సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజ్యోతిష్య సవాళ్ల వెనుక మాయ

3 రోజుల క్రితం

జ్యోతిష్యం-ఎఐ.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 06:23 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

మనిషి ఆశలు, ఆకాంక్షల మీద వ్యాపారాలు నిర్మించుకోవడం చాలాకాలంగా జరుగుతున్నదే. జ్యోతిష్యం కూడా ఇప్పుడు అలాంటి వ్యాపార రూపమే తీసుకుంది. కంప్యూటర్‌ జ్యోతిష్యం మొదలుకొని, ఇప్పుడు ఏఐని ఆధారంగా చేసుకుని సాగుతున్న ప్రచారం వరకూ... మనిషి నమ్మకాన్ని సొమ్ము చేసుకునే ప్రక్రియలే! ఒకప్పుడు జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లు తమకు తాముగానో, బంధుమిత్రుల ప్రోద్బలంతోనో జ్యోతిష్కులను కలిసేవారు. ఆ తర్వాత జ్యోతిష్యం వ్యాపారంగా మారి టీవీ స్పాన్సర్డ్‌ కార్యక్రమాల రూపం దాల్చింది. ఇప్పుడు ఏఐని ఉపయోగించుకుని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘మీకు నమ్మకం లేదా? రండి.. నిరూపిస్తాం’ అంటూ కొత్త ట్రిక్కులు తెరపైకి వస్తున్నాయి. నమ్మకం లేనివాళ్లను సైతం సవాలు చేసి, వారిని తమ కస్టమర్లుగా మార్చుకోవడమే ఈ ప్రచారాల ఉద్దేశం.

జ్యోతిష్యం శాస్త్రం కాదు. ఎందుకంటే శాస్త్రానికి ఒక స్పష్టమైన వాదన, పరీక్షించదగిన అంచనా, ప్రమాణాలు, గణాంక విశ్లేషణ, పునరావృత ఫలితాలు అవసరం. సరిపోయిన ఫలితాలతో పాటు తప్పిపోయినవాటినీ లెక్కించాలి. ఇతర పరిశోధకులు అదే పరీక్షను పునరావృతం చేసినా ఫలితం నిలబడాలి. కానీ ‘పుట్టిన తేదీ ఇవ్వండి.. మీ గురించి చెబుతాం’, ‘ఏఐని అడగండి.. మీ జీవితంలో జరిగిన విషయాలను ఎంత కచ్చితంగా చెబుతుందో చూడండి’ అనే సోషల్‌ మీడియా సవాళ్లలో ఈ ప్రమాణాలేవీ ఉండవు. అందుకనే అది నమ్మకం వరకూ పరిమితం తప్ప నిరూపణకు నిలబడదు.

నమ్మకాన్ని తయారు చేసే ట్రిక్‌

ఇప్పుడు సోషల్‌ మీడియాలో సాగుతున్న ప్రచారంలో అసలు వ్యూహం - జ్యోతిష్యం అవసరం లేని వారిలో సైతం ఆసక్తి రగిలించి వ్యాపారంలోకి లాగటం. అప్పటివరకూ నమ్మని వ్యక్తి అప్పటికప్పుడు నమ్మినట్టుగా ఈ వీడియోలు తయారు చేయబడతాయి. అవి జ్యోతిష్యం అవసరం లేనివారిని ప్రేరేపిస్తాయి. తమ గురించి తాము తెలుసుకోవాలనే ఉబలాటాన్ని కలిగిస్తాయి. ఇలా వ్యక్తిగత అనుభవాల సంఖ్య పెరుగుతుంది. ‘మీరు బయటకు ధైర్యంగా కనిపించినా లోపల సున్నితమైన వ్యక్తి’, ‘గత అనుభవాలు మిమ్మల్ని జాగ్రత్తగా మార్చాయి’, ‘మీకు గుర్తింపు కావాలి’, ‘త్వరలో జీవితంలో మార్పు వస్తుంది’, ‘మీరు ఒకరిని నమ్మి మోసపోయారు’ వంటి మాటలు అనేకమందికి వర్తిస్తాయి. అయినా అవి మనకే ప్రత్యేకంగా చెప్పినట్టుగా అనిపిస్తాయి. దీనికి బర్నమ్‌ ఎఫెక్ట్‌, కన్ఫర్మేషన్‌ బయాస్‌ వంటి మానసిక ప్రభావాలు కారణం కావచ్చు. మనకు సరిపోయిన మాటలను మాత్రమే గుర్తుంచుకుని, తప్పిపోయినవాటిని పట్టించుకోకపోతే ‘అచ్చం నిజం’ అనే భ్రమ ఏర్పడుతుంది.

