సైన్సు తరగతి గదుల్లో బోధించే సబ్జెక్టు మాత్రమే కాదు. అది ప్రజల రోజువారీ జీవితంలో మమేకమై, ప్రతి పనినీ నడిపించే శక్తి. ఆ విజ్ఞానం అందరూ పొందాలి. సైన్సు వ్యాపారం కోసం, లాభాల కోసం కాదు; ప్రజల కోసం ఉండాలి. అలాంటి ప్రపంచం గురించి ఎం.పి. పరమేశ్వరన్ కలలు కన్నారు. “నాకు ఇలాంటి కలలు ఎన్నో ఉన్నాయి. వాటిని నెరవేర్చడానికి నేను బతికి ఉండకపోవచ్చు. కానీ ఎవరో ఒకరు వాటిని నెరవేరుస్తారు. నాకు ఆశ ఉంది” అని ఏడాది క్రితం అన్న మాటలు ఆయన జీవిత తత్వానికి అద్దం పడతాయి. ప్రముఖ అణు శాస్త్రవేత్త, ప్రజా సైన్సు ఉద్యమకారుడు, రచయిత, సామ్యవాద ఆలోచనాపరుడు ఎం.పి. పరమేశ్వరన్ (91) మంగళవారం త్రిస్సూర్‌లో కన్నుమూశారు.
1935 జనవరి 18న త్రిస్సూర్ జిల్లాలోని కిరలూర్‌లో పరమేశ్వరన్ జన్మించారు. తిరువనంతపురంలోని ఇంజినీరింగ్ కళాశాలలో విద్యుత్ ఇంజినీరింగ్ చదివి 1956లో ప్రథమశ్రేణిలో పట్టా పొందారు. అనంతరం భారత అణుశక్తి రంగంలోకి ప్రవేశించి భాభా అణు పరిశోధనా కేంద్రంలో పనిచేశారు. అణు ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య కోసం మాస్కో పవర్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి 1965లో డాక్టరేట్ పొందారు. మాస్కోలో చూసిన ఒక సాధారణ దృశ్యం ఆయన ఆలోచనలను మలుపుతిప్పింది. క్యూలో నిలబడి ఉన్న ప్రజలు కూడా పుస్తకాలు చదువుతూ కనిపించేవారు. అక్కడి ప్రజలు జ్ఞానాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకున్న తీరు ఆయనను ప్రభావితం చేసింది. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత విజ్ఞానం పాఠ్యపుస్తకాల్లో ఉండే విషయం మాత్రమే కాదని, ప్రజల జీవితంలో ఒక భాగమని చూపించాల్సిన అవసరం ఉందని భావించారు. 1975లో భాభా అణు పరిశోధనా కేంద్రంలోని ఉద్యోగాన్ని వదిలి కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌లో పూర్తికాలం కార్యకర్తగా చేరారు. శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయికి ఎదిగే మార్గాన్ని వదిలి, విజ్ఞానాన్ని సామాన్య ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లే మార్గాన్ని ఎంచుకున్నారు.
కేరళ భాషా ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసిన సమయంలో సంక్లిష్టమైన అణు ఇంజినీరింగ్ అంశాల నుంచి ఫిబొనాచీ శ్రేణి, ఫెయిన్‌మన్ ఉపన్యాసాల వరకు సులభమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశారు. మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో 30కి పైగా పుస్తకాలు రాశారు. కేఎస్‌ఎస్‌పీ చేపట్టిన “ప్రజల కోసం సైన్సు” ఉద్యమం బార్క్‌లో తాను చేసిన పనికంటే సమాజంపై లోతైన ప్రభావం చూపిందని చెప్పేవారు. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ 1962లో ఏర్పడింది. ప్రారంభంలో శాస్త్ర సాహిత్యాన్ని మలయాళంలో ప్రజలకు అందించడమే దాని ప్రధాన లక్ష్యం. 1972లో ప్రజా సైన్సు ఉద్యమంగా మారాలని సంస్థ నిర్ణయించుకుని “ప్రజల కోసం సైన్సు” అనే నినాదాన్ని స్వీకరించింది. పరమేశ్వరన్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ‘శాస్త్రగతి’ వంటి పత్రికలు, పుస్తకాలు, ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా విజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లారు. రైతులకు సైన్సు ఎలా ఉపయోగపడుతుంది, పర్యావరణ సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అంశాలపై ప్రజలతో కలిసి పనిచేశారు. సైన్సు ప్రజలకు బోధించే విషయం మాత్రమే కాదని, ప్రజల అనుభవాల నుంచి కూడా నేర్చుకోవాల్సి ఉందని ఆయన నమ్మారు.
ప్రజా సైన్సు ఉద్యమాన్ని అక్షరాస్యతతో అనుసంధానించడం పరమేశ్వరన్ కృషిలో మరో ముఖ్యమైన అంశం. కేరళలో ఎర్నాకుళం జిల్లాలో జరిగిన సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం దీనికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. 1988లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గ్రామాల వారీగా నిరక్షరాస్యులను గుర్తించి, వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలతో చదువు నేర్పించారు. 1990 ఫిబ్రవరి 4న ఎర్నాకుళం దేశంలో తొలి సంపూర్ణ అక్షరాస్య జిల్లాగా మారింది. ఆ అనుభవం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి మార్గం చూపింది. 1991 ఏప్రిల్ 18న కేరళను దేశంలో తొలి సంపూర్ణ అక్షరాస్య రాష్ట్రంగా ప్రకటించారు. ఇది కేవలం చదవడం, రాయడం నేర్పిన కార్యక్రమం కాదు. ప్రజలు తమ సమస్యలను తామే చదివి, అర్థం చేసుకుని, ప్రశ్నించే సామాజిక చైతన్య ఉద్యమంగా నిలిచింది.
కేరళలో పరమేశ్వరన్ భాగస్వామ్యంతో ఎదిగిన ప్రజా సైన్సు ఉద్యమం అక్కడితో ఆగిపోలేదు. 1987లో జరిగిన భారత జన విజ్ఞాన జాతా స్ఫూర్తితో 1988 ఫిబ్రవరి 28న విజయవాడలో జన విజ్ఞాన వేదిక ఏర్పడింది. శాస్త్రీయ దృక్పథం, అక్షరాస్యత, ప్రజారోగ్యం, పర్యావరణం, మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారం వంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సైన్సు ఉద్యమాన్ని జేవీవీ విస్తరించింది. అణు శాస్త్రవేత్తగా ప్రారంభమైన ఎం.పి. పరమేశ్వరన్ జీవితం చివరకు ప్రజా సైన్సు ఉద్యమకారుడిగా విస్తరించింది. సైన్సును ఆయన సామ్యవాద దృక్పథంతో సామాజిక మార్పుతో అనుసంధానించారు. ప్రజలు తమ జీవితాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. ప్రశ్నించాలి. ప్రకృతితో సమన్వయంగా జీవించాలి. తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలి. ఇదే ఆయన జీవిత సందేశం.







కామెంట్‌లు (0)