సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి

55 నిమిషాల క్రితం

1789916177770.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 07:04 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉండవల్లిలో ఆదివారం జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానికి మొదట విడతగా 34 వేల ఎకరాలిచ్చిన రైతులతో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం రైతులకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సీడ్ క్యాపిటల్‌‌లో ఉన్న ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలతో కూడిన ఆ అధునాతన ఆస్పత్రితోపాటు పాఠశాలలు నిర్మించాలన్న సంగతిని ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. భూములిచ్చిన రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, సిఆర్‌‌డిఎ ఇచ్చిన ప్లాట్ల డాక్యుమెంట్లకు విలువ లేదా? అని ప్రశ్నించారు. ఎస్ఆర్ఎం, విట్ తదితర కాలేజీలకు వందల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టిన ప్రభుత్వం, ఆ భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉచితంగా చదువులు ఎందుకు చెప్పించదని, విజయవాడ పక్కనే గన్నవరం ఎయిర్‌‌పోర్టు ఉండగా, రాజధాని అమరావతిలో వందల ఎకరాలు కేటాయించి మరో ఎయిర్‌ ‌పోర్టు నిర్మించడం అవసరమా? అని ప్రశ్నించారు. రాజధానిలో భూములు కోల్పోయిన వారికి, ఆ భూములు మీద ఆధారపడ్డ కార్మికులకు నేటికీ పింఛను మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌‌నినో ప్రభావం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టులు పూర్తి చేసి, లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా సాగునీరిచ్చి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అడ్వకేట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... అమరావతిలోని ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక తదితర గ్రామాల్లో పర్యటించి రైతుల పరిస్థితి తెలుసుకున్నామని, ప్రభుత్వం దౌర్జన్య పూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు ఈ సందర్భంగా రైతులు తమ దృష్టికి తెచ్చారని, రైతులకు న్యాయమైన పరిహారం కోసం కృషి చేస్తామని చెప్పారు. రైతుల భూములు జోలికి రావద్దని, వస్తే తగిన అమూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. సమావేశంలో డాక్టర్ గాదె కన్నారావు నాయుడు, మున్నంగి శ్రీధర్‌రెడ్డి, పి.వీరస్వామి రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్