బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవ్యవస్థ కుట్రలపై పోరాడి గెలిచింది!

2 గంటల క్రితం

వ్యవస్థ కుట్రలపై పోరాడి గెలిచింది! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 05:55 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజల మద్దతుతో ఎన్నికై గ్రామానికి సేవ చేయాలనుకున్న ఓ దళిత మహిళా సర్పంచ్‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రజలు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించనీయకుండా వ్యవస్థలోని ఆధిపత్య శక్తులు ఇబ్బందులకు గురిచేశాయి. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా మూడుసార్లు సస్పెండ్‌ చేశారు. చివరికి పదవి నుంచి తొలగించి, మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేసి, అన్నిసార్లూ విజయం సాధించారు. బిజెపి పాలనలో ఉన్న హర్యానాలోని రేవారి జిల్లా దహినా గ్రామ సర్పంచ్‌ పింకీ పోరాట కథ ఇది.

2022 డిసెంబరులో సర్పంచ్‌గా ఎన్నికైన పింకీకి 2025 అక్టోబరు 28న తొలిసారి సస్పెన్షన్‌ ఎదురైంది. గ్రామంలోని 91వ వీధిలో నిర్మించిన దారిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అయితే, ఆ దారి ప్రజా రహదారేనని సరిహద్దుల నిర్ధారణలో తేలడంతో ఆమె తిరిగి విధుల్లో చేరారు. 2026 మార్చి 27న 433వ దారిలో ఆక్రమణలను తొలగించలేదన్న కారణంతో రెండోసారి సస్పెండ్‌ చేశారు. దీనిపై ఆమె అప్పీల్‌ చేయగా, ఏప్రిల్‌ 23న గురుగ్రామ్‌ డివిజనల్‌ కమిషనర్‌ సస్పెన్షన్‌ను రద్దు చేశారు. అయినా జూన్‌ 2న మరోసారి సస్పెన్షన్‌ వేటు పడింది. పంచాయతీ భవన నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రి ప్రమాణాలకు సంబంధించిన ఆరోపణలను కూడా ఆమెపై మోపారు. అయితే, ఆ అంశాలు సాంకేతిక అధికారుల బాధ్యతకు సంబంధించినవని ఆమె తరఫు న్యాయవాది వాదించారు.

ఈసారి పంజాబ్‌–హర్యానా హైకోర్టు జోక్యం చేసుకుంది. జూలై 2న సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేసింది. విచారణ జరగకముందే ఆరోపణల్లో కొన్నింటిని నిరూపితమైనవిగా డిప్యూటీ కమిషనర్‌ పేర్కొనడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. విచారణ జరపాల్సిన అధికారిని నియమించినప్పటికీ, అంతకుముందే ఆరోపణలపై నిర్ణయానికి రావడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ అప్పీల్‌ మార్గం ఉందనే కారణంతో పింకీకి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం నిరాకరించలేమని పేర్కొంది. పదేపదే సస్పెన్షన్‌కు గురవుతున్న ఆమె తన పదవీకాలాన్ని ప్రజలకు సేవ చేయడానికి బదులు న్యాయపోరాటంలోనే గడపాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితి ఆమె ఒక్కరినే కాకుండా, ఆమెను ఎన్నుకున్న ప్రజలను కూడా ప్రభావితం చేస్తోందని స్పష్టం చేసింది.

అయినా అధికారుల చర్యలు ఆగలేదు. ఆగస్టు 31న జిల్లా యంత్రాంగం పింకీని పదవి నుంచి తొలగించి, మూడేళ్లపాటు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించింది. ఆమె మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, తొలగింపు ఉత్తర్వులపై స్టే లభించింది. దీంతో ఆమె తిరిగి సర్పంచ్‌గా కొనసాగేందుకు మార్గం ఏర్పడింది. ఇలా మూడుసార్లు సస్పెన్షన్‌, మరోసారి పదవి నుంచి తొలగింపు.. మొత్తం నాలుగు కీలక చర్యలను ఆమె ఎదుర్కొన్నారు. ప్రతి సందర్భంలోనూ న్యాయపరమైన పోరాటం ద్వారా తిరిగి పదవిలో కొనసాగే అవకాశం సాధించారు. ఈ వరుస పరిణామాలకు నిరసనగా, ఏడాది వ్యవధిలో తనపై జరిగిన సస్పెన్షన్‌, తొలగింపు చర్యలను రికార్డుగా నమోదు చేయాలంటూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకు దరఖాస్తు చేశారు. అయితే, ఇది ప్రతిపాదన దశలోనే ఉంది.

గ్రామానికి ఏం కావాలో నిర్ణయించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి. ఆ నిర్ణయాలు చట్టబద్ధంగా ఉన్నాయో లేదో పరిశీలించి, తప్పులుంటే సరిదిద్దాల్సింది అధికార యంత్రాంగం. కానీ, ఒక ఎన్నికైన సర్పంచ్‌ పదేపదే సస్పెన్షన్లను ఎదుర్కొంటూ, తన పదవిని కాపాడుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే స్థానిక ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. పింకీ వ్యవహారంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గ్రామస్థాయి అధికారులపై ఆమె లేవనెత్తిన ప్రశ్నలు, పరిపాలనా నిర్ణయాలపై న్యాయస్థానం వ్యక్తం చేసిన అభ్యంతరాలు.. ఎన్నికైన మహిళా ప్రతినిధుల అధికారాలను, ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్