష్ట వేసింది. వాటిలో 240 మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరో 359 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం నమోదైంది. కేవలం 74 మండలాల్లోనే సాధారణ వర్షం పడింది. సాధారణం కంటే ఎక్కువ 15 మండలాల్లో, పడింది. నైరుతి రుతుపవన కాలం ప్రారంభ నెల జూన్‌లో 48.3 శాతం తక్కువ వర్షం నమోదైంది. అన్ని జిల్లాలూ వర్షాభావంలో మగ్గాయి. తదుపరి జూలైలోనైనా వానలు పడతాయనుకోగా వర్షాభావం ఇంకా పెరిగింది. జూలై 1 నుంచి 24 మధ్య ఏకంగా 76 శాతం లోటు వర్షం నమోదైంది. అల్పపీడనం, వాయుగుండం, ఆవర్తానాలు.. ఇవేవీ వర్షాలు కురిపించలేదు. అడపాదడపా చినుకులతోనే సరిపెట్టాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కొద్ది మేర వానలు పడ్డాయి. సాంకేతికంగా శుక్రవారం ఉదయం వరకు సాధారణ వర్షం పడ్డ కేటగిరీలో ఉన్న ఆ జిల్లా సాయంత్రానికొచ్చేసరికి మైనస్‌లోకి జారింది.
రోజు రోజుకూ...
జూన్ 1 నుంచి జూలై 24 మధ్య రాష్ట్రంలో సగటున సాధారణంగా 228.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 104.6 మిమీ కురిసింది. సాధారణ వర్షంలో 54.2 శాతం తక్కువ. జూలైలో ఈ పాటికి 131 మిమీ పడాల్సి ఉండగా 31.9 మిమీ పడింది. ఈ నెల మూడు వారాల్లో 76 శాతం మైనస్. పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కడప, చిత్తూరు...ఏడు జిల్లాలు అత్యల్ప వర్షం కురిసిన కేటగిరీలో ఉన్నాయి. మిగతా 21 జిల్లాలు ప్రస్తుతానికి తక్కువ వర్షం (సాధారణంలో లోటు 20-59 శాతం) కురిసిన జాబితాలో ఉన్నాయి. త్వరలోనే మరిన్ని జిల్లాలు అత్యల్ప వర్షపు కేటగిరీలోకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 77.2 శాతం మైనస్ వర్షం కురిసింది. అత్యల్ప వర్షం పడ్డ తతిమ్మా ఆరు జిల్లాల్లో కూడా 60-76 శాతం మేర లోటు వర్షంతో సతమతమవుతున్నాయి. ఈ నెలలో కడపలో కేవలం 5.4 మిమీ వర్షం పడింది.
పొంచి ఉన్న నీటి గండం
సమీప భవిష్యత్తులో వానలు పడే సూచనలు లేనందున రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకేనంటున్నందున కృష్ణా డెల్టాలో వరి పంట ఈ సారి లేనట్లే. తొలుత పట్టిసీమ నీటిని లాంఛనంగా విడుదల చేసి, జలహారతులతో ప్రభుత్వం హడావిడి చేయడంతో డెల్టాలో రైతులు వరి సాగుకు సిద్ధమయ్యారు. తాజాగా నీరు ఇవ్వలేమని, ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చల్లాగా చెప్పడంతో నారుమళ్లు పోసుకున్న, ఇప్పటికే నాట్లు వేసిన రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా డెల్టాలో కృష్ణా, ఉమ్మడి పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మొత్తం వరే పండుతుంది. ప్రభుత్వ తాజా హెచ్చరికలతో వరి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గోదావరిలో 14 మీటర్లలో వరద ఉన్నప్పుడు పట్టిసీమ పంపింగ్ స్కీం నుంచి ప్రకాశం బ్యారేజికి నీటిని కృష్ణా డెల్టా అవసరాల నిమిత్తం విడుదల చేస్తారు. ఒక రోజల్లా మొత్తం 24 మోటార్లూ ఆడితే పోలవరం కుడి కాల్వలో గరిష్టంగా 7,800 క్యూసెక్కులు ప్రవహిస్తాయి. ఆ మేరకు ప్రకాశం బ్యారేజికి ఒక టిఎంసి చేరుతుంది. ప్రస్తుతం అందుకు తగ్గట్టు గోదావరిలో వరద లేదు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీకి ఇన్‌ఫ్లో తక్కువే ఉంది. పైన పట్టిసీమ వద్ద తోడటం వలన తమకు చివరి భూములకు నీరు అందట్లేదని గోదావరి డెల్టా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీలేరు నుంచి కూడా ఫ్లో తగ్గింది. దాంతో పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు సరిపడా నీళ్లివ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు పరిమితం చేశారు. రిజర్వాయర్లన్నీ కలిపి 1,100 టిఎంసి నిల్వ సామర్ద్యం కాగా నిరుడు ఈ సమయానికి 634 టిఎంసి నిల్వలుండగా ఈ ఏట ఇప్పుడు 294 టిఎంసి మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.
4 లక్షల ఎకరాలు తక్కువ
రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 77 లక్షల ఎకరాలు కాగా ఈ పాటికి 32 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాలి. గురువారం నాటికి 28 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నాలుగు లక్షల ఎకరాలు తక్కువ సాగయ్యాయి. సీజన్‌లో దాదాపు 38 లక్షల ఎకరాల్లో వరి సాగు కావాలి. నీటి కొరత నేపథ్యంలో ఎంత సాగువుతుందో తెలీదు. నూనెగింజలు 36 శాతం సాగయ్యాయి. వేరుశనగ 30 శాతమే పడింది. వర్షాభావం ఇలాగే కొనసాగితే ఈ తడవ వేరుశనగ సాగు అనుమానమే. అపరాలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల సేద్యం ప్రశ్నార్దకంగానే తయారైంది. కొద్దిపాటి తొలకరి వానలకు పత్తి ఊపుగా సాగు చేయగా వర్షాభావం వెంటాడుతోంది. మెట్ట, మాగాణి అనే వ్యత్యాసం లేకుండా వేసిన అన్ని పంటలూ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.







కామెంట్‌లు (0)