ఆర్‌ఐఎన్‌ఎల్ భూములకు రూ.366.33 కోట్ల బిడ్లు
150 ప్లాట్ల విక్రయం
చదరపు గజానికి రూ.1.80 లక్షలు దాటిన గరిష్ట వేలం ధర
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : విశాఖ ఉక్కు భూముల విక్రయాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్రంలో బిజెపి 2024లో మరోమారు అధికారం చేపట్టడం, రాష్ర్టంలో టిడిపి కూటమి పాలనలో భాగస్వామ్యం కావడంతో విశాఖ ఉక్కును తాము అనుకున్నట్టుగా కార్పొరేట్లకు కట్టబెట్టే దిశగా అడుగులు వేస్తూనే ఉంది. స్టీల్‌ప్లాంట్‌కు విశాఖలో పలుచోట్ల ఉన్న భూములను ఇ-వేలం వేసింది. వీటికి రూ.వందల కోట్లు ధర అవి పలికింది. ప్రభుత్వ రంగ సంస్థ భూముల విక్రయం ద్వారా వచ్చే డబ్బులను ఆ సంస్థకే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే, దీనికి భిన్నంగా ఉక్కు భూములను వేలం వేయగా వచ్చిన డబ్బును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేరుగా తీసుకుంటుంది తప్ప, ప్లాంట్ అభివృద్ధికి వినియోగించే పరిస్థితి లేదనే ప్రచారంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్‌ఎల్‌ఎంసి ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డిపిఇ) కింద పనిచేస్తున్న నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసి) ఏర్పాటుతో విశాఖలో పలుచోట్ల ఉన్న ఉక్కు భూములకు రెక్కలొస్తున్నాయి. ఎన్‌ఎల్‌ఎంసి ఇ-వేలం జరగ్గా ఆర్‌ఐఎన్‌ఎల్ (విశాఖ స్టీల్‌ప్లాంట్) కు చెందిన భూముల (150 ప్లాట్)లకు రూ.366.33 కోట్లకు బిడ్లు పడ్డాయి. చదరపు గజానికి గరిష్ట వేలం ధర రూ.1.80 లక్షలు దాటినట్టు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) మంగళవారం సాయంత్రం వెల్లడించింది. మరికొన్ని ప్లాట్లను అమ్మకానికీ ఎన్‌ఎల్‌ఎంసి రంగం సిద్ధం చేసింది.
మొదటి దశలో ఇలా...
ఆర్‌ఐఎన్‌ఎల్‌కు చెందిన మొదటి దశలో వేలానికి ఉంచిన 150 ప్లాట్ల రిజర్వు ధర రూ.312.48 కోట్లు కాగా, రూ.366.33 కోట్లకు బిడ్లు పడ్డాయి. రిజర్వు ధర కంటే 17.23 శాతం అధికంగా బిడ్లు నమోదయ్యాయి. వేలంలో ఉంచిన ఆస్తులపై మార్కెట్ నుంచి మంచి స్పందన, ఆసక్తి కనిపించినట్లుగా స్టీల్ అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇ-వేలంలో ధర చదరపు గజానికీ రూ.1.80 లక్షలు దాటింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మిగులు భూములు, ఆస్తులను వినియోగంలోకి తెస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పుకొస్తున్నారు. ఉక్కు భూముల వేలానికి సంబంధించి 2026 సెప్టెంబర్‌లో విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లలో పెట్టుబడిదారుల అవగాహనా సదస్సులను ఎన్‌ఎల్‌ఎంసి ఆర్‌ఐఎన్‌ఎల్ నిర్వహించింది. పెట్టుబడిదారుల ఆసక్తిని ఇలా ఆకర్షించినట్లు స్టీల్ అధికారులు చెబుతున్నారు.
మరో 216 ప్లాట్లకు 30న వేలం
రెండో దశలో మరో 216 ప్లాట్లను ఇ-వేలం వేసేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్ రంగం సిద్ధం చేసింది. ఈ నెల 30 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఇ-వేలం జరగనుందని, ఆసక్తిగలవారు ఈ నెల 27లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవాలని సూచించింది. భవనాల ఆస్తుల మానిటైజేషన్‌కు ఆ తర్వాత దశలో వెళ్లనున్నట్లు సమాచారం. నిరుపయోగంగా ఉన్నాయనే పేరుతో ఉక్కు భూములను అమ్మకానికి కేంద్రం తలపెడుతున్నా రాష్ర్టంలోని టిడిపి, జనసేన కూటమి నేతలు నోరుమెదపడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
వచ్చిన ఆదాయాన్ని ప్లాంట్ అభివృద్ధికి ఉపయోగించాలి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన విలువైన ఆస్తుల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్లాంట్ అభివృద్ధికి, ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు మాత్రమే వినియోగించాలని స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది. హెచ్‌బి కాలనీ, ఆటో నగర్, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లోని స్టీల్‌ప్లాంట్ స్థలాల ఇ-వేలంపై యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రామస్వామి, జె.అయోధ్యరామ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్లాంట్‌లోని కీలక విభాగాల ఆధునికీకరణ, యంత్రాల మరమ్మతులు, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, కార్మికుల సంక్షేమం వంటి అవసరాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)