శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionలెనిన్ నుండి రాహుల్ సాంకృత్యాయన్ వరకు...

1 గంట క్రితం

Rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ప్రగతిశీల ప్రతీకలపై దాడులు

ప్రసిద్ధ మార్క్సిస్టు మేధావి, చరిత్రకారుడు, బహు భాషావేత్త అయిన రాహుల్ సాంకృత్యాయన్ నిలువెత్తు విగ్రహాన్ని అపరిచిత దుండగులు ధ్వంసం చేసి మాయం చేశారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని రాణిగంజ్ మోర్ వద్ద జాతీయ రహదారి 19 పక్కన నెలకొల్పబడిన ఈ విగ్రహం, గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతపు ప్రగతిశీల సాంస్కృతిక, రాజకీయ పరంపరకు ప్రతీకగా నిలిచింది.

ఈ విధ్వంసాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల మేధావులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు, వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి, మార్క్సిస్టు, కమ్యూనిస్టు ప్రతిమలపై దాడులు పెరిగాయి. గతంలో ముర్షిదాబాద్ జిల్లాలోని జియాగంజ్‌లో లెనిన్ విగ్రహంపై జరిగిన దాడి కూడా ఇందులో భాగమే.

ఆ రోజు సాయంత్రం, బిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు సియార్‌ఖోల్ గ్రామంలోని సిపిఎం కార్యాలయానికి వచ్చి బెదిరింపులకు సైతం దిగారు. ఈ విధ్వంసానికి సంబంధించి బిజెపి ని గానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ విమర్శిస్తే సహించేది లేదని హూంకరించారు. అయితే, తీవ్ర వాగ్వాదం తర్వాత స్థానిక ప్రజలు, పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో బిజెపి కార్యకర్తలు వెళ్లిపోయారు.

విగ్రహ పునఃప్రతిష్ట - దోషులపై చర్యలకు డిమాండ్

స్థానిక ప్రజల కథనం ప్రకారం, ఈ చర్య చాలా ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తోంది. చీకటిని ఆసరాగా చేసుకుని విగ్రహాన్ని పగలగొట్టి తొలగించే ముందు, సమీపంలోని సిసి టి.వి కెమెరాలను నిలిపివేసి, వీధిదీపాలను ఆపివేశారు. సోమవారం రాత్రి సిపిఎం నాయకులు, స్థానిక ప్రజలు విగ్రహం కనిపించడం లేదని తెలుసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

పశ్చిమ బెంగాల్ డెమోక్రటిక్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ , పీపుల్స్ రైటర్స్ అసోసియేషన్ ఈ దాడిని ఖండించాయి. రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు, సాహిత్య వర్గాల సభ్యులు ఆందోళన చేపట్టి, సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులను త్వరగా అరెస్టు చేసి శిక్షించాలని, విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

విగ్రహం ప్రాముఖ్యత

రాహుల్ సాంకృత్యాయన్ (1893–1963) ఇరవై ఒకటో శతాబ్దపు భారతీయ మేధో సంపత్తిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఆయన గొప్ప రచయిత, చరిత్రకారుడు, హిందీ సాహిత్యంలో యాత్రాచరిత్ర ప్రక్రియకు పితామహుడు. బ్రిటిష్ వ్యతిరేక రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఆయన మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు. కిసాన్ సభ ప్రారంభ రోజుల్లో రైతాంగ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తరువాత ఆయనకు కాళిదాస్ సమ్మాన్, సాహిత్య అకాడమీ అవార్డు , పద్మభూషణ్ లభించాయి. ముఖ్యంగా వోల్గా సే గంగా (1942), భాగో నహీ, దునియా కో బద్లో (1944) వంటి రచనల ద్వారా మార్క్సిస్టు ఆలోచనా విధానానికి ఆయన అందించిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

రాణిగంజ్‌ లోని ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానిక చరిత్ర ఉంది. 1993లో సాంకృత్యాయన్ శత జయంతి సందర్భంగా, బొగ్గు గనుల ప్రాంతమంతటా ఆయన ఆలోచనలను సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక కమిటీ ఏడాది పొడవునా కార్యక్రమాలను నిర్వహించింది. రాణిగంజ్‌ లోని ఒక రహదారికి ఆయన గౌరవార్థం "రాహుల్ సాంకృత్యాయన్ మార్గ్" అని పేరు పెట్టారు. ఆ తర్వాత, 1994 ఏప్రిల్ 9న సాంకృత్యాయన్ జయంతి సందర్భంగా తొమ్మిది అడుగుల ఈ విగ్రహాన్ని సీనియర్ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు బినోయ్ కృష్ణ చౌదరి ప్రారంభించారు. మూడు దశాబ్దాలకు పైగా, ఇది కేవలం ఒక స్థానిక ల్యాండ్‌మార్క్‌గా మాత్రమే కాకుండా, ఈ ప్రాంతానికి ప్రగతిశీల సంస్కృతి, కార్మిక రాజకీయాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే చిహ్నంగా ఉంది.

విగ్రహ విధ్వంసం వెనుక ఉన్న రాజకీయం

పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల మీదున్న అక్కసుతో బిజెపి శక్తులు... కమ్యూనిస్టు, మార్క్సిస్టు నాయకుల విగ్రహాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. సిసి టి.వి కెమెరాలు, వీధి దీపాలను నిలిపివేయడం చూస్తుంటే ఈ విధ్వంసం అనుకోకుండా జరిగింది కాదని, ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని అర్థమవుతోంది. ఇది స్థానిక భద్రత, పోలీసు నిఘా సమర్థతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఆ తర్వాత సిపిఎం కార్యకర్తలను బెదిరించేందుకు జరిగిన యత్నం, దానిని అనుసరించి జరిగిన ఘర్షణతో… ఈ ఘటన కేవలం విగ్రహాల విధ్వంసానికి మాత్రమే పరిమితం కాదని స్పష్టం అవుతున్నది.

లెనిన్ తదితర కమ్యూనిస్టు నాయకుల విగ్రహాలపై గతంలో జరిగిన దాడుల తరహాలోనే రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహంపై దాడి కూడా వామపక్ష ప్రతీకలు, చిహ్నాలను లక్ష్యంగా చేసుకునే వ్యూహంలో భాగమని భావిస్తున్నారు. అయితే విగ్రహాలను పగులగొట్టినంత మాత్రాన చరిత్రను, వారసత్వాన్ని లేదా అవి ప్రాతినిధ్యం వహించే ఆలోచనలను చెరిపివేయలేరు. చీకటి చాటున ఇటువంటి చర్యలకు పాల్పడి భయాన్ని సృష్టించాలనుకునే వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఘటన తర్వాత ప్రజల నుండి వచ్చిన స్వచ్ఛంద నిరసనలే, వారు భయపడకుండా ఆగ్రహంతో స్పందించారని చెప్పడానికి నిదర్శనం.

/ 'లెఫ్ట్ వ్యూస్' వెబ్ పత్రిక సౌజన్యంతో /

-సౌవిక్ ఘోష్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్