శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బొమ్మలతో బోధన

1 గంట క్రితం

artspapet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పిల్లలకు బొమ్మలంటే ఎంతో ఇష్టం. అలాంటి బొమ్మలతోనే తరగతి గదిలో బోధన ఉంటే వారిలో ఉత్సాహం రెట్టింపవుతుంది. పుస్తకాల్లోని పాఠాలు బొమ్మల రూపంలో కనిపిస్తే సులభంగా అర్థమవడంతో పాటు ఎక్కువకాలం గుర్తుంటాయి. అలాంటి వినూత్న బోధనకు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి జడ్పీ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లి గోవిందరాజులు నిలువెత్తు నిదర్శనం.

చదువంటే బట్టీ పట్టడం కాదని, పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుని అన్వయించుకోవడమే ముఖ్యమనే భావనతో ప్రతి పాఠానికి అవసరమైన పప్పెట్లు, జంతువుల బొమ్మలు, పటాలను స్వయంగా తయారు చేసి బోధిస్తున్నారు. సబ్బులు, సెలైన్ సీసాలు, ట్యూబులు, స్పాంజి, అట్టలు వంటి చౌక వస్తువులతో బోధనోపకరణాలు తయారు చేయడంలో రాజస్థాన్‌లో శిక్షణ పొందారు. ఫింగర్, మౌత్, గ్లోవ్, స్ట్రింగ్, రాడ్ పప్పెట్లతో పాటు మానవ శరీర నిర్మాణం, రక్త ప్రసరణ, నాడీ మండలం, వైరస్‌ల వ్యాప్తి వంటి అంశాలపై విద్యార్థుల చేతనే నమూనాలు తయారు చేయించి పాఠాలు చెప్పిస్తున్నారు. రంగుల కాగితాలు, మట్టి, ఆకులతో బొమ్మలు, లీఫ్ కార్వింగ్ కళ, బోధనోపకరణాల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులకు కూడా ఈ విధానంపై శిక్షణ అందిస్తున్నారు.

తోలుబొమ్మలాట ప్రదర్శనలు, కార్యశాలల ద్వారా పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య ప్రాముఖ్యత, మానవ హక్కులు, బాల్య వివాహాల నివారణ వంటి సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సరదాగా నేర్చుకున్న పప్పెట్రీ ఆయనకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. బొమ్మలతో క్లిష్టమైన పాఠ్యాంశాలను సులభంగా బోధిస్తూ విద్యార్థుల్లో ఆసక్తి, ఏకాగ్రత, సృజనాత్మకత పెంపొందిస్తున్నారు.

నిరుపయోగమైన వస్తువులతో...

స్పాంజి, థర్మాకోల్, పాత సబ్బులు, సెలైన్ సీసాలు, ప్లాస్టిక్ ట్యూబులు వంటి వ్యర్థ పదార్థాలతో మానవ శరీర నిర్మాణం, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ, జంతువుల ఆకృతులను రూపొందించి విద్యార్థులకు వివరిస్తున్నారు. ఈ బోధనా విధానంపై జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు లీఫ్ కార్వింగ్, సబ్బులు, పుచ్చకాయలపై ప్రముఖుల చిత్రాలను రూపొందించడంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

papet

పిల్లల్లో సృజనాత్మకత

“పిల్లలు పాఠాలను బట్టీ పట్టడం కాదు.. అర్థం చేసుకుని నేర్చుకోవాలి. అదే లక్ష్యంతో బొమ్మలు, పప్పెట్ల ద్వారా బోధిస్తున్నా. దీంతో పాఠ్యాంశంపై ఆసక్తి, ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస పెంపొందుతుంది. పిల్లలే పప్పెట్లతో పాఠాలు చెప్పే స్థాయికి రావడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది.”

– పిల్లి గోవిందరాజులు, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు

జాతీయస్థాయిలో గుర్తింపు

రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా గత దశాబ్దకాలంగా పప్పెట్రీ విద్యావిధానంపై పరిశోధనలు, ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో పప్పెట్ ప్రదర్శనల ద్వారా గుర్తింపు పొందిన ఆయనకు 2012లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2019లో రాష్ట్రస్థాయి టీఎల్‌ఎం ఎక్స్‌పర్ట్ అవార్డు, 2020లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2026లో రెడ్ క్రాస్ పురస్కారం లభించాయి. డ్రాపౌట్స్ తగ్గించేందుకు కృషి చేయడంతో పాటు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, సైకిళ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- యడవల్లి శ్రీనివాసరావు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్