ఏఐ కొత్త ముసుగు

ఇప్పుడు ఇదే ప్రచారానికి ఏఐని జత చేస్తున్నారు. కానీ ఏఐ ఒక సాధనం మాత్రమే. ఏఐ ఇచ్చిన సమాధానం శాస్త్రీయ సత్యం కాదు. దాని వెనుక ఉన్న సిద్ధాంతం శాస్త్రీయంగా నిరూపితమైందా, సమాధానం ఏ డేటా ఆధారంగా వచ్చింది, ముందే నిర్ణయించిన ప్రమాణాలతో పరీక్షించారా, యాదృచ్ఛిక అంచనాలతో పోల్చారా, తప్పిపోయిన ఫలితాలను కూడా లెక్కించారా, ఇతరులు అదే పరీక్షను పునరావృతం చేయగలరా అనేదే ముఖ్యం. ‘ఏఐ నా గతాన్ని చెప్పింది’ అనేది ఒక ప్రదర్శన కావచ్చు; అది జ్యోతిష్యానికి శాస్త్రీయ ఆధారం కాదు. ఏఐ పేరుతో పాత నమ్మకానికి కొత్త సాంకేతిక ముసుగు వేయడం వల్ల అది శాస్త్రంగా మారదు.

ఇలాంటి సవాళ్లు మొదట సరదాగా మొదలై క్రమంగా నమ్మకంగా మారే ప్రమాదం ఉంది. ‘కొన్ని విషయాలు నిజమే’ అనిపించిన తర్వాత ‘ఇంకొన్ని కూడా నిజమే కావచ్చు’ అనే భావన రావచ్చు. చివరకు చదువు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం వంటి నిర్ణయాల్లోనూ జ్యోతిష్యాన్ని ఆశ్రయించే పరిస్థితి రావచ్చు. అందుకే ‘నాకు సరిపోయిందా?’ అనే ప్రశ్న కంటే ‘శాస్త్రీయంగా ఎలా పరీక్షించారు?’ అనేదే ముఖ్యం. వాదన స్పష్టంగా ఉందా? ముందే ఫలితాన్ని నిర్వచించారా? నియంత్రిత పరీక్ష చేశారా? తగినంత పెద్ద నమూనాపై పరిశీలించారా? సరిపోయినవాటితో పాటు తప్పిపోయినవాటినీ లెక్కించారా? గణాంకపరంగా ఫలితం విశ్వసనీయమా? ఇతరులు పునరావృతం చేసినా అదే ఫలితం వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేకపోతే అది శాస్త్రీయ ఆధారం కాదు. జ్యోతిష్యం శాస్త్రమైతే ఈ ప్రమాణాల ముందు నిలబడాలి. నిలబడలేకపోతే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ముసుగు జాతకం అయినా, సోషల్‌ మీడియా సవాలు అయినా, ఏఐ అయినా.. ఆధారం లేని వాదనకు సాంకేతికతను జతచేసినంత మాత్రాన అది శాస్త్రం కాదు. శాస్త్రానికి ఆధారం, పరీక్ష, పునరావృత ఫలితం, స్వతంత్ర ధృవీకరణ అవసరం. ఈ ప్రమాణాలే జ్యోతిష్య ప్రచారంలోని మాయను బయటపెడతాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్