ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కూరగాయలు అమ్మి కామన్‌‌వెల్త్‌ వరకు..

1 గంట క్రితం

sports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

'విజయం సాధించే వరకు నువ్వెవరో ప్రపంచానికి తెలియదు. విజయం సాధించిన తర్వాత నువ్వు ఎలా సాధించావో తెలుసుకోవాలని ప్రపంచం ఆసక్తి చూపుతుంది' అంటారు మేధావులు. బీహార్‌కు చెందిన పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ విషయంలో ఈ మాట అక్షరాలా నిజమైంది. జులై 23 నుంచి స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)–2026లో శుక్రవారం భారత్‌కు తొలి పతకం లభించింది. ఈ ఘనతను సాధించిన కుమార్ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన క్రీడాకారుడే కాదు.. పోలియోను జయించి, పేదరికాన్ని అధిగమించి, అపజయాలను అవకాశాలుగా మలిచిన పోరాట యోధుడు కూడా. ఆయన విజయం దేశానికి గర్వకారణం. శక్తివంచనలేని శ్రమకు, అచంచలమైన సంకల్పానికి ప్రతీక.


బీహార్‌లోని నలందా జిల్లా హర్నౌత్‌లో కుమార్ పెరిగారు. ఐదేళ్ల వయసులో పోలియో బారిన పడ్డారు. పేదరికానికి తోడు వైకల్యం ఆయనను చాలాకాలం ఇంటికే పరిమితం చేసింది. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులకు భారంగా ఉండకూడదనే ఉద్దేశంతో చిన్నాచితకా పనులు చేశారు. ఆటలపై మక్కువతో 2010–2012 మధ్య షాట్‌పుట్, జావెలిన్ త్రోల్లో శిక్షణ పొందారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ఉన్న అభిమానంతో ఆయనలా దృఢమైన శరీరాకృతి సాధించాలని జిమ్‌లో వ్యాయామాలు ప్రారంభించారు. అదే అభిరుచి క్రమంగా పారా పవర్‌లిఫ్టింగ్ వైపు మళ్లించింది. అయితే శిక్షణ కంటే పోషకాహారం సమకూర్చుకోవడమే పెద్ద సవాలుగా మారింది. మంచి ఆహారం కోసం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీల్‌చైర్ కూడా లేకుండానే రోజూ 20 కిలోమీటర్లు ప్రయాణించి కూరగాయలు అమ్మేవారు. అయినా వచ్చే ఆదాయం సరిపోక స్నేహితుల వద్ద అప్పు చేసి ఈ-రిక్షా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి పగలంతా ఈ-రిక్షా నడిపి, సాయంత్రం జిమ్‌లో సాధన చేయడం దినచర్యగా మార్చుకున్నారు. అయితే కరోనా కాలం ఆ ప్రణాళికను కూడా దెబ్బతీసింది.


2023లో జాతీయ పారా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి తనకున్న ఏకైక ఆదాయ వనరైన ఈ-రిక్షాను అమ్ముకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. కెరీర్‌లో అది అత్యంత క్లిష్టమైన దశ. అలాంటి సమయంలోనే పారా ఒలింపిక్ కాంస్య పతక విజేత రాజేంద్ర సింగ్ రాహేల్ ఆయనలోని ప్రతిభను గుర్తించారు. గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ఆహ్వానించారు. అక్కడ ప్రారంభమైన శిక్షణ ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత వరుస విజయాలతో జాతీయ స్థాయిలో తన స్థానాన్ని బలపరుచుకున్న ఆయన, 2025లో బీజింగ్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటారు. ఇప్పుడు కామన్‌వెల్త్ గేమ్స్‌లో గెలిచిన కాంస్య పతకం ఆయన విజయగాథలో మరో మైలురాయిగా నిలిచింది.


ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, భారత్‌కు తొలి పతకం అందించడం మరింత సంతోషాన్ని కలిగించిందని అన్నారు. 'విజేతగా భారత జెండా అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడడం, అందులో నేను భాగస్వామి కావడం ఎంతో గర్వంగా ఉంది' అని చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన కళ్లలో కనిపించిన ఆనందం వెనుక ఎన్నో ఏళ్ల పోరాటం, శ్రమ, అవమానాలను జయించిన ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. వైకల్యం శరీరానికే పరిమితం.. సంకల్పానికి కాదు. పేదరికం అవకాశాలను తగ్గించొచ్చు.. లక్ష్యాన్ని కాదు. ఝండు కుమార్ జీవన ప్రయాణం ఈ సత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్