'పోరాడితే పోయేదేమీ లేదు... బానిస సంకెళ్లు తప్ప' అన్న నినాదాన్ని నిజం చేస్తూ జూలై 20న ఢిల్లీలో ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం దేశవ్యాప్తంగా సంఘీభావ తరంగాన్ని సృష్టించింది. లాఠీ దెబ్బలు తింటున్న విద్యార్థులు, కర్రలతో విరుచుకుపడుతున్న పోలీసులు, బారికేడ్లు, బాష్పవాయువులు, నినాదాలతో మారుమోగిన ఢిల్లీ వీధుల వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. వాటికి విశేష స్పందన లభించింది. దేశ నలుమూలల నుంచి యువత, వివిధ వర్గాల ప్రజలు ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.
ఆ సంఘీభావ కార్యక్రమాల్లో అత్యంత వైరల్ అయిన దృశ్యాల్లో ఒకటి జూలై 22న ముంబైలో చోటుచేసుకుంది. జంతర్‌మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నిర్వహించిన నిరసన సందర్భంగా, అదుపులోకి తీసుకున్న నిరసనకారులను తరలిస్తున్న ముంబై పోలీసుల వ్యానును 27 ఏళ్ల రియా అహిర్ ఒంటరిగా అడ్డుకున్నారు. ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో లక్షలాది మంది ఆమె ధైర్యాన్ని కొనియాడుతూ 'స్వాతంత్ర్య సమరయోధురాలు' అంటూ ప్రశంసించారు.
అయితే రియా విద్యార్థిని కాదు. ఆ ఉద్యమంతో ఆమెకు ప్రత్యక్ష సంబంధమూ లేదు. అయినప్పటికీ, "విద్యార్థులకు సంఘీభావంగా నిలవాలంటే విద్యార్థులే కావాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులే కావాల్సిన అవసరం లేదు. భారతీయులైతే చాలు" అనే సందేశంతో ఆమె నిరసనలో పాల్గొన్నారు. రియా అహిర్ కళాకారిణి, మోడల్, వ్యాపారవేత్త. ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. నిరసన సందర్భంగా పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ, వ్యానులో ఉన్న నిరసనకారులను విడుదల చేసే వరకు దారి ఇవ్వబోనని ఆమె పట్టుదలగా నిలిచారు. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ రియా, "ఆ క్షణంలో పోలీసులు వ్యానును నా మీదుగా నడిపించినా అక్కడి నుంచి కదలకూడదని నిర్ణయించుకున్నాను. ఆ ఘటన తర్వాత ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. తెల్లవారుజాము 5.30 వరకు మేల్కొని ఉన్నాను. ఆ దృశ్యం పదేపదే కళ్లముందు మెదులుతూనే ఉంది" అని చెప్పారు.
ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసే 'గెట్ రెడీ విత్ మీ' (GRWM) వీడియోలు కూడా వ్యక్తిగత విషయాల నుంచి సామాజిక అంశాల వైపు మళ్లాయి. ముఖ్యంగా విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన విషయాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. తనను స్వాతంత్ర్య సమరయోధులతో పోలుస్తూ వచ్చిన వ్యాఖ్యలపై కూడా రియా స్పందించారు. "తుపాకీ గుళ్లను ఎదుర్కొన్న స్వాతంత్ర్య సమరయోధులతో నన్ను పోల్చవద్దు. భగత్ సింగ్ చెప్పినట్లు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు మీలో ఆగ్రహాన్ని రేకెత్తించకపోతే మీరు నిజమైన భారతీయులు కారు అన్న భావన నాలో బలంగా ఉంది. అదే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నేను విద్యార్థిని కాదు, రైతును కాదు, ఓబీసీని కాదు. కానీ నా దేశ పౌరులు న్యాయం కోసం వీధుల్లో పోరాడుతుంటే అది నాకేమీ సంబంధం లేదని పక్కన నిలబడలేను. ఒక భారతీయురాలిగా వారికి మద్దతు ఇవ్వడం నా బాధ్యతగా భావించాను. పోరాడుతున్న వారికి ప్రతి భారతీయుడు అండగా నిలిస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుంది" అని ఆమె అన్నారు.








కామెంట్‌లు (0)