కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో దేశంలో అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న ధరలు కోట్లాదిమంది ప్రజల కష్టార్జితాన్ని, పొదుపును హరించి వేస్తున్నాయి. నిరంతర ద్రవ్యోల్బణం ద్వారా ప్రభుత్వాలు ప్రజల సంపదలో గణనీయమైన భాగాన్ని వారికి తెలియకుండానే హరించగలవు అని వందేళ్ల కిందటే ప్రఖ్యాత ఆర్థికవేత్త కీన్స్ చేసిన హెచ్చరిక నేటి పరిస్థితులకూ సరిపడుతోంది. జాతీయ గణాంక సంస్థ (ఎన్ఎస్ఒ) విడుదల చేసిన నివేదిక ప్రకారమే... ఆహార పదార్థాలు, ఇంధన సంబంధిత రవాణా వ్యయాలు పెరగడంతో రెండేళ్ల గరిష్టానికి చిల్లర ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆగస్టులో 4.83 శాతంగా నమోదైన వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో అమాంతంగా 5.54 శాతానికి పెరిగింది. 2024 అక్టోబర్‌లో నమోదైన 6.21 శాతం తరువాత ఇదే అత్యధిక స్థాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో 6 శాతం పైనే అన్న అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా నాలుగు నెలలుగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆహార ద్రవ్యోల్బణం కోరలు చాస్తోంది. ఆగస్టులో 5.97 శాతం నుంచి 7.74 శాతానికి ఎగబాకింది. ఎన్నడూ లేనంతగా... ఉల్లి ద్రవ్యోల్బణం ఏకంగా 108.09 శాతం, బియ్యం 40 శాతం, పంచదార 30 శాతం పెరిగాయి. దేశంలో పనిచేసే వారిలో 94 శాతం అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వారి కొనుగోలు శక్తి రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆదాయమంతా ఆహారం, అద్దె, రవాణా తదితర అవసరాలకే సరిపోతోంది. పిల్లలకు నాణ్యమైన విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, మందులు వంటి విషయాల్లో రాజీ పడాల్సి వస్తోంది. పొదుపు సంగతే మరిచిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న దుస్థితి. దేశంలో గ్రామీణ ద్రవ్యోల్బణం 6.08 శాతానికి ఎగబాకితే, రాష్టంలో 6.29 శాతానికి పెరిగింది. రాబోయే మూడు నెలల్లో పండగలు రానుండటంతో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటే పరిస్థితి. రాష్ట్రం 15 శాతం అభివృద్ధిలో ముందుకు పోతోందని ముఖ్యమంత్రి గొప్పలు చెబుతుంటే ద్రవ్యోల్బణం దేశ సగటుకన్నా ఎక్కువగా పెరగడం గమనార్హం.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎరువులు, పురుగుమందులు, వంట నూనెలు, పప్పుల దిగుమతులు తగ్గిపోయి, ధరలు భారీగా పెరిగాయి. ఇంధన దిగుమతులను తగ్గించుకునే పేరుతో ఇథనాల్‌ను పెట్రోలులో కలిపేందుకు కేంద్రం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు ఆహార ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోశాయి. ఇ 20 పేరుతో బియ్యం, మొక్కజొన్న, చెరకును విచ్చలవిడిగా ఇథనాల్ తయారీకి వినియోగిస్తోంది. గత ఏడాది 32 లక్షల టన్నుల బియ్యాన్ని వినియోగిస్తే, ఈ ఏడాది జూన్ 30 నాటికే 42 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రైవేటు డిస్టిలరీలకు కేటాయించారు. రూ.10 వేల కోట్లకు పైగా ప్రజల సొమ్మును రాయితీగా కట్టబెట్టారు. ఈ చర్యల వల్ల ఆహారం, పశుదాణా, నీటి వనరులు, సాగుభూములపై తీవ్ర ప్రభావం పడుతోందని ఎందరో మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఇదే అంశాన్ని అంచనా వేసి, తగు చర్యలు తీసుకోవాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత్ నాగేశ్వరన్ ఇచ్చిన సలహాను సైతం కేంద్రం పెడచెవిన పెట్టింది. ఏటా ఇతర దేశాలకు కోటి 20 లక్షల టన్నుల పంచదారను ఎగుమతి చేసే మన దేశం ఇప్పుడు భారీగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ పరిణామాలు, ఎల్‌నినో ప్రభావంతో కోటి టన్నులకుపైగా బియ్యం ఉత్పత్తి తగ్గిపోయింది. నెల రోజుల వ్యవధిలోనే కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకూ ధరలు పెరిగిపోయాయి. మొక్కజొన్న ఇథనాల్‌కు మళ్లడంతో పౌల్ట్రీ ఉత్పత్తుల, పాల ధరలు భారీగా పెరిగి సామాన్యుడు పౌష్టికాహారానికి దూరమవుతున్నాడు. మోడీ ప్రధాని అయ్యేనాటికంటే తక్కువగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఉన్నా సామాన్యుడిపై మోపిన భారం అన్ని ధరల పెరుగుదలనూ మరింత తీవ్రం చేసింది. ఈ ఏడాది కాలంలో రూపాయి 7.5 శాతం పతనమైంది. 30 బిలియన్ టన్నుల విదేశీ మారక నిల్వలు స్టాక్ మార్కెట్ నుంచి పలాయనం చిత్తగించాయి. ఆర్బిఐ వడ్డీ రేట్లు పెంచడం సామాన్యులకు ఇఎంఐలను భారం చేసింది మినహా ఎఫ్‌డిఐలను ఆపలేకపోయింది. ఇప్పటికే పప్పు దినుసుల దిగుమతులు 60 శాతానికి ఎగబాకాయి. ఇంధన దిగుమతులు మోడీ ఏలుబడిలో 77 శాతం నుంచి 89 శాతానికి పెరిగిపోయాయి. ఉపాధి హామీ చట్టాన్ని వి.బి గ్రామ్ జి పథకంగా మార్చడం, ఇతర మార్పులతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనిదినాలు 23.2 శాతం తగ్గిపోయాయి. ఒక్కో కుటుంబానికి సగటు వార్షిక ఆదాయం రూ.13,190 నుంచి రూ.11,616కి పడిపోయింది. ఉపాధి హామీ నుంచి వచ్చే అరకొర ఆదాయం కూడా తగ్గడం, ఉపాధి అవకాశాలు కుంచించుకుపోవడంతో గ్రామీణ కుటుంబాల జీవనం తల్లకిందులైంది. ద్రవ్యోల్బణాన్ని గణాంకాలుగా కాకుండా కోట్లాది కుటుంబాల జీవన సమస్యగా గుర్తించి, కట్టడి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపడతాయని ఆశించలేం కనుక ప్రజలే ఐక్య ఉద్యమాలతో పాలకులను దారికి తేవాలి. అప్పుడే ధరలకు కళ్లెం వేయగలం.







కామెంట్లు (0)